PM Modi-Macron Meet: 


ఐరోపా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయెల్ మేక్రాన్‌తో భేటీ అయ్యారు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి వీరి భేటీ జరిగింది. మేక్రాన్‌తో భేటీని ఇద్దరు మిత్రుల కలయికగా అభివర్ణించారు.






చర్చ


ప్రధాని మోదీ, మేక్రాన్ ద్వైపాక్షిక, వ్యూహాత్మక అంశాలపై చర్చించుకున్నారు. వీటితో పాటు ఉక్రెయిన్‌ పరిణామాలపై వీరి మధ్య ప్రస్తావన వచ్చినట్లు తెలుస్తోంది. రెండు దేశాలు సన్నిహిత సహకారంతో పనిచేయాలని ఇరువురు నేతలు ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఈ సమావేశం ఉపయోగపడిందన్నారు.


జర్మనీ, డెన్మార్క్‌, ఫ్రాన్స్‌ దేశాల పర్యటన ముగియడంతో దేశ ప్రధాని నరేంద్ర మోదీ భారత్‌కు తిరుగుప్రయాణం అయ్యారు.


ఘన స్వాగతం


అంతకుముందు ఫ్రాన్స్​ రాజధాని పారిస్​​కు చేరుకున్న మోదీకి ప్రవాస భారతీయులు ఘనస్వాగతం పలికారు. ప్రధానిగా ఎన్నికైన అనంతరం మోదీ ఫ్రాన్స్ వెళ్లడం ఇది ఐదోసారి. అంతకుముందు ఏప్రిల్ 2015, నవంబర్ 2015, జూన్ 2017, ఆగస్టు 2019 పర్యటించారు.


3 రోజుల పర్యటన


అంతకుముందు బుధవారం ఉదయం డెన్మార్క్‌ రాజధాని కోపెన్‌హాగెన్‌లో జరిగిన 2వ ఇండియా-నార్డిక్‌ ప్రధానుల సదస్సులో మోదీ పాల్గొన్నారు. ఈ సదస్సులో అంతర్జాతీయ శాంతి, భద్రత, ఉక్రెయిన్‌ సంక్షోభం, పలు అంశాల్లో సహకారం, హరిత పరివర్తన, వాతావరణ మార్పులు, బ్లూ ఎకానమీ వంటి పలు అంశాలపై చర్చించారు.


ఉక్రెయిన్‌లో తలెత్తిన మానవతా సంక్షోభంపై ఐదు నార్డిక్‌ దేశాలు ఆందోళన వ్యక్తం చేశాయి. తక్షణ యుద్ధవిరమణకు పిలుపునిచ్చాయి. ఉక్రెయిన్‌లో పౌరుల మరణాలను నిర్ద్వంద్వంగా ఖండించాయి. ఉక్రెయిన్‌పై రష్యా అన్యాయంగా, నిష్కారణంగా యుద్ధానికి దిగిందంటూ నార్డిక్‌ దేశాల ప్రధానులు మండిపడ్డారు.


భారత్‌-నార్డిక్‌ దేశాల సహకారాన్ని మరింత బలోపేతం చేసుకుందామంటూ ప్రధానులు ఈ సదస్సులో పేర్కొన్నారు. ఆరు దేశాల మధ్య సమ్మిళిత వృద్ధి, స్వేచ్ఛా వాణిజ్యం, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనకు కృషి చేయాలని నిర్ణయించారు.


Also Read: Prashant Kishor Political Party: జగన్ బాటలో ప్రశాంత్ కిశోర్- 3వేల కిమీ పాదయాత్ర, ఆ తర్వాతే అన్నీ!


Also Read: Covid Update: కరోనాతో ఒక్కరోజులో 55 మంది మృతి- కొత్తగా 3,275 కేసులు నమోదు