Elon Musk: కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేస్తున్నారని స్పేస్‌ఎక్స్ వ్యవస్థాపకుడు, సీఈఓ ఎలాన్ మస్క్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా విమర్శించారు. వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేయడం సిగ్గుచేటు చర్యగా వర్ణించారు. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ కంపెనీలపై జస్టిన్ ట్రూడో నేతృత్వంలోనే కెనడా ప్రభుత్వం కొత్త నిబంధనుల తీసుకొచ్చింది. ఆన్‌లైన్ స్ట్రీమింగ్ కంపెనీలు కచ్చితంగా రిజిస్టర్ చేసుకోవాలని ఇటీవల ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీని గురించి ప్రముఖ జర్నలిస్ట్ గ్లెన్ గ్రీన్‌వాల్డ్ ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన మస్క్ కెనడా ప్రభుత్వం, జస్టిన్ ట్రూడోపై ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధలపై ప్రముఖ జర్నలిస్ట్ గ్లెన్ గ్రీన్‌వాల్డ్ ఎక్స్ (ట్విటర్)లో పోస్ట్ చేశారు. ప్రపంచంలో అత్యంత అణచివేతతో కూడిన ఆన్‌లైన్ సెన్సార్ షిప్ నిబంధనలు కెనడాలో ఉన్నాయని గ్లెన్ తన పోస్టులో రాసుకొచ్చారు. పాడ్‌కాస్ట్‌లను అందించే ఆన్‌లైన్ స్ట్రీమింగ్ సంస్థలను నియంత్రించేందుకు కోసం ట్రూడో ప్రభుత్వం యత్నిస్తోందని, అందుకే ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. అందులో భాగంగా ఆయా కంపెనీలు ప్రభుత్వం వద్ద అధికారికంగా నమోదు చేసుకోవాలని ఆదేశించినట్లు వెల్లడించారు.
దానిని ఉటంకిస్తూ ఎలన్ మస్క్ స్పందించారు. కెనడాలో వాక్ స్వేచ్ఛను అణచివేసేందుకు ట్రూడో ప్రయత్నిస్తున్నారని, అది సిగ్గుచేటు అని రాసుకొచ్చారు. ఇలా వాక్ స్వేచ్ఛపై ట్రూడో ప్రభుత్వం దాడి చేస్తోందంటూ గతంలోనూ విమర్శలున్నాయి. ట్రూడోపై మస్క్ విమర్శులు చేయడం కొత్తేం కాదు. గత ఏడాది ఫిబ్రవరిలో ట్రూడోను హిట్లర్‌తో పోలుస్తూ ట్విటర్‌లో పోస్ట్ పెట్టారు. అయితే కొద్ది సేపటికే దానిని డిలీట్ చేశారు. కొవిడ్ వ్యాక్సిన్లను తప్పనిసరి చేస్తూ 2022 ఫిబ్రవరిలో కెనడా ప్రభుత్వం తీసుకొచ్చిన ఆదేశాలను అక్కడి ట్రక్కు డ్రైవర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వీరిని అణచివేసేందుకు కెనడా చరిత్రలోనే ట్రూడో తొలిసారి ఎమర్జెన్సీ అధికారాలను అమలు చేశారు.
దిగజారిపోతున్న దౌత్య సంబంధాలు
భారత్, కెనడా వివాదం నానాటికి ముదురుతోంది. రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు రోజురోజుకీ దిగజారుతున్నాయి. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత్ ఏజెన్సీల హస్తం ఉందంటూ ట్రూడో చేసిన ఆరోపణలు ఇరు దేశాల మధ్య వివాదానికి దారి తీసింది. అయితే కెనడా వ్యాఖ్యలపై భారత్ సైతం ఘాటుగానే స్పందించింది. నిజ్జర్ హత్యకు ఆధారాలు చూపించాలని బలంగా డిమాండ్ చేసింది. అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ క్రమంలో భారత్ దైత్య వేత్తలను కెనడా బహిష్కరించింది. దీనికి బదులులుగా భారత్‌లో ఉన్న కెనడా దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లాలని భారత్ ఆదేశించింది. అంతే కాకుండా కెనడా దేశస్తులకు వీసా సేవలను నిలిపివేసింది. అంతే కాకుండా కెనడా దౌత్య సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవాలని భారత్ సూచించింది.