రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. నాటోలో చేరడం వల్ల భవిష్యత్తులో జరగబోయే పరిణామాల గురించి ఫిన్లాండ్, స్వీడన్‌లను తాజాగా రష్యా హెచ్చరించింది. ఈ విషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మారియా జఖరోవా వెల్లడించారు. 


రష్యా దాడులు


ఉక్రెయిన్‌లో రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ఓడరేవు నగరం మరియాపోల్‌పై రష్యా దాడులు చేయడంతో వేల సంఖ్యలో ఉక్రెయిన్‌ పౌరులు మృతి చెందినట్లు తెలుస్తోంది. అయితే ఉ‍క్రెయిన్‌ అభ్యర్థన మేరకు రష్యా కీలక నిర్ణయం తీసుకుంది. మరియాపోల్ నుంచి ఉక్రెయిన్‌ పౌరులను సురక్షిత ప్రాంతానికి తరలించడానికి రష్యా ఒప్పుకుంది. ఈ మేరకు ఉక్రెయిన్ ఉప ప్రధాన మంత్రి ఇరినా వెరెష్‌చుక్ టెలిగ్రామ్‌లో తెలిపారు.


భారత కాలమానం ప్రకారం బుధవారం మధ్యాహ్నం మరియాపోల్‌ నుంచి ఉక్రెయిన్‌ పౌరులను సురక్షిత ప్రాంతానికి తరలించనున్నట్టు ఇరినా తెలిపారు. ఫిబ్రవరి 24న రష్యా దాడులు ప్రారంభమైనప్పటి నుంచి మానవతా కారిడార్ల ద్వారా సుమారు 3,00,000 మంది ఉక్రెయిన్‌ నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లినట్టు ఉక్రెయిన్ పేర్కొంది.


50 రోజులు 


ఉక్రెయిన్‌- రష్యా మధ్య యుద్ధం 50 రోజులు దాటింది. అయినప్పటికీ రష్యా వెనక్కి తగ్గడం లేదు. రెండో దశలోకి యుద్ధం అడుగుపెట్టిందంటూ ఉక్రెయిన్‌ అధ్యక్షుడు వ్లాదిమిర్‌ జెలెన్‌స్కీ ఇటీవల అన్నారు. 


ఫిబ్రవరి నెలాఖర్లో ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య చేపట్టింది. అప్పటినుంచి ఎన్నో దఫాలుగా చర్చలు జరుపుతూనే మరోవైపు ఉక్రెయిన్‌లోని ముఖ్య నగరాలను హస్తగతం చేసుకునేందుకు బాంబుల వర్షం కురిపించింది రష్యా. అయితే యుద్ధం మొదలైనప్పటినుంచి ఈ నెలవ 17 వరకు రష్యా 2,002 సాయుధ వాహనాలు, 148 యూఏవీలు కోల్పోయింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ఆర్మీ అధికారికంగా ప్రకటించింది. 


ఉక్రెయిన్ సాయుధ బలగాల జనరల్ స్టాఫ్ ఫేస్‌బుక్ ద్వారా యుద్ధానికి సంబంధించి పలు వివరాలు షేర్ చేసుకున్నారు. తమ దేశంపై రష్యా యుద్ధం మొదలుపెట్టిన ఫిబ్రవరి 24 నుంచి ఏప్రిల్ 17 వరకు దాదాపుగా 20,300 ఆర్మీ సిబ్బంది, 773 యుద్ధ ట్యాంకులు, 2002 సాయుధ వాహనాలు, 376 ఆర్టిలరీ సిస్టమ్స్, 127 రాకెంట్ లాంచర్స్, 66 యూనిట్ల వైమానిక దళ సామాగ్రి, 165 విమానాలు, 146 హెలికాప్టర్లు, 1,471 ఆటోమేటిక్ ఆయుధాలు, ఆయుధ సామాగ్రి, ఓడలు, పడవలు కలిపి 8 వరకు  రష్యా నష్టపోయిందని ఉక్రెయిన్ సాయుధ బలగాల జనరల్ స్టాఫ్ బహిర్గతం చేశారు. 


Also Read: DDMA Covid-19 Guidelines: మళ్లీ అదే కథ- దిల్లీ సర్కార్ కీలక నిర్ణయం, ఇక మాస్కు పెట్టుకోకపోతే!



Also Read: Coronavirus Cases India: భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసులు, భారత్‌లో కరోనా ఫోర్త్ వేవ్‌కు సంకేతమా !