రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు ఆ దేశానికే చెందిన ఓ బిలియనీర్. యుద్ధ నేరస్థుడిగా పుతిన్‌ను అరెస్ట్ చేసినా లేదా హత్య చేసినా సరే ఒక మిలియన్ డాలర్ల (6.50 కోట్లు) బహుమతి ప్రకటించారు. ఈ మేరకు రష్యా సైన్యానికి ఆఫర్ ఇచ్చారు. ఫేస్‌బుక్ వేదికగా వ్యాపారవేత్త కొనానిఖిన్ ఈ సంచలన ప్రకటన చేశారు.


పుతిన్‌ రష్యా రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి స్వేచ్ఛాయుత ఎన్నికలు లేకుండా చేశారు. తనని తాను జీవితకాల అధ్యక్షుడిని చేసుకున్నారు. అకారణంగా ఉక్రెయిన్‌పై యుద్ధం ప్రకటించి వేల మంది చావుకి కారణమవుతున్నారు. ఒక రష్యన్‌ పౌరుడిగా నా దేశాన్ని నాజియిజం నుంచి కాపాడాల్సిన బాధ్యత నాకు ఉంది. అందుకే పుతిన్‌ను చంపినవారికి ఒక మిలియన్ డాలర్లు బహుమతిగా ఇస్తాను.


అమెరికాలో


రాజకీయ ఒత్తిళ్ల కారణంగా రష్యాను వీడి ప్రస్తుతం అమెరికాలో ఆశ్రయం పొందుతున్నారు కొనానిఖిన్‌. రష్యాకు చెందిన ఈ వ్యాపారవేత్త అమెరికాలో పలు వ్యాపారాలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. పలు స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టారు. క్రిప్టో ఇన్వెస్టర్‌గా ఆయన చాలా ఫేమస్‌. అతని సంపద విలువ 300 మిలియన్‌ డాలర్లుగా ఉంది.


రాజకీయ ఒత్తిళ్ల కారణంగా కొనానిఖిన్‌ 1992లో రష్యాను వీడారు. ఆ తర్వాత 1999 నుంచి అమెరికాలో ఆశ్రయం పొందుతున్నారు.


యుద్ధం


మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగిస్తోంది. తాజాగా ఖేర్సన్​ నగరాన్ని రష్యా హస్తగతం చేసుకున్నట్లు ఉక్రెయిన్ కూడా​ ధ్రువీకరించింది. ఉక్రెయిన్​ రాజధాని కీవ్​వైపు వేగంగా పయనిస్తోంది రష్యా సైన్యం. దీంతో కీవ్​, కీవ్​ ఒబ్లాస్ట్, లవీవ్​, మైకొలివ్​, చెర్నిహివ్​, ఒడేసా సహా పలు ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిగే అవకాశముందని హెచ్చరించింది. అయితే యుద్ధం మొదలైనప్పటి నుంచి 9 వేల మంది రష్యా సైనికులను చంపినట్లు ఉక్రెయిన్​ రక్షణ శాఖ వెల్లడించింది.


కానీ రష్యా లెక్కలు మాత్రం వేరేలా ఉన్నాయి. తమవైపు కన్నా ఉక్రెయిన్‌ వైపే ప్రాణ నష్టం ఎక్కువగా జరిగిందని రష్యా వాదిస్తోంది. అయితే ఇప్పటికీ ఉక్రెయిన్‌తో చర్చలకు తాము సిద్ధమేనని, కానీ తమ షరతులకు రాతపూర్వక హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది రష్యా. ఇందుకు ఉక్రెయిన్ అంగీకరించకుండా ఇంకా పోరాటం సాగిస్తే జరిగే ప్రాణనష్టానికి తాము బాధ్యులం కాదని రష్యా తెలిపింది. 


Also Read: Russia Ukraine War: అలాంటిదేం లేదు, ఉక్రెయిన్‌లో మా విద్యార్థులు బందీలుగా లేరు: భారత్


Also Read: Russia Ukraine War: ఇది వాళ్ల టైం- బైడెన్‌ను చేతకానివాడిగా చూస్తున్నారు: ట్రంప్ షాకింగ్ కామెంట్స్