Sri Lanka Crisis: శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు రణిల్ విక్రమ సింఘే సంచలన నిర్ణయం తీసుకున్నారు. శాంతిభద్రతలను కాపాడేందుకు లంక సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఏం చేయాలో అది చేయండని, అవసరమైతే కనిపిస్తే కాల్చేయండని సైన్యానికి అధికారం ఇచ్చారు.
నన్ను తప్పించాలని
నిరసనకారులు ప్రధాని భవనం, అధ్యక్ష భవనంలోకి వెళ్లి నినాదాలు చేస్తూ నిరసన తెలుపుతున్నారు. దీంతో దేశాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ కాపాడుకుంటామని రణిల్ విక్రమసింఘే వ్యాఖ్యానించారు. తాత్కాలిక అధ్యక్షుడిగా తనను తప్పుకునేలా చేయాలని విధ్వంసకారులు చూస్తున్నారని ఆయన ఆరోపించారు.
పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు, శాంతిభద్రతలను పరిరక్షించేందుకు శ్రీలంక పోలీసులు, సైన్యానికి పూర్తి స్థాయి అధికారాలు ఇస్తున్నట్లు శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడు విక్రమ సింఘే స్పష్టం చేశారు.
తారస్థాయికి
మరోవైపు శ్రీలంకలో పరిస్థితులు తారస్థాయికి చేరుకున్నాయి. నిరసనకారులు నేరుగా ప్రధాన మంత్రి కార్యాలయ ప్రాంగణంలోకి గుంపులుగా చేరుకుని, ఆ భవనం ఎక్కి శ్రీలంక దేశ పతాకాన్ని ఎగురవేశారు.
పరార్
శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన పదవికి రాజీనామా చేయకుండా దేశం విడిచి పారిపోయారు. ఆయన భార్య సహా ఇద్దరు బాడీగార్డ్స్తో కలిసి వాయుసేన విమానంలో మాల్దీవుల రాజధాని మాలేకు పరారయ్యారు. ఈ విషయాన్ని ప్రధానమంత్రి కార్యాలయం కూడా ధ్రువీకరించింది.
గొటబాయను దేశం విడిచి పారిపోయేందుకు ప్రభుత్వం సహకరించిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అక్కడి నిరసనకారులు. కొంతమంది పోలీసు వాహనాలపై రాళ్లు రువ్వారు. దేశంలో మళ్లీ హింసాత్మక ఆందోళనలు చెలరేగే అవకాశం ఉండటంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించింది.