Shivaji's Tiger Claw:



త్వరలోనే భారత్‌కి..


ఛత్రపతి శివాజీ ఉపయోగించిన పులిగోళ్ల ఆయుధం వాగ్‌నఖ్ (Wagh Nakh)ని భారత్‌కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు వేగవంతం అయ్యాయి. ఛత్రపతి శివాజీ పట్టాభిషేకం జరిగి ఈ ఏడాదితో 350 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా లండన్‌లో ఉన్న ఆయన ఆయుధాన్ని భారత్‌కి తీసుకొచ్చి నివాళి అర్పించాలని భావిస్తోంది మహారాష్ట్ర ప్రభుత్వం. ఇక్కడే మూడేళ్లపాటు మ్యూజియంలో ఉంచి ప్రజల సందర్శనకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ప్రస్తుతం ఈ పులిగోళ్ల ఆయుధం లండన్‌లోని Victoria and Albert Museumలో ఉంది. ఇప్పటికే మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగన్‌తివార్ లండన్‌ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. భారత్‌కి తీసుకొచ్చేందుకు అవసరమైన అన్ని అనుమతులనూ తీసుకున్నారు. త్వరలోనే ఆయన తన టీమ్‌తో కలిసి లండన్‌కి వెళ్లనున్నారు. మ్యూజియం అధికారులతో ఒప్పందం కుదుర్చుకోనున్నారు. ఈ అగ్రిమెంట్ పూర్తైన తరవాతే ఆ ఆయుధాన్ని ఇండియాకి తీసుకొచ్చేందుకు వీలవుతుంది. 


"త్వరలోనే లండన్‌కి వెళ్లి అక్కడి విక్టోరియా మ్యూజియంలో ఉన్న వాగ్‌నఖ్‌ని భారత్‌కి తీసుకొస్తాం. నవంబర్ నాటికి అది భారత్‌లో ఉండే అవకాశముంది. ఈ మేరకు మ్యూజియం అధికారులతో ఒప్పందం కుదుర్చుకోనున్నాం. ఛత్రపతి శివాజీ అఫ్జల్ ఖాన్‌పై యుద్ధం చేసి ఈ ఆయుధంతోనే చంపేశాడు. అందుకే అదే తేదీన భారత్‌లో ఈ ఆయుధం అందుబాటులో ఉండేలా చూస్తున్నాం"


- సుధీర్ ముంగన్‌తివార్, మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి 


శివాజీ మ్యూజియంలో ప్రదర్శన..


సౌత్‌ ముంబయిలోని శివాజీ మహారాజ్ మ్యూజియంలో (Chhatrapati Shivaji Maharaj Museum) ఈ ఆయుధాన్ని ప్రదర్శనకు ఉంచనున్నారు. మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించాలన్న ఛత్రపతి శివాజీ పోరాటం 1659లో కీలక మలుపు తిరిగింది. అఫ్జల్ ఖాన్‌కి చెందిన అదిల్‌షాహి దళాలను మరాఠీలు ఓడించారు. ఆ సమయంలో శివాజీ ముందుండి పోరాటాన్ని నడిపారు. ఆ సమయంలో అఫ్జల్‌ ఖాన్‌ని ఓ పులి గోళ్ల ఆయుధంతో చంపాడు శివాజీ. ఆయన ధైర్యసాహసాలకు ఓ మచ్చుతునకలా చరిత్రలో మిగిలిపోయింది ఈ ఘటన.  శివాజీ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న ఈ ఆయుధాన్ని ఆయన వారసులు ఈస్ట్ ఇండియా కంపెనీ ఆఫీసర్ జేమ్స్ గ్రాంట్ డఫ్‌కి ఇచ్చారు. ఇండియాలో సర్వీస్ ముగిసిన తరవాత జేమ్స్ గ్రాంట్ తనతో పాటు ఆ ఆయుధాన్ని బ్రిటన్‌కి తీసుకెళ్లారు. ఆ తరవాత డఫ్ వారసులు దాన్ని మ్యూజియంకి అందించారు. అప్పటి నుంచి అక్కడే భద్రపరిచారు. ఈ ఆయుధం వెనక్కి తీసుకొచ్చేందుకు మహారాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి సుధీర్ ముంగంతివార్ గట్టి ప్రయత్నమే చేశారు. ఈ ఫలితంగానే భారత్‌కి త్వరలోనే ఈ ఆయుధం రానుంది. 


"ఛత్రపతి శివాజీ ఆయుధమైన వఘ్ నఖ్ అమూల్యమైంది. మహారాష్ట్ర ప్రజలకు ఈ ఆయుధానికి ఎంతో అనుబంధం ఉంది. ఇది తిరిగి భారత్‌కి వస్తుండడం చాలా సంతోషం. ఈ ఆయుధాన్ని సంరక్షించాల్సిన బాధ్యత ఉంది. అందుకే...రూ.50 లక్షల నిధులు కేటాయించాం. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిందే ఇందుకు ఆమోదం తెలిపారు"


- మహారాష్ట్ర ప్రభుత్వం 


Also Read: అఫ్గనిస్థాన్ సంచలన నిర్ణయం, ఢిల్లీలోని రాయబార కార్యాలయం మూసివేత - భారత్ సహకరించడం లేదని అసహనం