Singapore New President: సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతికి చెందిన ధర్మన్ షణ్ముగరత్నం ఘన విజయం సాధించారు. సింగపూర్ 9వ అధ్యక్ష ఎన్నికల పోలింగ్ శుక్రవారం జరిగింది. మాజీ మంత్రి షణ్ముగరత్నం అధ్యక్ష ఎన్నికల్లో 70.40 శాతం ఓట్లు సాధించి గెలుపొందారు.
సింగపూర్ వాసులు తనకే ఓటు వేస్తారని, అధ్యక్ష పీఠంపై కూర్చోబెడతారని ఎన్నికలకు ముందు షణ్ముగరత్నం దీమా వ్యక్తం చేశారు. ఆయన ఊహించినట్లుగానే సింగపూర్ ప్రజలు భారత సంతతికి చెందిన షణ్ముగరత్నానికే జై కొట్టారు. 2001లో ధర్మాన్ షణ్ముగరత్నం పాలిటిక్స్ లోకి వచ్చారు. రెండు దశాబ్దాల పాటు అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీలో పలు మంత్రి పదవులు చేపట్టారు. ఈ క్రమంలో 2011- 2019 మధ్య సింగపూర్ ఉప ప్రధానమంత్రిగా పనిచేయడం ఆయనకు కలిసొచ్చింది. అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేసేందుకు జులై నెలలో అన్ని పదవులకు రాజీనామా చేసి బరిలో నిలిచి విజయాన్ని అందుకున్నారు. సింగపూర్ కు మూడో భారత సంతతికి చెందిన వ్యక్తి అధ్యక్షుడు అవుతున్నారు. గతంలో ఇద్దరు భారత సంతతికి చెందిన వారు ప్రెసిడెంట్ గా సేవలు అందించారు.
హలీమా యాకోబ్ సింగపూర్ ప్రస్తుత అధ్యక్షురాలు, కాగా ఆమె ఆరేళ్ల పదవీకాలం ఈ సెప్టెంబర్ 13తో ముగియనుందని తెలిసిందే. హలీమా యాకోబ్ సింగపూర్ కు తొలి మహిళా అధ్యక్షురాలు, కాగా ఓవరాల్ గా 8వ ప్రెసిడెంట్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కొత్త అధ్యక్షుడి కోసం ఎలక్షన్స్ డిపార్ట్‌మెంట్ సింగపూర్ ఓటింగ్ నిర్వహించింది. NTUC ఇన్‌కమ్ మాజీ చీఫ్ టాన్ కిన్ లియాన్, గతంలో చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ గా సేవలు అందించిన కోక్ సాంగ్ తో పాటు ధర్మాన్ షణ్ముగరత్నం సింగపూర్ అధ్యక్ష బరిలో నిలిచారు. అయితే సింగపూర్ వాసులు షణ్ముగరత్నాన్ని తమ కొత్త అధ్యక్షుడిగా గెలిపించారు.
1981 నుంచి 1985 వరకు కేరళకి చెందిన దేవన్ నాయర్ సింగపూర్ 3వ అధ్యక్షుడిగా సేవలు అందించారు. అనంతరం 2009లో భారత సంతతి (తమిళనాడు )కి చెందిన సంతతికి చెందిన సెల్లపన్ రామనాథన్ సింగపూర్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. తాజాగా ధర్మాన్ షణ్ముగరత్నం సింగపూర్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.