Sri Lanka crisis: చుట్టూ వేల మంది నిరసనకారులు.. మధ్యలో హాయిగా కిస్ చేస్తోన్న ఓ జంట ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకలో తీసిన ఫొటో ఇది.






ఆఫీసు ముందు


గత బుధవారం ప్రధాన మంత్రి రణీల్‌ విక్రమసింఘే కార్యాలయం ముందు నిరసనలు జరిగాయి. ఆ సమయంలో ఈ ఫోటో తీసినట్లు శ్రీలంకకు చెందిన న్యూస్‌వైర్‌ తెలిపింది.


"కొలంబోలోని ప్రధానమంత్రి కార్యాలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు దారితీసిన ప్రభుత్వ వ్యతిరేక నిరసనలలో పాల్గొన్న తర్వాత ఒక జంట ప్రేమను ప్రదర్శించింది." అంటూ ట్విట్టర్‌లో ఈ ఫొటోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటో సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. 


అయితే ఈ పోస్ట్‌కు నెటిజన్లు ఒక్కొక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. కొంతమంది ప్రధాని ఆఫీసు ముందు ఇవేం పనులు అంటూ కామెంట్లు పెట్టగా, మరి కొంతమంది ప్రేమ పంచుతున్నారు అంటూ ఫన్నీ కామెంట్లు పెడుతున్నారు.


ప్రమాణ స్వీకారం


మరోవైపు తీవ్ర నిరనసల మధ్య శ్రీలంక తాత్కాలిక అధ్యక్షుడిగా రణిల్ విక్రమ సింఘే శుక్రవారం ప్రమాణ స్వీకారం చేశారు. గొటబాయ రాజపక్స అధ్యక్ష పదవికి రాజీనామా చేసినట్లు పార్లమెంటు స్పీకర్ మహింద అభయ్‌వర్దన్ అధికారికంగా ప్రకటించారు. దీంతో ఆ బాధ్యతలను తాత్కాలికంగా విక్రమ సింఘే నిర్వర్తించనున్నారు. 


నూతన అధ్యక్షుడిని పార్లమెంటు ఎన్నుకునే వరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన తర్వాత రానున్న ఏడు రోజుల్లో నూతన దేశాధ్యక్షుడిని ఎన్నుకోబోతున్నట్లు స్పీకర్ తెలిపారు.  శ్రీలంక పార్లమెంటు సమావేశాలు శనివారం ప్రారంభమవుతాయి. 


" సింగపూర్‌ నుంచి ఈ మెయిల్‌ ద్వారా గొటబాయ తన రాజీనామా లేఖను పంపించారు. వారం రోజుల్లోగా తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకుంటాం. ఇందుకు సంబంధించిన ప్రక్రియ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. అప్పటివరకు ప్రధానమంత్రి రణిల్‌ విక్రమ సింఘే తాత్కాలిక అధ్యక్షుడిగా కొనసాగుతారు. తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు పార్లమెంట్‌ శనివారం సమావేశం కానుంది. ఈ ప్రక్రియలో ఎంపీలంతా పాల్గొనేలా శాంతియుత వాతావరణం కల్పించాలి.                                       "