తీవ్ర ఆర్థిక, ఆహార సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక మరో కీలక ప్రకటన చేసింది. దేశ ఖజానా దివాలా తీసిందని కనుక విదేశీ రుణాలు చెల్లించలేమని చేతులెత్తేసింది సర్కార్. 51 బిలియన్ డాలర్ల అప్పును తీర్చలేమని లంక ప్రభుత్వం స్పష్టం చేసింది.
ఎందుకిలా?
అత్యవసరంగా అవసరమైన వస్తువులను దిగుమతి చేసుకోవడానికి విదేశీ మారకద్రవ్యం అయిపోయిన కారణంగా ఈ చర్యను 'చివరి ప్రయత్నం'గా శ్రీలంక పేర్కొంది.
ఇవే కారణాలు
శ్రీలంకకు ప్రధానంగా పర్యాటకం, ఎగుమతుల ద్వారానే ఆదాయం వస్తుంది. కొవిడ్ కారణంగా పర్యటక రంగం పూర్తిగా కుదేలైపోయింది. 2019లో పర్యాటకం ద్వారా శ్రీలంక 4 బిలియన్ల డాలర్ల ఆదాయం ఆర్జించింది. ఇప్పుడు అందులో పది శాతం కూడా రావడం లేదు. ఇలా వచ్చే ఆదాయం మొత్తం విదేశీ మారకద్రవ్యమే.
దిగుమతుల మీదే!
శ్రీలంక అత్యధికంగా దిగుమతుల మీదే ఆధారపడుతుంది. తక్కువ ఆదాయం, అధిక దిగుమతి బిల్లుల కారణంగా పర్యటక ఆధారిత శ్రీలంక విదేశీ మారకద్రవ్యం భారీ పతనాన్ని ఎదుర్కొంటోంది. దిగుమతుల కోసం చెల్లించడానికి దేశానికి ఈ సంవత్సరం 22 బిలియన్ డాలర్లు అవసరం. అయితే దాని ఆదాయం మాత్రం 12 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు. 10 బిలియన్ డాలర్ల లోటులో శ్రీలంక కొట్టుమిట్టాడుతోంది.
స్వయం తప్పిదాలతో
శ్రీలంక ఏరికోరి ఎంచుకున్న సేంద్రియ పద్ధతి వ్యవసాయం కూడా సంక్షోభానికి ఒక కారణమని చెబుతున్నారు. రసాయన ఎరువులను, క్రిమి సంహారకాలను విడనాడి సేంద్రియ పద్ధతి వ్యవసాయాన్ని చేపట్టడం వల్ల దిగుబడులు తగ్గిపోయి తేయాకు పంట కూడా దెబ్బ తిని దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిందనే అభిప్రాయముంది. 50 శాతం దిగుబడులు తగ్గిపోయి ఆహార సంక్షోభం తలెత్తిందని భావిస్తున్నారు. 1948 నుంచి దేశంలో ఇంతటీ దారుణమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోలేదని శ్రీలంక విద్యాశాఖ అధికారులు వాపోతున్నారు. ఊహించని ఆర్థిక సంక్షోభంతో 2.20 కోట్ల జనాభా ఉన్న శ్రీలంక ఉక్కిరిబిక్కిరవుతోంది.
Also Read: China Covid Outbreak: కరోనా మాట దేవుడెరుగు- అక్కడ ఆకలితో చనిపోయేలా ఉన్నారు!