Shocking: భార్య పింఛన్ కోసం ఏ వ్యక్తి చేయని పనిని భర్త చేశాడు. ఒకటి, రెండు రోజులు కాదు ఏకంగా ఐదేళ్లు భార్య డెడ్ బాడీని ఫ్రిడ్జ్‌లో దాచి పెట్టాడు. ఐదేళ్ల పాటు భార్య పింఛన్ తీసుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడు పింఛన్ ఇవ్వడానికి వచ్చినా భర్తే డబ్బు తీసుకుంటుండంతో అధికారులకు అనుమానం వచ్చింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పక్కాగా స్కెచ్ చేశారు. అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా 3.5 ఏళ్లు జైలు శిక్ష విధించింది. ఈ ఘటన స్వీడన్‌లో జరిగింది. 


స్టాక్‌హోమ్‌కు పశ్చిమాన 340 కిలోమీటర్ల దూరంలో ఉన్న అర్జాంగ్‌లో ఓ వృద్ధ జంట జీవించేది. వృద్ధురాలు 2018లో మరణించింది. అప్పటికే ఆమెకు ఫించన్ వచ్చేది. దానికి కోసం ఆశపడిన భర్త భార్య మృతదేహాన్ని ఐదేళ్లుగా ఫ్రిడ్జ్‌లో ఉంచాడు. భార్య బ్రతికే ఉందని స్నేహితులు, దూరంగా ఉంటున్న కుటుంబ సభ్యులను నమ్మించేవాడు. ఎవరైనా వస్తే ‘ఇదిగో ఇప్పుడే బయటకు వెళ్లింది. పడుకుని నిద్రపోతోంది’ అంటూ చెప్పేవాడు. కొన్ని సార్లు ఆమెకు మీతో మాట్లాడడం ఇష్టం లేదని చెప్పేవాడు.


దీంతో అతని  ప్రవర్తనపై కుటుంబ సభ్యులకు అనుమానం వచ్చింది. ఎప్పుడు అడిగినా ఏదో ఒక సాకుతో తప్పించుకుంటున్నాడని తెలుసుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుట్టు రట్టు చేసేందుకు పోలీసులు పక్కా పథకం వేశారు. అసలు విషయం తెలుసుకుని అవాక్కయ్యారు. భార్య డెడ్ బాడీని ఐదేళ్లుగా ఫ్రిడ్జిలో ఉంచినట్లు తెలుసుకుని షాక్‌కు గురయ్యారు. 2018 నుంచి భార్య మృతదేహాన్ని ఫ్రీజర్‌లో భద్రపరిచాడు. దాంట్లోనే అతను ఆహారాన్ని కూడా నిల్వ చేశాడు. ఐదేళ్ల పాటు మొత్తం 1.2 మిలియన్ నార్వేజియన్ క్రోనర్ ($116,000)  విలువ చేసే సొమ్మును మహిళ పెన్షన్, పన్ను రాయితీలను పొందుతూనే ఉన్నాడు.  


నిందితుడి పోలీసులు అరెస్ట్ చేశారు. కోర్టులో హాజరు పరిచారు. అతని తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. పబ్లిక్ శ్మశానంలో భార్య మృతదేహాన్ని ఖననం చేయడం వృద్ధుడికి ఇష్టం లేదన్నారు. తన ఫాంలో అంత్యక్రియలు చేయాలని అనుకున్నాడని, అందుకే ఫ్రీజర్‌లో పెట్టాడని, అది కాస్తా తప్పుదారి పట్టిందన్నారు. వద్ధుడు సైతం తాను చేసిన పనిని అంగీకరించాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ లిండా కార్ల్‌సన్ వాదనలు వినిపిస్తూ ‘ వృద్ధుడు ఫ్రీజర్‌ను ఇతర అవసరాలకు ఉపయోగించాడని, మృతదేహం ఉన్న ఫ్రీజర్ సమాధితో సమానమని అన్నారు. దానిని తెరవడం, మూయడం ద్వారా సమాధి పవిత్రతను ఉల్లంఘించినట్లు అవుతుందని, ఇది తీవ్రమైన నేరం అన్నారు. 


పౌర హక్కులను ఉల్లంఘించడం, మోసం, శవాన్ని ఛిద్రం చేయడం, పత్రాలను తారుమారు చేయడం వంటి ఆరోపణలపై కోర్టు వృద్ధుడిని దోషిగా నిర్ధారించింది.  నిందితుడికి సోమవారం 3.5 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ఇది కాస్తా నెట్టింట వైరల్ అవుతోంది. ఇంట్లో డెడ్ బాడీని పెట్టుకుని ఐదేళ్లు ఎలా ఉన్నావ్ తాతా అంటూ అడుగుతున్నారు. డబ్బు మనిషిని ఏదైనా చేయిస్తుందని చెప్పడానికి ఇదో ఉదాహరణ అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. మనుషులు ఇలా కూడా ఉంటారా అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.