కరోనా కట్టడిలో చైనా అనుసరిస్తోన్న 'జీరో టోలరెన్స్' విధానంపై ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. అయినప్పటికీ జిన్‌పింగ్ ప్రభుత్వం ఈ విధానాన్నే అనుసరిస్తోంది. కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ఇటీవల షాంఘై నగరంలో లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. ఇక్కడ జీరో టోలరెన్స్ విధానాన్ని అమలు చేస్తోంది. దీని వల్ల కరోనా మాట ఏమోకానీ తినడానికి తిండి లేక జనాలు అలమటిస్తున్నారు.


ఆకలి చావులు


ఆ మధ్య కరోనా రోగులను కంటైనర్‌లలో ఉంచి మానవ హక్కుల సంఘాల నుంచి విమర్శలు ఎదుర్కొంది చైనా. ఇప్పుడు షాంఘైను లాక్‌డౌన్‌తో దిగ్భంధించి జనజీవనాన్ని అగమ్య గోచరంగా తయారు చేస్తోంది. దాదాపు మూడు కోట్ల జనాభా ఉన్న ఈ నగరం లాక్‌డౌన్‌ కట్టడిలో ఉండిపోయింది. ఇంటికే పరిమితమైన జనాలు పిచ్చెక్కిపోయి కిటికీలు, బాల్కనీల నుంచి ఆర్తనాదాలు పెడుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.


పరిస్థితి ఇలాగే కొనసాగితే చివరకు ఆకలి చావులు, ఆత్మహత్యల లాంటి విషాదాలే మిగులుతాయని ప్రజలు భయపడుతున్నారు. నిత్యావసరాలు దొరక్క ప్రజలు ఆకలితో అలమటించిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి.






భారీగా కేసులు


చైనాలో ఆదివారం భారీగా కేసులు నమోదయ్యాయి. 27,509 కేసులు కొత్తగా వెలుగులోకి వచ్చాయి. అయినప్పటికీ కేవలం 914 మందిలో కొవిడ్ లక్షణాలు ఉన్నాయి.

 

చైనాలో తయారీ రంగానికి కేంద్రంగా పేరున్న గ్వాంగ్జౌలోనూ కొత్తగా 27 కేసులు నమోదయ్యాయి. ఈ ప్రాంత జనాభా కోటి 80 లక్షలు. తక్కువ కేసులే నమోదైనప్పటికీ జనాభా ఎక్కువగా ఉండటం వల్ల ఈ నగరం భారీ ఆంక్షలను ఎదుర్కొంటోంది. గ్వాంగ్జౌలోని పాఠశాలలు మూతపడ్డాయి. ఆన్​లైన్​ క్లాసులు జరుగుతున్నాయి.