Afghanistan Embassy:
ఎంబసీ మూసివేత..
అఫ్గనిస్థాన్ సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్‌లోని ఎంబసీ కార్యాలయాన్ని మూసేస్తున్నట్టు ప్రకటించింది. భారత్ సహకరించడం లేదని, అందుకే కార్యకలాపాలు కొనసాగించలేకపోతున్నామని వెల్లడించింది. అఫ్గనిస్థాన్ అవసరాలను భారత్ ఏ మాత్రం లెక్క చేయడం లేదని, దీంతో పాటు స్టాఫ్ తగ్గిపోవడం మిగతా వనరులకూ సమస్యలు తలెత్తడం వల్ల మూసేయాల్సి వస్తోందని స్పష్టం చేసింది. అక్టోబర్ 1వ తేదీ నుంచి ఢిల్లీలోని ఎంబసీ కార్యాలయ కార్యకలాపాలను నిలిపివేస్తున్నట్టు తెలిపింది. ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి రావడం చాలా దురదృష్టకరమని, కొనసాగించడం సవాలుగా మారిందని వివరించింది. దౌత్యవేత్తలకు వీసా రెన్యువల్ విషయంలోనూ ఆలస్యం జరుగుతోందని, ఈ విషయంలో భారత్ చొరవ చూపించకపోవడం వల్ల కార్యాలయాన్ని మూసేయక తప్పడం లేదని నోట్ విడుదల చేసింది.
"ఢిల్లీలోని మా ఎంబసీ కార్యాలయాన్ని మూసేస్తున్నాం. భారత్ నుంచి మాకు ఆశించిన స్థాయిలో మద్దతు రావడం లేదు. అందుకే అక్టోబర్ 1 నుంచి కార్యకలాపాలు నిలిపివేయాలని నిర్ణయించుకున్నాం. ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి రావడం విచారకరం. అఫ్గనిస్థాన్ అవసరాలేంటో భారత్ అర్థం చేసుకోవడం లేదు. స్టాఫ్ కూడా బాగా తగ్గిపోయింది. మిగతా వనరులకూ కొరత ఏర్పడింది. అందుకే మా పౌరులకు సరైన విధంగా సేవలు అందించలేకపోతున్నాం. కార్యకలాపాలు కొనసాగించడం మాకు సవాలుగా మారింది. ఈ నిర్ణయం తీసుకోవాల్సి రావడం పట్ల చాలా చింతిస్తున్నాం"
- అఫ్గనిస్థాన్ ఎంబసీ కార్యాలయం