Russia vs Ukraine ``యుద్ధం! ఇది రాతియుగం నాటి మాట‌. ఇప్పుడు ప్ర‌పంచవ్యాప్తంగా ప్ర‌జాస్వామ్య(Democrtic) దేశాలు పెరుగుతున్నాయి. ప్ర‌జ‌ల కోసం.. ప్ర‌జ‌ల చేత అనే ప్ర‌జాస్వామ్యంలో యుద్ధాల‌కు తావులేదు. అభివృద్ధి యుద్ధం చేసుకుందాం.. సాంకేతిక‌త మెరుగుద‌ల‌లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కార యుద్ధం చేసుకుందాం. ఆరోగ్య రంగంలో మెరుగైన వ‌స‌తులు, ఔష‌ధ త‌యారీ రంగంలో ఆహ్వానించ‌ద‌గిన మార్పు కోసం యుద్ధం చేసుకుందాం. ప్ర‌స్తుతం భౌతిక‌ యుద్ధాల‌కు, ఆయుధ ప్ర‌యోగాల యుద్ధాల‌కు కాలం చెల్లింది. నాడు, నేడు, ఏ నాడూ.. భార‌త్(India) ప్ర‌వ‌చించే మాట ఇదే``- రెండేళ్ల కింద‌ట ర‌ష్యా(Russia)-ఉక్రెయిన్(Ukrain) దేశాల మ‌ధ్య యుద్ధానికి బీజం ప‌డి.. మాస్కో(Masco)(ర‌ష్యా రాజ‌ధాని) మంట‌లు రేపిన‌ప్పుడు భార‌త్ ఈ ప్ర‌పంచానికి ఇచ్చిన గొప్ప సందేశం ఉంది. అయితే.. ఈ మాట ర‌ష్యా చెవికెక్కించుకోలేదు. నాటో కూట‌మిలో చేరేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించిన ఉక్రెయిన్‌పై కాలు రువ్వింది. యుద్ధానికి సిద్ధ‌మైంది. ప్ర‌పంచ దేశాలు వారిస్తున్నా.. తనం పంతం కొన‌సాగిస్తూనే ఉంది. ఈ యుద్ధ హోమంలో స‌మిధ‌లైన వారు అమాయ‌కులు, నిర్భాగ్యులు కావ‌డం ప్ర‌పంచం నివ్వెర‌పోయేలా చేసింది. ఈ యుద్ధం ప్రారంభ‌మై శ‌నివారం(ఫిబ్ర‌వ‌రి 24)కు రెండేళ్లు గ‌డిచాయి. కానీ, ఏదేశం ఏం సాధించింద‌ని చూస్తే.. వెక్కిరిస్తున్న పుర్రెలు.. నిస్తేజంగా మారిన న‌గ‌రాలు.. బూడిద కుప్ప‌ల్లా మిగిలిన భ‌వంతులే క‌నిపిస్తున్నాయి. 


ర‌ష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొద‌లైందిలా..


ఉక్రెయిన్‌ ‘సంపూర్ణంగా నిస్సైనికీకరణే’ లక్ష్యంగా 2022 ఫిబ్రవరి 24న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్(Vladamir putin) యుద్ధానికి దిగారు. నాటో దేశాల కూట‌మిలో ఉక్రెయిన్ చేరాల‌ని ప్ర‌య‌త్నించింది. దీనిని తీవ్రంగా వ్య‌తిరేకించిన పుతిన్‌.. గ‌తంలోనే ప్రారంభించిన ఆక్ర‌మ‌ణ‌ల యుద్ధాన్ని గ‌త రెండేళ్ల కింద‌ట మ‌రింత ముమ్మ‌రం చేశారు. వాస్త‌వానికి ఫిబ్రవరి 2014 చివరలో రష్యా క్రిమియాను ఆక్రమించడం ప్రారంభించింది, ఇది రష్యా-ఉకెయిన్ యుద్ధానికి నాంది పలికింది. ఫిబ్రవరి 22, 23 తేదీలలో, యనుకోవిచ్ బహిష్కరణకు గురైన వెంటనే సంబంధిత రష్యన్ దళాలు, ప్రత్యేక దళాలు క్రిమియా సరిహద్దుకు దగ్గరగా వెళ్లాయి.. ఇది.. ఇరు దేశాల మ‌ధ్య యుద్ధానికి కార‌ణంగా మారింది. వాస్త‌వానికి ఈ యుద్ధం కొద్ది రోజుల్లోనే ముగుస్తుందనుకున్నప్ప‌టికీ రెండేళ్లు దాటినా కొనసాగుతూనే ఉంది. 


బుల్లి దేశం.. బ‌హు బ‌లంగా!


వాస్త‌వానికి ర‌ష్యా ముందు.. ఉక్రెయిన్ దేశం చివురుటాకు వంటింది. అయితే.. ఈ దేశం.. అవ‌లంభిస్తున్న విధానాలు ప్ర‌పంచ దేశాల‌ను ముగ్ధులను చేశాయి. ముఖ్యంగా అమెరికా వంటివి ఉక్రెయిన్‌కు ద‌న్నుగా నిలిచాయి. దీంతో బుల్లి దేశ‌మే క‌దా తుడిచి పెట్టేయొచ్చు.. అని భావించిన ర‌ష్యాకు ఉక్రెయిన్ చుక్క‌లు చూపిస్తూనే ఉంది. అంతేకాదు.. ఆక్రమిత భూభాగాల నుంచి వైదొలగి, తమకు జ‌రిగిన అపార నష్టానికి రష్యా భారీగా పరిహారం చెల్లించాలని డిమాండ్‌ చేస్తోంది. ఈ నేపథ్యంలో యుద్ధం ఇప్పుడప్పట్లో ముగిసే సూచనలు కనిపించడం లేదని అంటున్నారు అంత‌ర్జాతీయ ప‌రిశీల‌కులు.


జెలెన్‌స్కీ వ్యూహం..


సాధార‌ణంగా చిన్న చిన్న దేశాల‌పై పెద్ద దేశాలు యుద్ధానికి తెగ‌బ‌డిన‌ప్పుడు.. లేదా అంత‌ర్యుద్ధాలు వ‌చ్చిన‌ప్పుడు అధ్యక్షులు, ప్ర‌ధానులు పారిపోతారు. శ్రీలంక‌లో అదే జ‌రిగింది. కానీ, ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెల్‌న్‌స్కీ(Zelnsky) మాత్రం ప్ర‌జ‌ల‌కు అండ‌గా ఉన్నారు. దేశంలోనే ఉంటాన‌ని.. ఎటూ పారిపోన‌ని ఆయ‌న చెప్ప‌డం ద్వారా ప్ర‌జ‌ల్లో తిరుగుబాటు శ‌క్తి పెరిగింది. వాస్త‌వానికి యుద్ధం తొలినాళ్లలో రష్యా దూకుడు ప్రదర్శించింది. రష్యా సేనలు ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సమీపం దాకా దూసుకెళ్లాయి. యూరప్‌లోనే అతి పెద్దదైన జపోరిజియా అణు విద్యుత్కేంద్రాన్ని ఆక్రమించడంతో యావత్‌ యూరప్‌ ఖండం భద్రతాపరమైన ఆందోళనలతో ఉలిక్కిపడింది. కానీ ఆ జోరుకు నెల రోజుల్లోనే బ్రేకులు పడ్డాయి. ఉక్రెయిన్‌ దళాలు ముప్పేట దాడులతో రష్యా సైన్యాన్ని దిగ్బంధించాయి. అమెరికాతో పాటు పాశ్చాత్య దేశాల దన్నుతో పైచేయి సాధిస్తూ వచ్చాయి. మ‌రోవైపు యుద్దం కార‌ణంగా ఉక్రెయిన్‌, రష్యాలు రెండూ తీవ్రంగా న‌ష్ట‌పోయాయి. రష్యాకు చెందిన భారీ యుద్ధ నౌకలతో పాటు క్రిమియాతో రష్యాను కలిపే కీలక బ్రిడ్జిని పేల్చేయడం వంటి చర్యలతో ఉక్రెయిన్‌  పైచేయి సాధించింది. 2023 మేలో ఏకంగా మాస్కోలో పుతిన్‌ అధికార నివాసమైన క్రెమ్లిన్‌పై రెండు ఉక్రెయిన్‌ డ్రోన్లు దూసుకెళ్లి కలవరం రేపాయి. ఉక్రెయిన్‌ డ్రోన్ల దాడి దెబ్బకు తొలుత అపార నష్టం చవిచూసిన రష్యా సైన్యం తానూ అదే బాట పట్టింది. కొంతకాలంగా ఇరు బలగాలూ డ్రోన్లపైనే ప్రధానంగా ఆధారపడుతున్నాయి.


ర‌ష్యాకు పరువు.. ఉక్రెయిన్‌కు ప్రాణాలు!


ఇరు దేశాల మ‌ధ్య కొన‌సాగుతున్న యుద్ధాన్ని ఏ ఒక్క‌రూ ఆపే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. ర‌ష్యా అధ్య‌క్షు డు పుతిన్ యుద్ధం ఆపేస్తే.. ఆయ‌న ప‌ద‌వికే ఎస‌రు. పైగా కోపోద్రిక్తులుగా ఉన్న ర‌ష్యాన్లు.. ఆయ‌న‌ను స‌హించే ప‌రిస్థితి కూడా లేదు. ఇటీవ‌ల ర‌ష్యాకు చెందిన విప‌క్ష నాయ‌కుడు మాట్లాడుతూ.. ``యుద్ధం ఇప్పుడు ఉక్రెయిన్‌పై కాదు.. పుతిన్‌పై పుతినే చేసుకుంటున్నారు. ఆయ‌న యుద్ధాన్ని కాదంటే.. దేశంలో ఎవ‌రూ స‌హించ‌రు. సో.. ఏదో ఒక‌టి వీర భూమిలోనే తేల్చుకోవాలి`` అని వ్యాఖ్యానించారు. ఇక‌, ఉక్రెయిన్ ప‌రిస్థితి చూస్తే.. ఈ దేశం కూడా..యుద్ధానికి ముగింపు ప‌లికే అవ‌కాశం లేదు. ఎందుకంటే.. ర‌ష్యా ఆక్ర‌మిస్తే.. పౌరుల ప్రాణాల‌కు పెను ముప్పు పొంచి ఉంద‌నే సంకేతాలు వ‌స్తున్నాయి. సో.. ఎలా చూసుకున్నా.. ఈయుద్ధం స్వ‌చ్ఛందంగా అయితే ఆగేలా లేద‌నేది స్ప‌ష్టం.


అపార న‌ష్టం.. 


యుద్ధంలో మరణించిన, క్షతగాత్రులైన రష్యా, ఉక్రెయిన్‌ సైనికుల సంఖ్య ఏకంగా 5 లక్షలు దాటినట్టు అంచనా. 12,000 మందికి పైగా అమాయక ఉక్రేనియ న్లు యుద్ధానికి బలయ్యారు. 20,000 పై చిలుకు మంది క్షతగాత్రులయ్యారు. కోటి మంది దాకా ఉక్రేనియన్లు నిర్వాసితులయ్యారు. వీరిలో 60 లక్షలకు పైగా విదేశాలకు వలసబాట పట్టారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అతి పెద్ద వలసగా నిలిచింది. ర‌ష్యాలోనూ ఇదే ప‌రిస్థితి నెల‌కొంది.


భార‌త్ వైఖ‌రి ఏంటి? 


ర‌ష్యా - ఉక్రెయిన్ యుద్ధంలో ఇత‌ర దేశాల మాట ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. భార‌త్‌త‌ట‌స్థ వైఖ‌రి తీసుకుంది. అంతేకాదు.. అందివ‌చ్చిన ప్ర‌తివేదిక‌పైనా.. ``ఇది యుద్ధాల‌కు స‌మ‌యం కాదు.. అభివృద్ధికి, పోటీ త‌త్వానికి, సాంకేతికంగా ఎదిగేందుకు, ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు పెంచేందుకు మాత్ర‌మే ఈ స‌మ‌యం వెచ్చించాలి`` అని చెబుతోంది. అంతేకాదు.. చ‌ర్చ‌ల ద్వారా ప‌రిష్కారం కాని స‌మ‌స్య ఈ ప్ర‌పంచంలో లేద‌ని కూడా వ్యాఖ్యానిస్తోంది.