Putin Health Condition: 



పుతిన్ హెల్త్‌పై వైరల్ పోస్ట్..


రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆరోగ్యంపై రెండేళ్లుగా ఏవో పుకార్లు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య మొదలైనప్పటి నుంచి అంతర్జాతీయ మీడియా పుతిన్ హెల్త్‌పై చాలా సందర్భాల్లో వార్తలు రాసింది. ఆయన తరవాత రష్యాన్ని లీడ్ చేసేది ఎవరు..? అనే స్థాయిలో చర్చలు కూడా జరిగాయి. అయితే...ఈ వార్తలపై రష్యా అధికారికంగా ఎప్పుడూ స్పందించలేదు. కానీ...ఇప్పుడు సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ తెగ వైరల్ అవుతోంది. పుతిన్ ఆరోగ్యం క్షీణించిందని పోస్ట్ చేశాడు ఓ బ్లాగర్. పుతిన్ ఫొటోనీ షేర్ చేశాడు. "దయచేసి మమ్మల్ని వదిలేసి వెళ్లిపోకండి. మీరు బతికుండాలని, ఆరోగ్యంగా ఉండాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం" అని పోస్ట్ పెట్టాడు. ఈ ఒక్క పోస్ట్‌తో సోషల్ మీడియాలో రచ్చ మొదలైంది. పుతిన్‌కి ఏమైంది అని ఆరా తీస్తున్నారు నెటిజన్లు. ఇంత జరుగుతున్నా రష్యా మాత్రం ఏ మాత్రం స్పందించడం లేదు. ఇవి పుకార్లే అని ఖండిస్తూ ఓ ప్రకటన కూడా చేయకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. నిజంగానే ఆయన ఆరోగ్యం క్షీణించిందా అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. ఇదే పోస్ట్‌ని ఉక్రెయిన్ ఇంటర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా షేర్ చేశారు. "ఏం జరుగుతోంది" అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ పోస్ట్ పెట్టారు. ఈయన షేర్ చేయడం వల్ల ఈ పోస్ట్‌ మరింత వైరల్ అయింది. ఇది నిజమే అయితే..దేవుడిని ప్రార్థించడం కన్నా మనం ఇంకేమీ చేయలేం అని కామెంట్స్ పెడుతున్నారు. గతేడాది పుతిన్ ఆరోగ్యంపై ఓ నివేదిక విడుదలైంది. ఆయన తీవ్ర తలనొప్పితో బాధ పడుతున్నారని చెప్పింది. అంతే కాదు. ఆయన కంటి చూపు కూడా మందగించిందని, నాలుక మొద్దుబారిపోతోందని వెల్లడించింది.