Viral Video: కొందరు వ్యక్తులు చాలా చిత్ర విచిత్రంగా ప్రవర్తిస్తారు. వారి చేష్టలు చూసి నవ్వాలో.. ఏడ్వాలో తెలియదు. ఇంటర్నెట్ లో సెన్సేషన్ కావాలని, సోషల్ మీడియాలో వైరల్ కావాలని రకరకాల స్టంట్లు చేస్తుంటారు. అందులో కొన్ని నవ్వు తెప్పిస్తే.. మరికొన్ని ఆగ్రహాన్ని తెప్పిస్తాయి. ఇదెక్కడి పిచ్చిరా నాయనా అంటూ నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తుంటారు, మరికొందరు కోపాన్ని ప్రదర్శిస్తూ తిడుతూ కామెంట్లు పెడుతుంటారు. అలాంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. న్యూయార్క్ నగరాన్ని వరదలు ముంచెత్తిన విషయం తెలిసిందే. ఈ వరదల్లోకి ఓ వ్యక్తి తన కుక్కతో వాకింగ్ కు వచ్చాడు. ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. 


ఎవరి పిచ్చి వారికి ఆనందం అన్నట్లుగా.. నీకు ఇదేం పిచ్చి నాయనా అంటూ ఆ వీడియో చూసిన నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఒక వైపు న్యూయార్క్ నగరంలోని రోడ్లు, వీధులు.. నదులను తలపిస్తుంటే.. అందులో కుక్కతో వాకింగ్ ఏంటని ప్రశ్నిస్తున్నారు. మోకాలి లోతు వరకు నీటిలో కుక్క, కుక్కకు కట్టిన తాడుతో ఆ వ్యక్తి రోడ్డుపై నిల్చున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఒకవైపు నీట మునిగిన రోడ్డు, మరోవైపు జోరుగా కురుస్తున్న వర్షంలో అతగాడు ఫోన్ పట్టుకుని వీడియో చిత్రీకరిస్తున్నట్లు కనిపిస్తోంది.


ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వగానే నెటిజన్లు అతగాడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జోరు వానలో, వరద నీటిలో అలా బయటకెళ్లడం సరదాగానే అనిపించవచ్చని.. కానీ, అమాయకపు శునకాన్ని ప్రమాదకరంగా బయటకు తీసుకురావడం ఎంతమాత్రమూ మంచిది కాదని కామెంట్ చేశారు ఓ యూజర్. అపరిశుభ్రమైన నీటిలో కుక్కను వాకింగ్ కు తీసుకెళ్లడమేంటి అంటూ మరొకరు ప్రశ్నించారు. వరద నీటిలో, వానకు తడిసిన ఆ శునకాన్ని ఇంటికి తీసుకెళ్లి శుభ్రం చేసి వెచ్చదనం అందించాలని సూచించారు. వరదలో సెల్ఫీ దిగి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడానికి బ్యాక్టీరియాతో నిండిపోయిన నీటిలోకి రావడం మంచిదికాదని మరొకరు ఆగ్రహం వ్యక్తం చేశారు.






న్యూయార్క్ నగరంలో వరదలు..


అమెరికాలో న్యూయార్క్‌ నగరాన్ని వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు వీధులన్నీ చెరువుల్లా మారిపోయాయి. అపార్ట్‌మెంట్‌లలోని సెల్లార్‌లన్నీ జలమయం అయ్యాయి. ఎయిర్‌పోర్ట్ కూడా మూసేయాల్సి వచ్చింది. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని స్థాయిలో వరదలు వచ్చినట్టు స్థానిక మీడియా వెల్లడించింది.  7.97 అంగుళాల వర్షపాతం నమోదైంది. 1948 తరవాత ఇదే రికార్డు. దాదాపు 44 ఫ్లైట్స్‌ ఆలస్యంగా నడుస్తున్నాయి. 50 ఫ్లైట్‌ సర్వీస్‌లను రద్దు చేశారు. భారీ వర్షంతో పాటు ఈదురు గాలులు వీచాయి. ఫలితంగా ట్రాన్స్‌ఫార్మర్‌లపై ప్రభావం పడింది. నార్త్ కరోలినా, వర్జీనియా, పెన్సిల్వేనియా, న్యూజెర్సీల్లో కరెంట్ కష్టాలు మొదలయ్యాయి. అనుకోకుండా భారీ వర్షం కురవడం వల్ల జనజీవనం స్తంభించిపోయింది. అమెరికాలో పలు రాష్ట్రాల్లో 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అక్కడి వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ వర్షపాతం ఇంకా పెరిగే అవకాశముందని అంచనా వేస్తున్నారు. అయితే...ఈ వర్షాల కారణంగా ఎవరూ చనిపోలేదని, అలాంటి సంఘటనలేవీ జరగలేదని స్పష్టం చేశారు అధికారులు. వరదల్లో చిక్కుకున్న వాళ్లను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇప్పటి వరకూ మరణాలు నమోదు కాకపోయినా...ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు.