Russia Ukraine News: ఉక్రెయిన్‌లో ఇంకా యుద్ధ వాతావరణం కొనసాగుతున్న వేళ రష్యా కీలక ప్రకటన చేసింది. తన సైన్యం సిమ్యులేటెడ్ న్యూక్లియర్ క్షిపణి దాడులను పరీక్షించిందని రష్యా ప్రకటించింది. యురోపియన్ యూనియన్ సభ్య దేశాలు పోలాండ్, లిథువేనియా మధ్య ఉన్న బాల్టిక్ సముద్రంలోని ఎన్‌క్లేవ్‌లో బుధవారం జరిగిన యుద్ధ క్రీడల సందర్భంగా, అణు సామర్థ్యం గల ఇస్కాండర్ మొబైల్ బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థలను రష్యా ప్రయోగించింది. ఈ మేరకు రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటన విడుదల చేసినట్లుగా అంతర్జాతీయ వార్తా సంస్థ ఏఎఫ్‌పీ వెల్లడించింది.


ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర మొదలైన వెంటనే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, తమ అణు ఆయుధాల గురించి ప్రస్తావించారు. తమ గొడవ నుంచి పాశ్చాత్య దేశాలను దూరంగా ఉండాలని హెచ్చరించారు. తమ అణ్వాయుధ సిబ్బందిని, దళాలను అప్రమత్తంగా ఉంచుతున్నట్లు అప్పుడు ప్రకటించడం చర్చనీయాంశం అయింది. రష్యా - ఉక్రెయిన్ దండయాత్రలో జోక్యం చేసుకునే ఏ దేశమైనా చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని పుతిన్ హెచ్చరించారు.


రసాయన, జీవ లేదా అణ్వాయుధాలను రష్యా ప్రయోగిస్తే ఎలా స్పందించాలనేది అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఇతర పాశ్చాత్య దేశాల నాయకులు గత మార్చి చివరలో చర్చించుకున్నారు. బైడెన్ ఐరోపా పర్యటన సందర్భంగా జరిగిన చర్చల్లో ఆ విషయం కూడా చర్చకు వచ్చింది. NATO లోని సభ్య దేశాలు అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ అణ్వాయుధాలను కలిగి ఉన్నాయి. అయితే, యుద్ధంలో ఉపయోగించే కొన్ని అణ్వాయుధాలను వ్యూహాత్మక ఆయుధాలుగా ప్రయోగించడం ద్వారా, రష్యా మరో దేశానికి వ్యతిరేకంగా అణ్వాయుధాన్ని ఉపయోగించకుండా దాదాపు 8 దశాబ్దాల ప్రపంచ నిషేధాన్ని విచ్ఛిన్నం చేయగలదని ఆందోళన తెరపైకి వచ్చింది.


క్షిపణి వ్యవస్థలు, ఎయిర్‌ఫీల్డ్‌లు, రక్షిత మౌలిక సదుపాయాలు, సైనిక పరికరాలు, మాక్ శత్రువు కమాండ్ పోస్ట్‌ల లాంచర్‌లను అనుకరిస్తూ రష్యన్ దళాలు లక్ష్యాలపై బహుళ దాడులను అభ్యసించాయని ప్రకటనలో పేర్కొన్నారు.  ఈ ఎలక్ట్రానిక్ ప్రయోగాలను ప్రదర్శించిన తర్వాత, సైనిక సిబ్బంది అటువైపు నుంచి ‘‘ప్రతీకార దాడిని’’ నివారించడానికి తమ స్థానాన్ని మార్చుకోవడానికి ఒక యుక్తిని అనుసరించారని రక్షణ మంత్రిత్వ శాఖ అందులో పేర్కొంది. ఈ ఎక్సర్‌సైజులో 100 మందికి పైగా సైనికులు పాల్గొన్నారు.