Sachin Tendulkar: 


క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) ఊహించని చిక్కుల్లో పడ్డారు! ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ గేమ్స్‌కు అంబాసిడర్‌గా కొనసాగొద్దని కొందరు ఆయన్ను డిమాండ్‌ చేశారు. ఒకవేళ ఇలాగే చేస్తే భారత రత్న పురస్కారాన్ని వెనక్కి తిరిగి ఇచ్చేయాలని హెచ్చరించారు. గురువారం ఆయన ఇంటి ముందు వందల మంది కార్యకర్తలు ఆందోళన చేపట్టారు.


ప్రహర్‌ జనశక్తి పార్టీ (PJP) నాయకుడు ఓం ప్రకాశ్‌ బాబారావ్‌ (బచ్చూ కాదు) నాయకత్వంతో సచిన్‌ ఇంటి ముందు ఆందోళనలు జరిగాయి. మహారాష్ట్ర ప్రభుత్వంలో ఆయన పార్టీ భాగస్వామిగా ఉంది. ఆన్‌లైన్‌ గ్యాంబ్లిగ్‌ గేమ్స్‌కు ప్రచారకర్తగా ఉండొద్దని కొన్నాళ్లుగా ఆయన సచిన్‌ తెందూల్కర్‌ను డిమాండ్‌ చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండేకు లేఖ రాశారు. ఎవరి వైపు నుంచీ స్పందన రాకపోవడంతో ఒక్కసారిగా ఆందోళనలు చేపట్టారు.


బచ్చూ సహా అనేక మంది ఫ్లకార్డులు, బ్యానర్లతో గురువారం సచిన్‌ ఇంటి ముందు చేరారు. ఆయన్ను విమర్శిస్తూ ఆందోళన నిర్వహించారు. 15 రోజుల్లోగా ఇలాంటి అనైతిక ప్రచారాలు మానుకోవాలని డిమాండ్‌ చేశారు. భవిష్యత్తు తరాలను ఇలాంటి గ్యాంబ్లింగ్‌ గేమ్స్‌ దెబ్బతీస్తాయని సూచించారు. ఆందోళన తీవ్రమవ్వడంతో పోలీసులు స్పందించారు. బచ్చూ కాదు సహా కొందరిని బాండ్రా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దాంతో కార్యకర్తలు అక్కడికి చేరుకొని ఆందోళన నిర్వహించారు. నినాదాలు చేశారు.


సచిన్‌ తెందూల్కర్‌కు భారత రత్న పురస్కారం లేకుంటే తాము ఆందోళనలు నిర్వహించేవాళ్లం కాదని పీజేపీ ఎమ్మెల్యే ఓం ప్రకాశ్‌ అంటున్నారు. వ్యక్తిగత లాభం కన్నా దేశ శ్రేయస్సే ముఖ్యమని వెల్లడించారు. 'ఇలాంటివాటిని ప్రమోట్‌ చేస్తూ రూ.300 కోట్లు సంపాదించాలనుకుంటే సచిన్‌ భారత రత్నను వెనక్కి ఇవ్వాలి' అని డిమాండ్‌ చేశారు.


కొన్ని రోజుల క్రితమే బచ్చూ సీఎం ఏకనాథ్‌ షిండేకు లేఖ రాశారు. ఆన్‌లైన్‌ గ్యాంబ్లింగ్‌ గేమ్స్‌కు మద్దతుగా ప్రచారం చేస్తున్న సచిన్‌ తెందూల్కర్‌ భారత రత్న పురస్కారాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ ఏశారు. సచిన్‌ ఇప్పటికైనా తీరు మార్చుకోకుంటే లీగల్‌ యాక్షన్‌ తీసుకుంటామని హెచ్చరించారు.


Also Read: ఆసియా కప్‌లో ఆధిపత్యం ఎవరిది? - దాయాదుల పోరులో ఎడ్జ్ ఎవరికి?