ఈ కాలంలోనూ మూఢ నమ్మకాలు ఏ స్థాయిలో రాజ్యమేలుతున్నాయో తెలిపే ఘటన ఇది. పాకిస్థాన్‌లోని పేషావర్‌ నగరంలో చోటు చేసుకుంది. ఈ మూఢ నమ్మకం గురించి తెలిస్తే అంతా ముక్కున వేలేసుకుంటారు. పుట్టబోయే బిడ్డ మగ బిడ్డ కావాలని ఓ గర్భిణీ వెతుకులాటకు ఫలితమే ఈ ఘటన. ఓ నకిలీ బాబా చెప్పుడు మాటలు విని, ప్రాణాలతో చెలగాటం ఆడింది. త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకుంది. స్వామీజీ చెప్పినట్లుగా తలలోకి మేకు దిగ్గొట్టుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంది. ఆమెను ప్రాణాపాయంలో పడేసిన నకిలీ బాబా కోసం పాకిస్థాన్‌లోని పెషావర్‌ నగర పోలీసులు గాలిస్తున్నారు.


అసలు విషయం ఏంటంటే.. స్థానిక వార్తా పత్రికలు వెల్లడించిన వివరాల ప్రకారం.. పాకిస్థాన్‌లోని పెషావర్‌కు చెందిన ఓ మహిళకు ఇప్పటికే ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. మగ పిల్లాడి కోసం ఆమె కుటుంబం తాపత్రయపడుతోంది. దీంతో ఆమె మళ్లీ గర్భం దాల్చింది. కానీ, నెలలు గడుస్తున్న కొద్దీ మరోసారి కూడా అమ్మాయే పుడుతుందని ఆమెకు దడ పుట్టేది. దానికి తోడు మగబిడ్డ కోసం అత్తామామల వేధింపులు ఉన్నాయి. మగ బిడ్డ పుట్టకపోతే వదిలేస్తానని ఆమె భర్త బెదిరించడంతో ఆమెకు మరింత ఆందోళన పెరిగిపోయింది. దీంతో నాలుగో కాన్పులోనూ అమ్మాయి పుడుతుందనే  భయంతో ఒక్కో క్షణం ఒక యుగంలా గడుపుతోంది. అయితే, ఆ మహిళ మగ బిడ్డ పుట్టాలనే పరిష్కారం కోసం విపరీతంగా గాలించింది. 


ఎవరో పెషావర్‌లోని ఓ బాబా గురించి చెప్పగా.. అతని వద్దకు వెళ్లింది. ఆ నకిలీ బాబా ఓ దారుణమైన, ప్రాణాలు తీసేలా ఉన్న ఓ సలహా చెప్పాడు. నదుటిపై పదునైన మేకును కొట్టుకుంటే.. మగ పిల్లాడు పుడతాడని చెప్పాడు. పైగా గర్భంలో అమ్మాయి ఉన్నా సరే.. పుట్టేది అబ్బాయే అంటూ నమ్మబలికాడు. అది గుడ్డిగా నమ్మిన మహిళ అతడు చెప్పినట్టే చేసింది. తలలోకి రెండు అంగుళాల పొడవైన మేకు దింపుకుంది. దీంతో నొప్పితో విలవిలలాడిపోయింది. ఆ మేకును బయటకు లాగేందుకు ఆమె కుటుంబసభ్యులు ప్రయత్నించగా.. ఆమె నొప్పి భరించలేకపోయింది. దీంతో హుటాహుటిన బాధితురాలిని పెషావర్‌లోని ఆస్పత్రికి తరలించారు. 


అక్కడి న్యూరాలజీ వైద్యులు ఆమెకు చికిత్స చేశారు. ఆ మేకు పుర్రెలోకి దిగిన మేకును శస్త్ర చికిత్స చేసి బయటకు తీశారు. ఆ మేకు మెదడును తాకలేదని తాకి ఉంటే ప్రమాదం జరిగి ఉండేదని చెప్పారు. ఎందుకిలా చేశారో చెప్పడంతో డాక్టర్లు షాక్‌కు గురయ్యారు. అయితే, ఈ విషయంపై ఎవరూ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కానీ, మహిళ తలలో మేకు ఉన్న ఎక్స్‌రే ఫొటో వైరల్‌ మాత్రం విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది అధికారుల దృష్టికి వెళ్లగా పోలీసులు రంగంలోకి దిగారు. ఆస్పత్రికి వెళ్లి దర్యాప్తు చేపట్టి.. పరారీలో ఉన్న నకిలీ బాబా కోసం గాలిస్తున్నారు.