Muhammad Yunus: తీవ్ర రాజకీయ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న బంగ్లాదేశ్‌(Bangladesh)లో శాంతిని నెలకొల్పేందుకు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పడింది. నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మహమ్మద్ యూనస్‌(Mohammad Yunus) దీనికి నేతృత్వం వహించనున్నారు. ఆర్మీపాలనకు ససేమిరా అనడంతోపాటు, ఎన్నికల్లో ఓటమిపాలైన వారికి అవకాశం ఇవ్వొద్దని యువత, విద్యార్థులు హెచ్చరించడంతో....మహమ్మద్‌ యూనస్‌ నేతృత్వంలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటైంది.


బంగ్లాలో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు
రిజర్వేషన్లు చిచ్చురాజుకుని రాజకీయ సంక్షోభం తలెత్తిన బంగ్లాదేశ్‌(Bangladesh)లో పరిస్థితులు మెల్లగా అదుపులోకి వస్తున్నాయి. ప్రధాని హసీనా(Hasina) రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోవడం...అధ్యక్షుడు పార్లమెంట్‌ను రద్దు చేయడంతో కొత్తగా ఎన్నికలకు మార్గం సుగమమైంది. అప్పటి వరకు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయగా...దీనికి నోబెల్ శాంతి పురస్కారం గ్రహీత మహమ్మద్ యూనస్‌ నేతృత్వం వహించనున్నారు. బంగ్లాదేశ్ లెప్టినెంట్‌ జనరల్‌గా ఉన్న మహమ్మద్ సైఫుల్‌ అలాంను విదేశాంగ మంత్రిగా నియమించారు.


ఎవరీ మహమ్మద్ యూనస్‌
1940లో చిట్టగాంగ్‌లో జన్మించిన మహ్మద్ యూనస్...ఓ సామాజిక కార్యకర్త. పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న బంగ్లా ప్రజలను ఆదుకోవాలని ఎంతో తపించేవారు. వారిని ఆర్థికంగా పైకి తీసుకురావడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు. స్వతహాగా బ్యాంకరు, ఆర్థికవేత్త అయిన యూనస్‌...మైక్రోఫైనాన్స్‌(Micro Finance) బ్యాంకు ద్వారా లక్షల మంది బంగ్లా ప్రజలను పేదరికం నుంచి బయటపడేసిన ఘనత ఆయనదే. దీనికి గానూ 2006లో ఆయన్ను నోబెల్‌ శాంతి బహుమతి వరించింది. 2012 నుంచి 2018 వరకు స్కాట్లాండ్‌లోని గ్లాస్గో కాలెడోనియన్‌ వర్సిటీకి ఛాన్సలర్‌గా పనిచేశారు.


చిట్టగాంగ్(Chittagong) విశ్వవిద్యాలయంలో ఆర్థికశాస్త్ర ప్రొఫెసర్‌గానూ సేవలు అందించారు. అందుకే ఆయన అంటే అక్కడి ప్రజలకు ఎంతో గౌరవం. ముఖ్యంగా బంగ్లాదేశ్ యువతో ఎంతో స్ఫూర్తిని నింపిన ఆయనే తాత్కాలిక ప్రభుత్వానికి నేతృత్వం వహించాలని వారు డిమాండ్ చేశారు. ఆర్మీ పాలను గానీ, ఆర్మీ మద్దతు ఉండే మరే ప్రభుత్వ పాలనకు అంగీకరించేది లేదని తేల్చి చెప్పారు. పట్టుబట్టి మరీ ఆయన్ను తాత్కాలిక ప్రధానిగా నియమించుకున్నారు. అయితే యూనస్‌ కూడా హసీనా బాధితుడే. ఆమె నిర్ణయాలు వ్యతిరేకించినందుకు గానూ యూనస్‌పైనా ఎన్నో కేసులు నమోదయ్యాయి. ఆరు నెలలు జైలుశిక్ష కూడా అనుభవించి వచ్చాడు.


Also Read: ఒక వ్యక్తికి కాదు బంగ్లాదేశ ప్రజలకు భారత్ మద్దతు ఉండాలి; ఢిల్లీ, ఢాకా స్నేహితులుగా సాగాలి: ఏబీపీతో ముహమ్మద్ యూనస్


భారీగా ప్రక్షాళన
హసీనా ప్రభుత్వంతో అంటకాగిన అధికారులు, నేతలు మొత్తాన్ని తాత్కాలిక ప్రభుత్వం తొలగింపు చర్యలు చేపట్టింది. బంగ్లాదేశ్‌ సైన్యం మేజర్ జనరల్‌  జియావుల్ అహ్‌సాన్‌ను తొలిగించింది. మరికొందరు లెఫ్టినెంట్‌ జనరళ్లకూ ఇదే గతిపట్టింది. హసీనా ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన వారిని అరెస్ట్ చేశారు. భారత్‌కు పారిపోయేందుకు యత్నించిన ఐటీమంత్రి జునైద్‌ అహ్మద్‌ పలక్‌, విదేశాంగ మాజీమంత్రి హసన్ మహమూద్‌ను విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. మరికొందరు హసీనా కన్నా ముందే వివిధ దేశాలకు పరారయ్యారు. 


భారత్‌కు సంకటస్థితి
బంగ్లాదేశ్‌లో రాజకీయ సంక్షోభంతో భారత్‌కు ఇబ్బందులు తప్పకపోవచ్చు. అత్యంత నమ్మకమైన మిత్రదేశంగా ఉన్న బంగ్లాలో..కొత్తగా ఏర్పడే ప్రభుత్వం అంతగా కలిసి వస్తుందో లేదోనని ఆందోళనగా ఉంది. సుమారు 4 వేల కిలోమీటర్లకు పైగా సరిహద్దు కలిగిన బంగ్లాదేశ్‌ సఖ్యతగా లేకుంటే అది చైనాకు వరంగా మారనుంది. పైగా ఇప్పుడు హసీనాకు ఆశ్రయం కల్పించినందుకు బంగ్లాదేశ్ విపక్ష నేతలు, ఆందోళనకారులు ఆగ్రహంగా ఉన్నారు. భవిష్యత్‌లో వీరే అధికారంలో చేపడితే కచ్చితంగా భారత్‌తో సత్సంబంధాలు కొనసాగిస్తారో లేదో అన్న అనుమానాలు ఉన్నాయి. 


Also Read: షేక్ హసీనాను పారిపోయేలా చేసింది ఓ విద్యార్థి ఉద్యమమే - ఆ కుర్రాడి వెనకే యువత అంతా !