Russia Luna-25 crash On Moon:
గత నెలలో రష్యా ప్రయోగించిన లూనా-25 మిషన్‌ చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్‌ అయ్యే సమయంలో కూలిపోవడం తెలిసిందే. గత నలభై ఏడేళ్లలో రష్యా తొలి మూన్‌ మిషన్‌ ఇది. ఆగస్టు 19 న లూనా-25 అదుపుతప్పి చంద్రుడిపై కూలిపోయింది. అయితే ఈ మిషన్‌ విఫలం కావడం వల్ల అది కూలిపోయిన ప్రదేశంలో చంద్రుడిపై పది మీటర్ల వెడల్పుతో గొయ్యి ఏర్పడిందని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా వెల్లడించింది. 


నాసాకు చెందిన లూనార్‌ రీకనైసెన్స్‌ ఆర్బిటర్‌(ఎల్‌ఆర్‌ఓ) స్పేస్‌క్రాఫ్ట్‌ చంద్రుడి ఉపరితలంపై తీసిన కొత్త చిత్రాలను పంపించింది. లూనా 25 మిషన్‌ కూలిన ప్రదేశంలో కొత్త గొయ్యి కనిపిస్తోందని, ఎల్‌ ఆర్‌ ఓ పంపిన చిత్రాల ద్వారా ఈ విషయం తెలుస్తోందని నాసా వెల్లడించింది. కొత్త క్రేటర్‌  సుమారు 10 మీటర్ల వ్యాసం కలిగిఉందని పేర్కొంది. కొత్తగా ఏర్పడిన బిలం సరిగ్గా లూనా 25 మిషన్‌ ఇంపాక్టెడ్‌ పాయింట్‌కు దగ్గరగా ఉందని తెలిపింది. అలాగే ఈ గొయ్యి సహజంగా ఏర్పడినట్లుగా లేదని, మిషన్‌ విఫలమైనందు వల్ల ఏర్పడినట్లుగానే ఉందని శాస్త్రవేత్తలు నిర్ధారించారు.


లూనా 25 మిషన్‌ విఫలం కావడానికి కారణాలు తెలుసుకునేందుకు రష్యా ప్రత్యేక ఇంటర్‌ డిపార్ట్‌మెంటల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసింది. ఎన్నో మూన్‌ మిషన్స్‌ ఫెయిల్‌ అయినప్పటికీ ఈ మిషన్‌ విఫలమవ్వడం పట్ల రష్యా స్పేస్‌ ఏజెన్సీ ప్రతిష్ఠ ప్రపంచవ్యాప్తంగా తగ్గినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు అంతరిక్ష ప్రయోగాలు, వ్యోమగాములను పంపడంపై రష్యా ముందుండేంది. గతంలో 1957లో మొట్టమొదటగా భూమి కక్ష్యలోకి స్పుత్నిక్‌  1 ఉపగ్రహాన్ని ప్రవేశపెట్టినప్పుడు, 1961లో సోవియట్‌ యూనియన్‌కు చెందిన యూరీ గగారిన్‌ను అంతరిక్షంలోకి వెళ్లిన తొలి వ్యక్తిగా చరిత్ర సృష్టించినప్పుడు రష్యా స్పేస్‌ ఏజెన్సీ ప్రపంచంలోనే టాప్‌లో ఉండేది. 


రష్యా మూన్‌ మిషన్‌ ఫెయిల్‌ అయిన కొన్ని రోజుల్లోనే భారత్‌ పంపిన చంద్రయాన్‌-3 విజయవంతంగా చంద్రుడి దక్షిణ ధృవంపై సురక్షితంగా ల్యాండ్‌ అయ్యింది. దీంతో చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండర్‌ను దింపిన తొలి దేశంగా భారత్‌ చరిత్రకెక్కింది. మన ఇస్రోపై ప్రపంచ వ్యాప్తంగా ప్రశంసలు కురిపించారు. దీంతో మన దేశ కీర్తిప్రతిష్ఠలు మరింత పెరిగాయి. గతంలో చంద్రయాన్‌-2 సాఫ్ట్‌ ల్యాండింగ్‌ విషయంలో విఫలమైన సంగతి తెలిసిందే. కాగా ఇప్పుడు పకడ్బంధీగా మిషన్‌ ఫెయిల్‌ అవ్వకుండా ఉండేందుకు ఎన్నో జాగ్రత్తలు తీసుకుని శాస్త్రవేత్తలు విజయవంతంగా విక్రమ్‌ ల్యాండర్‌ను మూన్‌పై దించారు. అందులోని రోవర్‌ చంద్రుడిపై తిరుగుతూ ఫొటోలు పంపిస్తోంది. ఎంతో ముఖ్యమైన సమాచారాన్ని అందిస్తోంది.