పాకిస్థాన్‌ పరిస్థితి రోజు రోజుకీ మరీ దిగజారుతోంది. దేశం సంక్షోభంలో కూరుకుపోతోంది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోతున్నాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరలు అయితే ఏకంగా లీటరుకు రూ.౩౦౦ దాటి పోయింది. చరిత్రలో ఇంత అధిక ధరలు ఎన్నడూ లేవు. దేశం ఎదుర్కొంటున్న గడ్డు పరిస్థితుల దృష్ట్యా జనం మీదే మళ్లీ భారం వేస్తున్నారు. గత సాయంత్రం అక్కడి ఫైనాన్స్‌ మినిస్టర్‌ మాట్లాడుతూ.. పెట్రోల్‌ ధర లీటరుకు రూ.14.91పైసలు, హైస్పీడ్‌ డీజిల్‌ ధర రూ.18.44 పైసలు పెంచుతున్నట్లు ప్రకటించారు. దీంతో అక్కడ లీటరు పెట్రోల్‌ ధర రూ.305.36, హైస్పీడ్‌ డీజిల్‌ ధర లీటరుకు రూ.311.84 పైసలు అయ్యింది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జాతీయ ప్రయోజనాల కోసం ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చిందని మంత్రి వెల్లడించారు.


కొన్ని దశాబ్దాలలో ఎన్నడూ లేనంతగా పాకిస్థాన్‌ ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటోంది. ప్రస్తుతం అక్కడి ఆర్థిక సంస్కరణల కారణంగా చరిత్రలో ఎప్పుడూ లేనంత ద్రవ్యోల్బణం ఏర్పడింది. అధిక వడ్డీరేట్లు కారణంగా సాధారణ ప్రజలు, వ్యాపారస్థులు కూడా తీవ్రంగా ఇబ్బందిపడుతున్నారు. పాకిస్థానీ రూపాయి విలువ కూడా గత కొన్ని రోజులగా తగ్గుముఖం పడుతోంది. దీని వల్ల సెంట్రల్‌ బ్యాంకు వడ్డీ రేట్లను పెంచాల్సి వచ్చింది. పాకిస్థానీ రూపాయి విలువ అమెరికా డాలరుతో పోలిస్తే రికార్డు స్థాయి పతనంలో రూ.305.6 వద్ద ట్రేడవుతోంది. గత మంగళవారం ట్రేడింగ్‌ ముగింపు సమయానికి ఈ విలువ రూ.304.4గా ఉంది.


పాక్‌లో ప్రస్తుతం తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వార్‌-ఉల్‌-హక్‌ కాకర్‌ హయాంలో నడుస్తోంది. గత నెలలో ఆయన పదవిలోకి వచ్చారు. తిరిగి దేశంలో ఎన్నికలు జరిగే వరకు ఈయనే ప్రధానమంత్రిగా ఉండబోతున్నాయి. అయితే నవంబరులో జరగాల్సిన పాక్‌ ఎన్నికలు ఇంకా ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాత్కాలిక క్యాబినెట్‌ ప్రధాన లక్ష్యం పాకిస్థాన్‌ను ఆర్థిక స్థిరీకరణ వైపు నడిపించడం. అంతర్జాతీయ ద్రవ్యనిధి నుంచి పాకిస్థాన్‌కు చివరి నిమిషయంలో మూడు బిలియన్‌ డాలర్ల బెయిల్‌ అవుట్‌ లభించిన తర్వాత రికవరీ ప్రాసెస్ కాస్త మెరుగైంది. 


గత ఏడాది పాకిస్థాన్‌ను వరదలు ముంచెత్తడంతో తీవ్రంగా నష్టపోయింది. పంటలు మునిగిపోవడం, ధాన్యం నిలవలు తడిచి పాడైపోవడంతో అక్కడ తీవ్రంగా ఆహార కొరత ఏర్పడింది. అలాగే ఈ ఏడాది కూడా అక్కడ పంటలు సరిగ్గా లేకపోవడంతో దేశం ఆహార సంక్షోభంలో కూరుకుపోయింది. ఆర్థిక సంక్షోభం కూడా చుట్టుముట్టడంతో విదేశాల నుంచి నిత్యావసర సరుకులు దిగుమతి చేసుకోవాలన్నా తగినంత విదేశీ మారక ద్రవ్య నిల్వలు లేకుండా పోయాయి. గోధుమల కొరత ఏర్పడంతో వాటి ధరలు విపరీతంగా పెరిగిపోయి పేదలకు అందుబాటులో లేకుండా అయిపోయాయి. ఇతర నిత్యావసర సరుకుల ధరలు కూడా వందలకు వందలు పెరిగిపోయాయి.  గతంలో అక్కడ చికెన్‌ కేజీ చికెన్‌ రూ.700, కేజీ ఉల్లిగడ్డలు రూ.200, కేజీ బియ్యం రూ.140, గోధుమ పిండి కేజీ రూ.160, డజను గుడ్లు ఏకంగా రూ.400 పైగా పెరిగిపోయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. ఇప్పుడు పెట్రోల్‌ రేట్లు చూస్తుంటే దిమ్మ తిరిగిపోతోంది. పేద ప్రజల పరిస్థితి అక్కడ ఎంత దారుణంగా చెప్పనవసరంలేదు.