సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి టర్మ్-2 పరీక్షలను ఆఫ్‌లైన్ మోడ్‌లో నిర్వహించనున్నట్లు బోర్డు ప్రకటించింది. 2022, ఏప్రిల్ 26 నుంచి ఈ పరీక్షలు జరగనున్నట్లు బోర్డు తెలిపింది.
టర్మ్ 2 పరీక్షలు 2022 మార్చి- ఏప్రిల్ మధ్య నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ గతంలో తెలిపింది. అయితే సెకండ్ టర్మ్ పరీక్షల్లో ఆబ్జెక్టివ్ సహా వివరణాత్మక ప్రశ్నలు ఉండనున్నాయి.
కొవిడ్-19 సెకండ్ వేవ్ కారణంగా గత ఏడాది 10,12వ తరగతి పరీక్షలను సీబీఎస్ఈ రద్దు చేసింది. అయితే ఇంటర్నల్ అసెస్‌మెంట్ ద్వారా ఫలితాలను వెల్లడించింది. అలాంటి పరిస్థితి రాకుండా ముందస్తుగానే పరీక్షల షెడ్యూల్‌ను విడుదల చేస్తోంది సీబీఎస్ఈ బోర్డు.
టర్మ్ 1 పరీక్షలు..
CBSE 10వ తరగతి పరీక్షలు 2021 నవంబర్ 30న మొదలయ్యాయి. అయితే CBSE 12వ తరగతి టర్మ్ 1 పరీక్షలు డిసెంబర్ 1న ప్రారంభమయ్యయి. ఈ పరీక్ష వ్యవధి 90 నిముషాలు ఉంది. వీటిని ఆబ్జెక్టివ్ రూపంలో నిర్వహించారు.
డిజిటల్ చెల్లింపులు..
మారుతున్న టెక్నాలజీకి తగినట్లు సీబీఎస్ఈ బోర్డు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతుంటుంది. ఇటీవల చెల్లింపుల విషయంలో కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఉన్న మాన్యువల్ విధానాన్ని డిజిటల్ చెల్లింపులుగా మార్చినట్లు ప్రకటించింది. ఇంటిగ్రేటెడ్ పేమెంట్ సిస్టమ్ (IPS) అనే విధానం ద్వారా డిజిటల్ పేమెంట్లను చేయనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఈ విధానం ద్వారా సీబీఎస్ఈ దాని అనుబంధ పాఠశాలల పరీక్షలు, అఫిలియేషన్ సంబంధిత చెల్లింపులను డిజిటల్ రూపంలో చేయవచ్చని అధికారులు పేర్కొన్నారు. మాన్యువల్ విధానం వల్ల సమయం వృధా అవుతున్నట్లు గుర్తించామని.. అందుకే కొత్త విధానాన్ని తీసుకువచ్చినట్లు సీబీఎస్ఈ బోర్డు వర్గాలు తెలిపాయి.