Pakistani Beggars: యాత్రికులు, పర్యాటకుల రూపంలో సౌది అరేబియాలో భిక్షాటన చేసేందుకు వెళ్లడానికి యత్నించిన 24 మంది పాకిస్తాన్ పౌరులను ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ(FIA) ఆదివారం అరెస్ట్ చేసింది. ఆ వివరాలను పాకిస్తాన్‌కు చెందిన ప్రముఖ పత్రిక డాన్ వెల్లడించింది. డాన్ కథనం మేరకు.. శనివారం అర్థరాత్రి ముల్తాన్ విమానాశ్రయంలో సౌదీ అరేబియా వెళ్లే విమానంలో ఉమ్రా యాత్రికుల వేషధారణలో ఉన్న ఎనిమిది మంది యాచకులను అరెస్ట్ చేసింది. పంజాబ్ ప్రావిన్స్‌లోని ముల్తాన్ విమానాశ్రయంలో ఇది రెండో ఘటనగా డాన్ పేర్కొంది. రెండు రోజుల క్రితం ముల్తాన్ విమానాశ్రయంలో ఉమ్రా వీసాపై సౌదీకి వెళ్లే 16 మందిని  FIA అరెస్ట్ చేసింది. వీరిలో ఒక చిన్నారి, 11 మంది మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. తాజాగా ఆదివారం మరో 8 మంది అలాగే పట్టుబడ్డారు. 


ఈ మేరకు FIA ఇమ్మిగ్రేషన్ అధికారి తారిక్ మెహమూద్ ప్రకటన విడుదల చేశారు. ఈ యాత్రికుల బృందం భిక్షాటన కోసం సౌదీ అరేబియాకు ప్రయాణిస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్ సమయంలో తేలిందని పేర్కొన్నారు. ఇమిగ్రేషన్ సమయంలో వారు చెప్పిన సమాధానాలు విని షాక్ గురయ్యామని.. యాత్రికులు సౌదీ అరేబియా వెళ్లి భిక్షాటన చేస్తారని, అక్కడ వచ్చిన మొత్తంలో సగ భాగాన్ని సబ్ ఏజెంట్లకు అందజేస్తామని సమధానం ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో FIA అధికారులు వారి పాస్‌పోర్ట్‌లు స్వాధీనం చేసుకుని వారి స్టేట్‌మెంట్లు రికార్డు చేసుకున్నారు. ప్రయాణికులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం ముల్తాన్‌లోని మానవ అక్రమ రవాణా, స్మగ్లింగ్ నివారణ సంస్థకు తరలించారు. వ్యక్తుల అక్రమ రవాణా చట్టం, 2018 కింద నేరస్థులపై కేసు నమోదు చేయనున్నట్లు FIA తెలిపింది. ఇమ్మిగ్రేషన్ ప్రక్రియలో మొదటగా పట్టుబడిన బృందం సైతం భిక్షాటన కోసం సౌదీ అరేబియాకు వెళ్తున్నట్లు ఒప్పుకున్నారని,  చట్టపరమైన చర్యల కోసం ప్రయాణికులను FIA అరెస్ట్ చేసిందని డాన్ ప్రముఖంగా ప్రచురించింది.   


ఇటీవల నివేదికల్లో పాకిస్తాన్ నుంచి ఎక్కువ శాతం మందిని అక్రమ మార్గాల ద్వారా విదేశాలకు తరలిస్తున్నట్లు పాక్ మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ వెల్లడించింది. విదేశాల్లో పట్టుబడిన యాచకుల్లో 90 శాతం మంది పాకిస్తాన్‌కు చెందినవారేనని మంత్రిత్వ శాఖ కార్యదర్శి సెనేట్ ప్యానెల్‌కు వెల్లడించారు. పాకిస్థానీ యాచకులు జియారత్ (తీర్థయాత్ర) ముసుగులో మధ్యప్రాచ్య దేశాలకు వెళ్తారని, చాలా మంది ప్రజలు ఉమ్రా వీసాలపై సౌదీ అరేబియాను సందర్శిస్తారని, ఆపై భిక్షాటన చేస్తారని విదేశీ పాకిస్థానీల విభాగం కార్యదర్శి జీషన్ ఖంజదా గత నెలలో సెనేట్ స్టాండింగ్ కమిటీ సమావేశంలో చెప్పారు. పాకిస్తాన్‌కు చెందిన యాచకుల అరెస్టులతో జైళ్లన్నీ కిక్కిరిసి పోయాయని ఇరాక్, సౌదీ రాయబారులు నివేదించినట్లు తెలిపారు. 


మక్కా గ్రాండ్ మసీదులో అరెస్టయిన జేబుదొంగల్లో ఎక్కువ మంది పాకిస్తాన్ జాతీయులే అని ది ఇంటర్నేషనల్ న్యూస్ దినపత్రిక పేర్కొంది. ఇంధనం, ఆహార రంగాలలో ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగడంతో పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని పేర్కొంది. గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ దిగజారిపోయింది. గోదుమ పిండి నుంచి కిరోసిన్, నిత్యవసరాలు, ఇంధనం ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. అక్కడి ప్రజలు ఉపాధి లేక ఇతర దేశాలకు వలస వెళ్తున్నారు. ఎక్కువ శాతం మంది ఇతర దేశాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఏజెంట్లు వారిని అక్రమ మార్గాల ద్వారా దేశం దాటిస్తున్నారు. ఇలా పాకిస్తాన్ విడిచి వెళ్లిన వారు ఎక్కువ శాతం మంది ఇరాక్, సౌది అరేబియాలకు వెళ్తున్నారు. అక్కడ భిక్షాటన చేస్తున్నారు. ఇక ఉమ్ర వీసా విషయానికి వస్తే.. ముస్లింలు పవిత్ర మక్కా ఇస్లామిక్ తీర్థయాత్ర కోసం ఉమ్రా వీసా మంజూరు చేస్తారు. ఈ వీసాతో సంవత్సరంలో ఎప్పుడైనా మక్కాలో పర్యటించవచ్చు.