పాకిస్థాన్ నూతన ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు ప్రధాని నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. శాంతి, సుస్థిరతలను భారత్ కోరుకుంటోందని మోదీ ట్వీట్ చేశారు.
ఏకగ్రీవంగా
పాకిస్థాన్ ప్రధానిగా షెహబాజ్ షరీఫ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రధానిని ఎన్నుకునేందుకు నేషనల్ అసెంబ్లీ సోమవారం సమావేశం కాగానే ఇమ్రాన్ ఖాన్‌కు చెందిన పీటీఐ సభ్యులు హంగామా సృష్టించారు. షెహబాజ్ ఎన్నిక సమయానికి సభనుంచి పీటీఐ సభ్యులందరూ వాకౌట్ చేశారు. దీంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది.
ఎవరంటే?
మూడుసార్లు పాకిస్థాన్ ప్రధాన మంత్రిగా పని చేసిన నవాజ్ షరీఫ్ సోదరుడు షెహబాజ్ షరీఫ్. నవాజ్ షరీఫ్ 2017లో పదవీచ్యుతుడయ్యారు. అవినీతి కేసుల్లో ఆయన జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్‌లో ఉంటున్నారు.
షెహబాజ్ షరీఫ్ పాకిస్థాన్‌లోని పంజాబ్ ప్రావిన్స్ ముఖ్యమంత్రిగా పని చేశారు. పీఎంఎల్-ఎన్ అధ్యక్షుడు కూడా ఆయనే. పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో ఇప్పటివరకు ప్రతిపక్ష నేతగా ఉన్నారు.
ఐదు పెళ్లిళ్లు
షెహబాజ్ 1951 సెప్టెంబరు నెలలో లాహోర్‌లో జన్మించారు. షెహబాజ్ తండ్రి ముహమ్మద్ షరీఫ్ స్వస్థలం కశ్మీర్ (భారత్)లోని అనంతనాగ్. ఆయన పారిశ్రామికవేత్త. షెహబాజ్ లాహోర్‌లోనే గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
షెహబాజ్ అయిదు పెళ్లిళ్లు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనకు ఇద్దరు భార్యలు. మిగతా ముగ్గురికి విడాకులిచ్చారు.షెహబాజ్ పెద్ద కుమారుడు హమ్జా పంజాబ్ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన సీఎం ఎన్నికల బరిలో నిలిచారు. బ్రిటన్‌లో 1,400 కోట్ల పాకిస్థానీ రూపాయలకు సంబంధించి నగదు అక్రమ చలామణి కేసు షెహబాజ్‌పై ఉంది.
Also Read: China Covid Outbreak: కరోనా మాట దేవుడెరుగు- అక్కడ ఆకలితో చనిపోయేలా ఉన్నారు!