ఒకప్పుడు నిర్మాణ సంస్థలు అనేవి కేవలం ఒక భాషకు మాత్రమే పరిమితం అయ్యేవి. ఏదో ఒకటి తప్పా చాలావరకు సంస్థలు.. ఇతర భాషల్లో కూడా సినిమాలు తెరకెక్కించడానికి సాహసం చేసేవి కాదు. కానీ రోజులు మారిపోయాయి. కేవలం ఒక భాషలోనే కాకుండా మిగతా భాషల్లో కూడా చిత్రాలను నిర్మించి, మంచి సినిమాలను ప్రేక్షకుల దగ్గరకు తీసుకువెళ్లి, రెండు చేతులా సంపాదించాలని నిర్మాతలు అనుకుంటున్నారు. తాజాగా తమిళ సినీ పరిశ్రమకు చెందిన అత్యంత ప్రతిష్టాత్మకమైన నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్.. మలయాళంలో తమ డెబ్యూకు సిద్ధమయినట్టు ప్రకటించింది. అంతే కాకుండా ఈ డెబ్యూ కోసం ఒక బ్లాక్‌బస్టర్ మూవీకి సీక్వెల్‌ను కూడా సెలక్ట్ చేసుకుంది.


మలయాళంలో లైకా డెబ్యూ..
కోలీవుడ్‌లో లైకా ప్రొడక్షన్స్‌కు మంచి గుర్తింపు ఉంది. సినిమా బడ్జెట్ ఎంత అయినా సరే దర్శకుడిని నమ్మి ఎంత డబ్బు పెట్టడానికి అయినా లైకా ముందుంటుంది అని ప్రేక్షకులకు సైతం తెలుసు. అలాంటి లైకా ప్రొడక్షన్స్ ఇప్పటివరకు ఎన్నో ప్రతిష్టాత్మకమైన చిత్రాలను నిర్మించింది. కానీ అన్ని తమిళంలోనే నిర్మించింది. ఈసారి కాస్త రూటు మార్చాలనుకున్న లైకా.. మలయాళంలో కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంటోంది. తాజాగా మలయాళంలో డెబ్యూ చేస్తున్నట్టుగా అధికారిక ట్విటర్ అకౌంట్ ద్వారా బయటపెట్టింది. అంతే కాకుండా అసలు తాము ఏ సినిమాను నిర్మించాలి అనుకుంటున్నామో చెప్పి ప్రేక్షకులను మరింత షాక్‌కు గురిచేసింది.


‘గాడ్‌ఫాదర్’గా తెలుగులో..
మలయాళంలో మోహన్‌లాల్ హీరోగా పృథ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లూసీఫర్’. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం.. 2019లో విడుదలయ్యి సెన్సేషన్‌ను క్రియేట్ చేసింది. పృథ్విరాజ్ సుకుమారన్ మల్టీ టాలెంటెడ్ అని మరోసారి ప్రూవ్ చేసింది. ఈ సినిమా కథ ఎంతో నచ్చిన మెగాస్టార్ చిరంజీవి.. దీనిని ‘గాడ్‌ఫాదర్’ పేరుతో రీమేక్ చేశారు. అప్పటికే ‘లూసీఫర్’ చిత్రం తెలుగులో ప్రేక్షకులకు అందుబాటులో ఉన్నా.. ‘గాడ్‌ఫాదర్’ కూడా క్లీన్ హిట్‌ను సాధించింది. అలాంటి ‘లూసీఫర్’ చిత్రానికి త్వరలోనే సీక్వెల్ తెరకెక్కనుంది. ఆ సీక్వెల్‌తో లైకా ప్రొడక్షన్స్.. మాలీవుడ్‌లోకి అడుగుపెట్టనుంది. 


లాంచ్ వీడియోతో పాటు..
‘గాడ్స్ ఓన్ కంట్రీ లైకా ప్రొడక్షన్స్‌కు స్వాగతం పలుకుతోంది. ఎల్‌2ఈ ఎంపురన్‌తో మలయాళ సినిమాలో డెబ్యూ చేయడం చాలా ఆనందంగా ఉంది. బ్లాక్‌బస్టర్ లూసీఫర్ సెకండ్ ఇన్‌స్టాల్మెంట్ కోసం ఆశీర్వాద్ సినిమాస్‌తో చేతులు కలుపుతున్నాం.’ అంటూ లైకా ప్రొడక్షన్స్ ట్వీట్ చేసింది. అంతే కాకుండా లూసీఫర్ సీక్వెల్.. కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా విడుదల అవుతుందని లైకా క్లారిటీ ఇచ్చింది. ఈ ట్వీట్‌లోని లూసీఫర్ 2కు సంబంధించిన లాంచ్ వీడియోను కూడా అటాచ్ చేసింది. దీనిని బట్టి చూస్తే లూసీఫర్‌లాగానే ఈ సీక్వెల్‌లో కూడా ఎన్నో పొలిటికల్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయని అర్థమవుతోంది. మరి ‘లూసీఫర్’ను ‘గాడ్‌ఫాదర్’గా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చిన చిరు.. ఈ సక్వెల్ రైట్స్ కూడా కొని రీమేక్స్ చేస్తారా అని అప్పుడే ఫ్యాన్స్‌లో అనుమానాలు మొదలయ్యాయి. ఇక మలయాళ ప్రేక్షకులు అయితే ‘లూసీఫర్’లాగానే ఈ సీక్వెల్ కూడా కచ్చితంగా హిట్ అవుతుందని ఫిక్స్ అయిపోతున్నారు.






Also Read: ఎట్టకేలకు నోరు విప్పిన సిద్ధార్థ్, బెంగళూరు అవమానంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial