IND vs PAK: భారత్ - పాకిస్తాన్ క్రికెట్  క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఈ ఇరుదేశాల  మధ్య  ఎక్కడ మ్యాచ్ జరిగినా  స్టేడియాలు నిండిపోవడమే గాక  టీవీ, డిజిటల్ మీడియాలో టీఆర్పీ రేటింగులు కొత్త రికార్డులు సృష్టిస్తాయి.  పదినెలల విరామం తర్వాత పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడనున్న  భారత జట్టు.. ఆసియా కప్‌లో బోణీ కొట్టేందుకు సిద్ధంగా ఉంది. ఐసీసీ  టోర్నీలలో పాకిస్తాన్‌పై ఘనమైన రికార్డును కలిగిఉన్న భారత్‌కు ఆసియా కప్‌లో రికార్డు ఎలా ఉంది..?  ఉపఖండపు జట్లు పాల్గొనే ఈ మెగా టోర్నీలో భాగంగా దాయాదుల మధ్య ఎడ్జ్ ఎవరికి ఉంది..? అన్న విషయాలు ఇక్కడ చూద్దాం. 


1984లో మొదలైన ఆసియా కప్‌లో  ఇప్పటివరకూ భారత్ - పాక్‌లు 13 సార్లు తలపడ్డాయి.  ఇందులో భారత్ వైపునకే మొగ్గు ఉంది.  ఏడు మ్యాచ్‌లలో టీమిండియా నెగ్గగా  ఐదు మ్యాచ్‌లను మెన్ ఇన్ గ్రీన్  గెలుచుకున్నారు. ఒక మ్యాచ్‌‌లో ఫలితం తేలలేదు. ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌పై భారత్ విన్నింగ్ పర్సెంటేజ్ 53.85 శాతంగా ఉండగా, పాక్‌కు 35.71 శాతంగానే ఉంది. 


తొలి రెండూ మనవే.. 


చిరకాల ప్రత్యర్థుల మధ్య తొలి పోరు ఈ టోర్నీ  తొలి సీజన్ (1984) లోనే జరిగింది.  తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 46 ఓవర్లలో  నాలుగు వికెట్లు కోల్పోయి  188 పరుగులు చేసింది. అనంతరం పాక్.. 39.4 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. భారత్ 54 పరుగుల తేడాతో గెలుపొందింది.  ప్రస్తుత బీసీసీఐ  అధ్యక్షుడు రోజర్ బిన్ని, టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి   తలా మూడు వికెట్లు తీసి పాకిస్తాన్ పతనాన్ని శాసించారు.  1988లో కూడా భారత్‌దే విజయం. ఈ మ్యాచ్‌లో తొలుత బౌలింగ్ చేసిన భారత్.. పాక్‌ను 142 పరుగులకే కట్టడి చేసింది. ఈ మ్యాచ్‌లోనే అర్షద్ అయూబ్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. ఆసియా కప్‌లో ఇదే తొలి ఫైఫర్. లక్ష్యాన్ని భారత్.. 40.4 ఓవర్లలోనే ఛేదించింది.  మోహిందర్ అమర్‌నాథ్ 74 పరుగులతో నాటౌట్‌గా నిలిచి భారత్‌కు విజయాన్ని అందించాడు. 


రెండు దశాబ్దాల నిరీక్షణ.. 


1988 తర్వాత ఆసియా కప్‌లో భారత్.. పాక్‌పై మళ్లీ గెలవడానికి రెండు దశాబ్దాలు ఆగాల్సి వచ్చింది.  1995, 2000,  2004లో పాకిస్తానే నెగ్గింది. 2008లో మాత్రం ఈ టోర్నీలో భారత్, పాక్‌లు రెండు సార్లు తలపడగా చెరో మ్యాచ్ గెలిచాయి. తొలి మ్యాచ్‌లో పాక్ నిర్దేశించిన 300 పరుగుల లక్ష్యాన్ని భారత్.. 42.1 ఓవర్లలోనే ఛేదించింది. టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ (119) సెంచరీతో కదం తొక్కగా సురేశ్ రైనా (84), యువరాజ్ సింగ్ (48) లు రాణించారు. కానీ రెండో మ్యాచ్‌లో మాత్రం భారత్‌కు భంగపాటు తప్పలేదు. ఇండియా నిర్దేశించిన 309 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్..  45.3 ఓవర్లలోనే ఛేదించింది.  యూనిస్ ఖాన్ (123) శతకంతో రాణించాడు. 


2010, 2012లలో భారత్ నెగ్గగా 2014లో  పాకిస్తాన్ గెలిచింది.  2016లో  తొలిసారి ఈ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో నిర్వహించగా నాటి మ్యాచ్‌లో కూడా భారత్‌దై పైచేయి అయింది.  ఆ ఏడాది పాక్.. 17.3 ఓవర్లలో 83 పరుగులకే కుప్పకూలింది. హార్ధిక్ పాండ్యా మూడు వికెట్లు తీయగా జడేజా రెండు వికెట్లు పడగొట్టాడు. తర్వాత విజయలక్ష్యాన్ని భారత్.. 15.3 ఓవర్లలో సాధించింది. విరాట్ కోహ్లీ (49) టాప్ స్కోరర్. 2018లో దాయాది దేశాలు రెండు సార్లు తలపడగా రెండింటోనూ భారత్‌దే విజయం. ఈ టోర్నీలో కోహ్లీ గైర్హాజరీతో రోహిత్ శర్మ సారథ్య పగ్గాలు చేపట్టి భారత్‌కు కప్ కూడా అందించాడు. ఇక గతేడాది ఈ రెండు జట్లూ గ్రూప్ స్టేజ్‌తో పాటు సూపర్ - 4లోనూ తలపడ్డాయి. టీ20 ఫార్మాట్‌లో నిర్వహించిన ఈ టోర్నీలో  గ్రూప్ స్టేజ్‌లో భారత్ నెగ్గగా సూపర్ - 4లో పాకిస్తాన్ గెలిచింది. 


శ్రీలంకలో.. 


ఆసియా కప్‌లో ఈ ఏడాది భారత్ మ్యాచ్‌లు అన్నీ శ్రీలంక వేదికగానే జరుగుతున్నాయి.  ఇండియా, పాకిస్తాన్‌లు ఆసియా కప్‌లో భాగంగా  లంకలో మూడు మ్యాచ్‌లు ఆడాయి.  తలా ఓ మ్యాచ్ గెలవగా ఓ  వన్డేలో ఫలితం తేలలేదు. 2004 ఆసియా కప్‌లో కొలంబో (ప్రేమదాస స్టేడియం) వన్డేను భారత్ నెగ్గగా.. దంబుల్లా వేదికగా 2010లో జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ గెలిచింది.  మరి  శనివారం దాయాదుల పోరులో విజయం ఎవరిని వరిస్తుందో చూడాలి. 














ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి   
Join Us on Telegram: https://t.me/abpdesamofficial