ఇప్పటి వరకు మనం వన్‌మినిట్‌ రూల్‌(One Minute rule) పరీక్షల్లో మాత్రమే చూశాం. ఇప్పుడు ఏకంగా ఓ ప్రొఫెసర్‌ క్లాస్‌లోనే అమలు చేసేసి చిక్కుల్లో పడ్డారు. 


అరే మా సార్‌ మహా స్ట్రిక్ట్‌రా.. వన్‌ మినిట్ లేట్‌ ఆయినా చితక్కొట్టేస్తాడనే మాట తరచూ వింటూ ఉంటాం. ఇప్పుడు చెప్పబోయే ప్రొఫెసర్ మాత్రం వాళ్లందరి కంటే చాలా డిఫరెంట్‌. మనం స్ట్రిక్ట్‌ అన చెప్పుకునే వాళ్లంతా ఆ ప్రొఫెసర్ గురించి తెలుసుకుంటే మాత్రం నోరెళ్లబెడతారు.  మనోళ్లు వేసే శిక్షలు జుజుబీలే అని రజినీకాంత్ స్టైల్‌లో చెబుతారు. 


జార్జియా స్టేట్ యూనివర్శిటీ(Georgia State University )లో జరిగిన ఈ సంఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ యూనివర్సిటీలో చదివే ఓ స్టూడెంట్‌ టిక్‌టాక్‌(Tiktok)లో పెట్టిన వీడియో వైరల్‌గా మారింది. 


బ్రియాబ్లేక్‌(Bria Blake) అనే స్కాలర్(Scholar) చెప్పినట్టు... జార్జియా యూనివర్శిటీలో ఓ ప్రొఫెసర్(Professor) ప్రవర్తన అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఇద్దరు విద్యార్థులు క్లాస్‌కు ఆలస్యంగా రావడాన్ని గమనించిన టీచర్‌ వాళ్లను బయటకు వెళ్లిపోమన్నారు. కానీ వాళ్లు నిరాకరించారు. 


తాము ఫీజులు కడుతుందీ బయటకు వెళ్లిపోవడానికి కాదని ప్రొఫెసర్‌తో వాగ్వాదానికి దిగారు. తాము రెండు నిమిషాల ఆలస్యంగా మాత్రమే వచ్చామని అంటూ సమాధానం ఇచ్చారు. తాము అక్కడి నుంచి కదలబోమంటూ భీష్మించి నిల్చున్నారు. 


వాళ్లతో వాదించలేని ఆ ప్రొఫెసర్‌ సీరియస్‌గా క్లాస్‌ రూమ్‌ నుంచి వెళ్లిపోయారు. కొంత టైం తర్వాత ఇద్దరు పోలీసుల(Police)ను వెంటబెట్టుకొని ఆమె వచ్చారు. ఇదిగో వీళ్లిద్దరే క్లాస్‌కు ఆలస్యంగా వచ్చారంటూ వారికి చెప్పారు ప్రొఫెసర్. 


పోలీసులు రావడం చూసిన ఆ ఇద్దరు విద్యార్థులు బోరుమని ఏడ్చారు. తమను ఏం చేయొద్దని వేడుకున్నారు. నల్లజాతీయులు పోలీసులతో పెట్టుకుంటే ఎలాంటి పరిస్థితులు ఉంటాయో గతంలో చూసిన నేపథ్యంలో అలా ప్రాథేయపడ్డారు. 


ఇంతలో యూనివర్సిటీ అధికారులు కలుగజేసుకొని తాము సర్ధి చెబుతామని పోలీసులను పంపించేశారు. ఇలాంటి వాటిని సున్నితంగా డీల్ చేయాల్సిన ప్రొఫెసర్ అనవసరంగా ఇష్యూను పెద్దది చేశారని అభిప్రాయపడ్డారు. 


లేని సమస్యను సృష్టించిన ప్రొఫెసర్‌ను విధుల నుంచి తప్పించినట్టు యూనివర్శిటీ వర్గాలు చెప్పాయి. వచ్చే సెమిస్టర్ వరకు ఆమెను క్లాస్‌ల్లోకి ఎంట్రీ చేయబోమంటూ విద్యార్థులకు హామీ ఇచ్చాయి. దీంతో సమస్య సద్దుమణిగింది. 


అయితే ఈ ఘటన ఒక్కసారి విద్యార్థులను షాక్‌కు గురి చేసింది. ఓ నల్లజాతీయురాలై ఉండి బ్లాక్స్‌ను అవమానించడమేంటన్న చర్చ జరుగుతోంది. ఆ ప్రోఫెసర్‌ను తప్పించడంతో విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు.