Turkish Parliament Attack: 


టర్కీ పార్లమెంట్‌కి సమీపంలోనే దాడి..


టర్కీ రాజధాని అంకారాలో పార్లమెంట్ భవనానికి సమీపంలో భారీ పేలుడు అలజడి సృష్టించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ పేలుడికి కారణమేంటన్నదీ విచారణ చేపడుతున్నారు. అయితే...గన్‌ఫైర్ కారణంగానే ఈ పేలుడు సంభవించినట్టు ప్రాథమికంగా భావించారు. కానీ టర్కీ అంతర్గత భద్రతా వ్యవహారాల మంత్రి (Interior Minister) అలీ యెర్లికయ (Ali Yerlikaya) ట్విటర్‌లో దీనిపై అధికారికంగా పోస్ట్ చేశారు. ఓ ఉగ్రవాది ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడని చెప్పారు. దీనిపైనా ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.





మంత్రి కార్యాలయం ఎంట్రెన్స్ గేట్ వద్దే ఈ పేలుడు సంభవించినట్టు వెల్లడించారు. ఇది కచ్చితంగా ఉగ్రదాడే అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఈ పేలుడులో ఇద్దరు పోలీసు అధికారులు గాయపడినట్టు మంత్రి తెలిపారు. ఇద్దరు ఉగ్రవాదుల్లో ఒకరిని భద్రతా బలగాలు మట్టుబెట్టారు. మరొకరు తనను తాను పేల్చుకుని చనిపోయాడు. ఈ పేలుడు జరిగిన దగ్గరే కాల్పులు శబ్దాలు వినిపించాయని స్థానిక మీడియా రిపోర్ట్ చేసింది. బాంబు స్క్వాడ్స్ పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పార్క్ చేసి ఉన్న ఓ వాహనానికి సమీపంలో తనిఖీలు చేపడుతున్నారు. ఇదే వాహనంలో ఆ ఇద్దరు ఉగ్రవాదులు వచ్చి దాడి చేసినట్టు ప్రాథమికంగా నిర్ధరించారు. ఇదే ప్రాంతంలో టర్కీ భద్రతా బలగాలకు, ఆ ఉగ్రవాదులకు మధ్య కాల్పులు జరిగినట్టు అక్కడి మీడియా వివరించింది. దాదాపు మూడు నెలలుగా టర్కీ పార్లమెంట్‌ కార్యకలాపాలు సాగడం లేదు. వేసవి కాలంగా విరామం ఇచ్చారు. ఇవాళ్టి నుంచే (అక్టోబర్ 1) మళ్లీ సమావేశాలు మొదలయ్యాయి. సరిగ్గా ఇదే సమయంలో ఉగ్రవాదులు దాడి చేయడం అలజడి రేపింది. ఒక్కసారిగా భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి.