Income Tax Return Filing 2024 - Multiple Form-16s: ఈ ఆర్థిక సంవత్సరంలో (2023-24) ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు మారిన టాక్స్‌పేయర్లకు (Taxpayers) ఇన్‌కమ్‌ టాక్స్‌ రిటర్న్‌ ‍‌(ITR) ఫైల్‌ చేయడంలో కాస్త ఇబ్బంది ఉండొచ్చు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలు చేసిన టాక్స్‌పేయర్‌ ఒకటి కంటే ఎక్కువ ఫామ్-16 పొందుతాడు. దానివల్ల, రిటర్న్ దాఖలు చేసేటప్పుడు మొత్తం ఆదాయం, డిడక్షన్స్‌ లెక్క తేలక కొద్దిగా గందరగోళం ఏర్పడుతుంది.


ITR దాఖలు చేసేటప్పుడు, కొత్త కంపెనీ నుంచి తీసుకున్న ఫామ్‌-16 ఆధారంగా మాత్రమే ఆదాయాన్ని చూపాలని చాలామంది తప్పుగా భావిస్తున్నారు. ఈ కారణంగా, రిటర్న్ ఫైల్‌ చేసిన తర్వాత ఐటీ నోటీస్‌ అందుకుంటున్నారు. ఒక ఆర్థిక సంవత్సరంలో ఎన్ని కంపెనీల్లో పని చేస్తే, అన్ని కంపెనీల నుంచి పొందిన జీతపు ఆదాయాన్ని తప్పనిసరిగా రిటర్న్‌లో చూపాలి. 


ఐటీఆర్‌ దాఖలు చేయడానికి అత్యంత కీలక డాక్యుమెంట్‌ ఫామ్‌-16. దీనిని TDS సర్టిఫికేట్‌గా కూడా చెప్పుకోవచ్చు. యాజమాన్య కంపెనీ తన ఉద్యోగికి ఫామ్‌-16 జారీ చేస్తుంది. ఇందులో.. జీతం నుంచి వచ్చే ఆదాయం, ఎగ్జంప్షన్స్‌, డిడక్షన్స్‌, జీతం నుంచి తీసేసిన TDS (Tax deducted at Source) గురించిన సమాచారం ఉంది.


ఉద్యోగం మారుతున్నప్పుడు..
మీరు ఆర్థిక సంవత్సరం మధ్యలో (ఏప్రిల్‌ 1- మార్చి 31 మధ్య కాలంలో) ఉద్యోగం మారితే.. మొదట ఫారం-12Bని కొత్త యజమానికి ఇవ్వాలి. దీనిని పాత కంపెనీ నుంచి తీసుకోవాలి. పాత కంపెనీ నుంచి పొందిన జీతం, HRA తరహా మినహాయింపులు, సెక్షన్‌ 80C, సెక్షన్‌ 80D కిందకు వచ్చే డిడక్షన్స్‌ ఈ ఫారంలో ఉంటాయి. TDS కూడా ఉంటుంది. కొత్త కంపెనీ, మొత్తం సంవత్సరానికి మీ పన్ను బాధ్యతను (Tax liability) లెక్కించేటప్పుడు ఫారం-12Bని ఉపయోగించుకుంటుంది. ఆ తర్వాత కంబైన్డ్‌ ఫామ్‌-16 జారీ చేస్తుంది.


ఫారం-12B ఇవ్వకపోతే..
2023-24 ఆర్థిక సంవత్సరంలో ఉద్యోగం మారి, కొత్త కంపెనీకి మీకు ఫారం-12Bని మీరు ఇవ్వకుంటే ఏం చేయాలి?. పాత కంపెనీతో పాటు, కొత్త కంపెనీ కూడా మీకు ఫామ్‌-16 జారీ చేస్తుంది. అంటే, మీ దగ్గర రెండు ఫామ్‌-16లు ఉంటాయి. అలాంటి సందర్భంలో రిటర్న్ దాఖలు చేసేటప్పుడు రెండు ఫారం-16ల్లో ఉన్న గ్రాస్‌ శాలరీని కలపండి. ఇది, టోటల్‌గా మీ గ్రాస్‌ శాలరీ అవుతుంది. అదేవిధంగా, హౌస్ రెంట్ అలవెన్స్ (HRA), LTA వంటి మినహాయింపు మొత్తాన్ని ఫామ్-16 రెండింటి నుంచి యాడ్‌ చేయాలి. తద్వారా మినహాయింపుల మొత్తాన్ని తెలుసుకోవచ్చు. స్థూల జీతం మొత్తం నుంచి అలవెన్స్‌లు తీసేసిన తర్వాత, 'ఇన్‌కమ్ ఛార్జబుల్‌ అండర్ శాలరీ హెడ్' వస్తుంది.


జీతం కాకుండా... సేవింగ్స్ ఖాతా, FD వంటి వాటి మీద వడ్డీ లేదా ఇతర మార్గాల నుంచి ఆదాయం ఉంటే దానిని 'ఇన్‌కమ్‌ ఫ్రమ్‌ అదర్‌ సోర్స్‌'లో చూపించాలి. ఆ తర్వాత మీ టోటల్‌ గ్రాస్‌ ఇన్‌కమ్‌ వస్తుంది. తదుపరి దశ 80C, 80D వంటి డిడక్షన్స్‌ క్లెయిమ్ చేయడం. ఈ తగ్గింపులను తీసివేసిన తర్వాత మిగిలిన మొత్తం 'నెట్‌ టాక్సబుల్‌ ఇన్‌కమ్‌' అవుతుంది. ఫారం-16లో రెండు కంపెనీలు ఒకే రకమైన డిడక్షన్‌ తీసుకునే అవకాశం ఉంది. కానీ, ఆదాయపు పన్ను చట్టం ప్రకారం, మీరు ఆదాయంపై ఒక్కసారి మాత్రమే డిడక్షన్‌ తీసుకోవాలి. స్టాండర్డ్ డిడక్షన్ విషయంలో కూడా ఇదే రూల్‌ వర్తిస్తుంది.


వివరాలన్నీ సరిపోవాలి
పన్ను విధించదగిన ఆదాయాన్ని లెక్కించిన తర్వాత, ఇప్పుడు టాక్స్‌ లయబిలిటీ లెక్కించాలి. ఫారం-16 రెండింటిలోనూ TDS తీసేస్తే, రిటర్న్‌లోనూ అదే చూపండి. ఇప్పుడు మీరు చెల్లించాల్సిన పన్ను ఎంత ఉందో తెలుస్తుంది. TDS రూట్‌లో ఎక్కువ మొత్తం కట్‌ అయి, మీరు చెల్లించాల్సిన పన్ను తక్కువగా ఉంటే, మీకు రిఫండ్‌ వస్తుంది. ఫారం-16లో తీసేసిన TDSను, IT డిపార్ట్‌మెంట్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉన్న ఫారం-26AS, AIS ఉన్న సమాచారంతో సరిపోవాలి. 


కొత్త కంపెనీ నుంచి ఫారం-16 అందుకున్నా, పాత కంపెనీ ఇవ్వకపోతే... పాత కంపెనీ 'పే స్లిప్' అవసరం అవుతుంది. జీతం, మినహాయింపులు లెక్కించడం ద్వారా మీ జీతం నుంచి వచ్చే ఆదాయం తెలుస్తుంది. రెండు కంపెనీల నుంచి కట్‌ చేసిన TDS వివరాలు ఫామ్‌-26ASలో ఉంటాయి. సెక్షన్‌ 80C వంటి తగ్గింపులను క్లెయిమ్ చేసిన తర్వాత నికరంగా పన్ను విధించదగిన ఆదాయం తెలుస్తుంది.


మరో ఆసక్తికర కథనం: బ్యాంక్‌, పోస్టాఫీస్‌ ఖాతాదార్లకు అలెర్ట్‌ - మార్చి 31లోగా ఈ పని చేయకపోతే జరిమానా