Kadapa Mayor Suresh Babu Remove: కడప మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ కె. సురేష్ బాబు ను తొలగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.   ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు.  కె. సురేష్ బాబు 2021లో కడప మున్సిపల్ కార్పొరేషన్‌ మేయర్‌గా ఎన్నికయ్యారు. సురేష్ బాబు తన సన్నిహిత బంధువులు నడుపుతున్న  *వర్ధిని కన్స్ట్రక్షన్స్ అనే సంస్థకు కడప మున్సిపల్ కార్పొరేషన్‌లో కాంట్రాక్టులు కేటాయించారని ఆరోపణలు వచ్చాయి. ఇది ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్స్ చట్టం, 1955  లోని నిబంధనలను ఉల్లంఘనగా నిరూపణ అయింది.  

Continues below advertisement


కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి  ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. సురేష్ బాబు కుటుంబ సభ్యుల సంస్థకు కాంట్రాక్టులు కేటాయించడం ద్వారా మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆరోపించారు.   కడప మున్సిపల్ కమిషనర్  వర్ధిని కన్స్ట్రక్షన్స్‌కు కాంట్రాక్టుల కేటాయింపుపై విచారణ చేశారు.  సురేష్ బాబుకు నోటీసు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం  మరో షోకాజ్ నోటీసు జారీ చేసింది.  విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగం నిర్వహించిన విచారణ నివేదిక ఆధారంగా  కాంట్రాక్టులలో అక్రమాలు జరిగాయని నిర్దారించారు.   
 
ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై సురేష్ బాబు  హైకోర్టుకు వెళ్లారు.  సురేష్ బాబు తన తరఫు న్యాయవాది  ఎన్నికైన తర్వాత అనర్హత కోసం సెక్షన్ 23-D కింద జిల్లా కోర్టుకు రిఫర్ చేయాలని వాదించారు.  సెక్షన్ 679-B కింద షోకాజ్ నోటీసు జారీ చేయడం అధికార పరిధి లేనిదని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ వాదనను తిరస్కరించింది, సెక్షన్ 679-B కింద రాష్ట్ర ప్రభుత్వానికి మేయర్‌ను తొలగించే అధికారం స్వతంత్రంగా ఉందని స్పష్టం చేసింది.   సురేష్ బాబును 15 రోజుల్లో వివరణ సమర్పించాలని ఆదేశించింది. గడువు ముగిసిన తర్వాత విజిలెన్స్ విచారణ నివేదిక ఆధారంగా, సురేష్ బాబు మున్సిపల్ చట్టాన్ని ఉల్లంఘించారని నిర్ధారించిన ప్రభుత్వం, అతన్ని మేయర్ పదవి నుంచి తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసింది.


ఎమ్మెల్యేకు కుర్చీ వేయకపోవడం వల్లనే కుర్చీ పోగొట్టుకున్నారా ?


అయితే మేయర్ ను పదవి నుంచి తొలగించడాన్ని వైసీపీ తప్పు పట్టింది. కౌన్సిల్ సమావేశాల్లో ఎమ్మెల్యే మాధవీరెడ్డికి కుర్చీ వేయలేదన్న కోపంతోనే ...మేయర్ పదవి నుంచి సురేష్ బాబును తప్పించారని వారు ఆరోపిస్తున్నారు. గతంలో కడప ఎమ్మెల్యేకు కౌన్సిల్ సమావేశాల్లో.. మేయర్ పక్కనే సీటు వేసేవారు.అయితే ఈ సారి కడప నుంచి టీడీపీ తరపున ఎమ్మెల్యేగా మాధవీరెడ్డి గెలిచారు. కడప కార్పొరేషన్ లో మొత్తం .. వైసీపీసభ్యులే ఉన్నారు. కొంత మంది పార్టీ ఫిరాయించారు. అయినా బలం వారిదే. అధికార పార్టీ ఎమ్మెల్యేకు  కౌన్సిల్ లో కుర్చి వేసేది లేదని మేయర్ స్పష్టం చేశారు. ఈ అంశంపై దుమారం రేగింది. చివరికి ఎమ్మెల్యే...  మేయర్ అక్రమాలపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడం.. విచారణ జరిపి పదవి నుంచి తీసేయడం జరిగిపోయాయి. అయితే ఇప్పుడు మళ్లీ వైసీపీ నుంచే మేయర్ ను ఎన్నుకునే అవకాశం ఉంది.  ఇప్పటికి కడప కార్పొరేటర్లలో ఎక్కువ మంది వైసీపీ వారే.