Sikh Restaurant Owner: 



యూకేలో అలజడి..
 
భారత్‌ కెనడా మధ్య ముదురుతున్న వివాదం విదేశాల్లోనూ అలజడి రేపుతోంది. ఇప్పటికే స్కాట్‌లాండ్‌లో భారత హైకమిషనర్‌ ఓ గురుద్వారలోకి వెళ్లగా కొందరు సిక్కులు అడ్డుకున్నారు. ఈ ఘటన సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరోసారి ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. యూకేలోని సిక్కు రెస్టారెంట్ ఓనర్‌ కార్‌పై దాడి జరిగింది. ఖలిస్థాన్ మద్దతుదారులు తన కార్‌ని ధ్వంసం చేశారని ఆ ఓనర్ వెల్లడించారు. గతంలో ఖలిస్థాన్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ ఓ పోస్ట్ పెట్టాడు హర్మన్ సింగ్. అప్పటి నుంచి ఖలిస్థాన్ సపోర్టర్స్ ఆయనను టార్గెట్ చేశారు. ఈ ఏడాది మే నెలలో సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌ని కారణంగా చూపించి పదేపదే దాడులు చేస్తున్నారు. చంపేస్తామంటూ కుటుంబాన్నీ బెదిరిస్తున్నట్టు హర్మన్ సింగ్ చెప్పాడు. ఇంటి ముంది పార్క్ చేసి ఉన్న రెండు కార్లనూ ధ్వంసం చేసినట్టు ఆరోపించాడు. తరవాతి రోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 


"ఖలిస్థాన్ మద్దతుదారులు మా ఇంటి ముందుకి వచ్చారు. ముందు రెడ్ పెయింట్‌ని కార్‌లపై వేశారు. రక్తపాతం తప్పదని ఇలా హెచ్చరించారు. ఆ తరవాత కార్ ముందు అద్దాల్ని ధ్వంసం చేశారు. గత 8 నెలల్లో నాలుగు సార్లు నాపై దాడి చేశారు. వేలాది సార్లు నాకు కాల్ చేసి బెదిరించారు. నా భార్యని, కూతురుని అత్యాచారం చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఖలిస్థాన్ ఉద్యమానికి వ్యతిరేకంగా నేను పెట్టిన పోస్ట్‌ని చూసే ఇలా చేస్తున్నారు. నా కూతురి స్కూల్ అడ్రెస్ కూడా తెలుసని చెప్పారు. కానీ పోలీసులు మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు"


- హర్మన్ సింగ్, బాధితుడు, యూకే 






ఈ ఏడాది మే నెలలో టిక్‌టాక్‌లో హర్మన్ సింగ్ ఖలిస్థాన్ ఉద్యమాన్ని వ్యతిరేకిస్తూ ఓ వీడియో అప్‌లోడ్ చేశాడు. కేవలం రెండు రోజుల్లోనే ఈ వీడియో వైరల్ అయింది. అప్పటి నుంచి ఖలిస్థాన్ సపోర్టర్స్ హర్మన్ సింగ్‌కి బెదిరింపు కాల్స్ చేస్తున్నారు. ఆ వీడియో డిలీట్ చేయాలని బెదిరించారు. లేదంటే కుటుంబ సభ్యుల్ని చంపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఐదుగురు ఖలిస్థాన్ మద్దతుదారులు తన రెస్టారెంట్‌పైనా దాడి చేసినట్టు చెప్పాడు హర్మన్ సింగ్. 


స్కాట్‌లాండ్‌లో ఇండియన్ హై కమిషనర్ విక్రమ్ దొరైస్వామిని (Vikram Doraiswami) గురుద్వారలోకి రానివ్వకుండా అడ్డుకోవడం సంచలనమైంది. బ్రిటీష్ సిక్కులు కొందరు ఆయనను అడ్డగించారు. "మిమ్మల్ని ఎవరూ ఆహ్వానించలేదు" అంటూ అక్కడి నుంచి వెళ్లిపోవాలని పట్టుబట్టారు. గురుద్వార కమిటీతో సమావేశమయ్యేందుకు విక్రమ్ దొరైస్వామి వచ్చినట్టు సమాచారం. కానీ...కొందరు సిక్కులు ఆయనను అడ్డగించారు. కొద్ది సేపు ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆయన రావడంపై గురుద్వార కమిటీ కూడా విచారం వ్యక్తం చేసిందని అక్కడి సిక్కు కార్యకర్తలు కొందరు తేల్చి చెప్పారు. నిజానికి యూకేలో ఏ గురుద్వారలోకి అయినా భారతీయులున్ని రానివ్వడం లేదు. భారత్, బ్రిటన్ మధ్య సత్సంబంధాలే ఉన్నప్పటికీ...ఖలిస్థాన్‌ ఉగ్రవాది హర్‌దీప్ సింగ్ నిజ్జర్ హత్య తరవాత బ్రిటన్‌లోని సిక్కుల్లో భారత్‌పై వ్యతిరేకత పెరిగింది. అందుకే ఇండియన్ హై కమిషనర్‌ని గురుద్వారలోకి రానివ్వకుండా ఇలా అడ్డుకున్నారు సిక్కులు.


Also Read: నవంబర్ నాటికి భారత్‌కి శివాజీ పులిగోళ్ల ఆయుధం, త్వరలోనే లండన్‌కి మహారాష్ట్ర మంత్రి