Russia Ukraine War Updates: రష్యా ఉక్రెయిన్ మధ్య యుద్ధం దాదాపు మూడేళ్లుగా కొనసాగుతూనే ఉంది. అటు రష్యా కానీ ఇటు ఉక్రెయిన్ కానీ వెనక్కి తగ్గడం లేదు. రెండు వైపులా ప్రాణ,ఆస్తినష్టాలు వాటిల్లాయి. అయినా ఇప్పట్లో ఈ యుద్ధాన్ని ఆపే ఆలోచనలో లేవు రెండు దేశాలు. ఈ క్రమంలోనే ఓ సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. రష్యాలోని కొంతమంది భారతీయులు రష్యన్ ఆర్మీలో సపోర్ట్ జాబ్స్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆ మేరకు ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నారని తెలిసింది. అయితే...కొంత మంది భారతీయులను బలవంతంగా రష్యన్ ఆర్మీలోకి పంపుతున్నారన్న వార్తలూ వచ్చాయి. వీటన్నింటిపైనా భారత్ స్పందించింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో తలదూర్చొద్దని ఇండియన్స్‌కి సూచనలు చేసింది. అప్రమత్తంగా ఉండాలని తేల్చి చెప్పింది. ఎప్పటికప్పుడు ఈ పరిణామాలను పరిశీలిస్తున్నామని, కొంతమంది భారతీయులు రష్యా తరపున పోరాడుతున్నారన్న విషయం తమకు తెలిసిందని వెల్లడించింది. గత వారమే AIMIM చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. రష్యాలో కొంతమంది భారతీయులను బలవంతంగా యుద్ధానికి పంపుతున్నారని అన్నారు. వాళ్లలో ముగ్గురు భారతీయుల్ని రక్షించాలంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్‌కి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే భారత్ ఇలా స్పందించింది.
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం ముగ్గురు ఇండియన్స్‌ని రష్యా ఆర్మీలో సెక్యూరిటీ హెల్పర్స్‌గా చేర్చుకున్నారు. యూపీ, గుజరాత్, పంజాబ్, జమ్ముకశ్మీర్‌కి చెందిన వీళ్లని ఓ ఏజెంట్ రష్యాకి పంపినట్టు తెలుస్తోంది. వీళ్లలో ఓ బాధితుడి కుటుంబ సభ్యులు అసదుద్దీన్ ఒవైసీని కలిసి విషయమంతా చెప్పారు. అప్పుడే ఇదంతా బయటకు వచ్చింది. వీళ్లను వెనక్కి తీసుకురావడానికి అన్ని విధాలుగా ప్రయత్నం చేయాలంటూ అసదుద్దీన్ ప్రభుత్వాన్ని కోరారు. ఆలస్యమైతే వాళ్ల ప్రాణాలకే ప్రమామదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే రెండు దేశాల మధ్య మూడేళ్లుగా యుద్ధం జరుగుతోంది. ఇన్నాళ్లు గట్టిగానే పోరాడిన ఉక్రెయిన్ ఇప్పుడు సరైన ఆయుధాలు లేక ఇబ్బందులు పడుతోంది. రష్యా సైనికుల ఒత్తిడికి కొన్ని చోట్ల తలొగ్గాల్సి వస్తోంది. రోజూ వేలాది బాంబులతో పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. నార్త్ కొరియా, ఇరాన్ నుంచి భారీ మొత్తంలో ఆయుధాలను దిగుమతి చేసుకుంటోంది రష్యా.
టెస్లా అధినేత ఎలన్ మస్క్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ముగించలేని స్థితిలో పుతిన్ ఉన్నారని స్పష్టం చేశారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ముగిస్తే పుతిన్ హత్యకు గురవుతారని మస్క్ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. అమెరికా రిపబ్లికన్ సెనేటర్స్‌తో చర్చ జరిగిన సమయంలో ఎలన్ మస్క్ ఇలా మాట్లాడారు. ఉక్రెయిన్‌కి అమెరికా భారీ ఎత్తున సాయం అందించడాన్ని వ్యతిరేకించారు మస్క్. ఉక్రెయిన్‌పై జరుగుతున్న యుద్ధంలో పుతిన్ ఓడిపోయే అవకాశమే లేదని, అనవసరంగా అమెరికా ఉక్రెయిన్‌కి ఆ స్థాయిలో సాయం అందించడం వృథా అని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్‌కి అమెరికా సాయం చేయడం వల్ల యుద్ధం పొడిగించినట్టే అవుతుందని స్పష్టం చేశారు.
Also Read: Lok Sabha Elections 2024: మార్చి 13 తరవాత లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్! ఏర్పాట్లు పూర్తి చేస్తున్న ఈసీ