Gotabaya Rajapaksa Resigns:    శ్రీలంక అధ్యక్ష పదవికి గోటబయ రాజపక్సే రాజీనామా చేశారు.  ఆయన రాజీనామా లేఖ స్పీకర్‌కు అందింది. దీంతో ఆయన మాజీ అధ్యక్షుడయ్యారు. ప్రస్తుతం శ్రీలంక నుంచి పరారైన ఆయన మొదట మాల్దీవ్స్‌కు తర్వాత సింగపూర్‌కు చేరుకున్నారు. అక్కడ్నుంచి సౌదీకి వెళ్తారన్న ప్రచారం జరుగుతోంది. గోటబయ రాజీనామా చేయడంతో తాత్కలిక అధ్యక్షుడు విధులు నిర్వహించేందుకు అవకాశం ఏర్పడింది. రాజీనామా చేయకుండా గోటబయ పరారవడంతో ఎమర్జెన్సీ విధించారు. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడితే ఎమర్జెన్సీని తొలగించే అవకాశం ఉంది..  






సింగపూర్‌లో కొన్నాళ్లు ఉండాలనుకున్న గోటబయకు పరిస్థితులు అనుకూలించడం లేదు.  శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్సేకు రాజకీయ ఆశ్రయం ఇవ్వడం లేదని సింగపూర్‌ ప్రభుత్వం స్పష్టం చేసింది. వ్యక్తిగత పర్యటన కోసమే ఆయన సింగపూర్‌కు వచ్చినట్లు ఆ దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ‘ఆయన (గొటబయ) ఆశ్రయం కోరలేదు. ఆయనకు ఎలాంటి ఆశ్రయం ఇవ్వలేదు. సాధారణంగా ఆశ్రయం కోసం చేసే అభ్యర్థనలను సింగపూర్ ప్రభుత్వం మంజూరు చేయదు’ అని విదేశీ మంత్రిత్వ శాఖ పేర్కొంది.



శ్రీలంక సైన్యం గురువారం రంగంలోకి దిగింది. ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లకుండా, ఎలాంటి ప్రాణ నష్టం జరుగకుండా ఉండేందుకు ఆ దేశ సైనికులు వాహనాల్లో రాజధాని కొలంబో రోడ్లపైకి వచ్చారు. నిరసనకారులు పెద్ద సంఖ్యలో చొరబడిన అధ్యక్ష, ప్రధాని భవనాల వద్ద భారీగా సైనిక వాహనాలను మోహరించారు.