అంగారకుడిపై ఒంటరిగా తిరుగుతూ పరిశోధనలు చేస్తున్న నాసా పర్సెవరెన్స్ రోవర్ ఓ కొత్తరకం రాళ్లను గుర్తించింది. మార్స్ డెల్టా ప్రాంతంలో ప్రస్తుతం తిరుగుతున్న రోవర్ అక్కడ మిగిలిన వాటితో పోలిస్తే భిన్నంగా లేత రంగులో కనిపిస్తోన్న రాళ్లను గుర్తించింది. బహుశా అక్కడ మట్టే అలా ఉందో లేదా కొన్నివేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్న సరస్సు ప్రవాహానికి పడిన గుర్తులో అన్నదానిపై రోవర్ పరిశోధిస్తోంది.


నీరు ఉందా?


శాంపుల్స్‌ను రోవర్ ఇప్పటికే కలెక్ట్ చేయగా నాసా శాస్త్రవేత్తలు వాటి గుట్టును తేల్చే ప్రయత్నాల్లో ఉన్నారు. పనిలో పనిగా రోవర్‌కు ఉన్న క్యామ్.. మార్స్ డెల్టా ఫోటోలను తీసింది. ఇది అచ్చం భూమిపై ఎడారో, కొండ ప్రాంతాలో ఉన్నట్లు ఉన్నాయి. 2020, జనవరి 30న పర్సెవరెన్స్ రోవర్‌ను నాసా ప్రయోగిస్తే 2021, ఫిబ్రవరి 18న అంగారకుడిపైన రోవర్ ల్యాండ్ అయింది. అప్పటి నుంచి మార్స్‌పై తిరుగుతూ అక్కడి రాళ్లను, మట్టిని సేకరిస్తూ మార్స్‌పై పరిస్థితులను అధ్యయనం చేస్తోంది.


నాసా శాస్త్రవేత్తల భావన ప్రకారం అక్కడ కొన్ని వేల సంవత్సరాల క్రితం నీళ్లు ఉండి ఉండొచ్చని భావిస్తున్నారు. ఎందుకంటే మార్స్‌పై ఉన్న రాళ్లు, కొండలను జాగ్రత్తగా పరిశీలిస్తే గాలితో పాటు నీటి వల్ల ఏర్పడిన కోతలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరీ ఉన్నట్టుండి అంగారకుడిపై ఉన్న నీరు ఆవిరైపోవటానికి కారణాలేంటీ అనే కోణంలోనూ రోవర్ చేస్తోన్న ప్రయోగాలు ఉపయోగపడనున్నాయి.


మనం వెళ్లొచ్చా?


ఒకప్పుడు మార్స్‌పై నీరు ఉండేదన్న ప్రాథమిక అంచనాకు వస్తే మనిషి మనుగడకు అవసరమైన అవకాశాలను పరిశీలించాలని నాసా భావిస్తోంది. భవిష్యత్తులో భూమి కాకుండా ఇతర గ్రహాల్లో ఎక్కడైనా ఆవాసానికి అనుకూలమైన పరిస్థితులుంటే అక్కడ కాలనీలు ఏర్పాటు చేయాలనే ఆలోచనల్లో ఉంది నాసా. ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో స్పేస్ ఎక్స్, రిచర్డ్ బ్రాన్సన్ ఆధ్వర్యంలోని వర్జిన్ గెలాక్టిక్, జెఫో బెజోస్ ఆధ్వర్యంలోని బ్లూ ఆరిజన్ ఇలా చాలా ప్రైవేట్ అంతరిక్షపరిశోధన సంస్థల భవిష్యత్తు లక్ష్యం కూడా మార్స్ పై మానవ ఆవాసాలను ఏర్పాటు చేయటమే. ఆ దిశగా ఇప్పుడు నాసా రోవర్ సాగిస్తోన్న పరిశోధనలు చాలా కీలకం.


Also Read: DDMA Covid-19 Guidelines: మళ్లీ అదే కథ- దిల్లీ సర్కార్ కీలక నిర్ణయం, ఇక మాస్కు పెట్టుకోకపోతే!



Also Read: Coronavirus Cases India: భారీగా పెరుగుతున్న కొవిడ్ కేసులు, భారత్‌లో కరోనా ఫోర్త్ వేవ్‌కు సంకేతమా !