Mariupol theatre attack:


రష్యా- ఉక్రెయిన్ యుద్ధం భీకరంగా కొనసాగుతోంది. ఉక్రెయిన్ నగరాలను స్వాధీనం చేసుకునేందుకు రష్యా బలగాలు ముమ్మరంగా దాడి చేస్తున్నాయి. రష్యా చేస్తోన్న దాడుల్లో కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మార్చి నెలలో మేరియుపొల్‌ థియేటర్‌పై జరిగిన దాడి యావత్‌ ప్రపంచాన్ని కలచివేసింది. అయితే ఆ ఘటనపై తాజాగా షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. ఈ మారణకాండలో దాదాపు 600 మంది వరకు మృతి చెందినట్లు అంతర్జాతీయ వార్తా సంస్థ అసోసియేటెడ్‌ ప్రెస్‌ అంచనా వేసింది.






ఏం జరిగింది?


మార్చి 16న మేరియుపొల్‌లోని డొనెట్స్క్‌ అకాడెమిక్‌ రీజినల్‌ డ్రామా థియేటర్‌పై రష్యా వాయుసేన దాడి చేసింది. అప్పటికే ఆ థియేటర్‌లో 1200 మంది పౌరులు తలదాచుకున్నట్లు సమాచారం. అయితే, ఆ దాడిలో భారీ భవనం కుప్పకూలడంతో శిథిలాల కింద ఎంతమంది ఉన్నారన్న విషయంపై ఆ సమయంలో స్పష్టత రాలేదు. ఆ ఘటనలో 300 మంది చనిపోయి ఉండొచ్చని భావించారు.


పరిశోధన


ఈ ఘటనపై పరిశోధన చేపట్టిన అసోసియేటెడ్‌ ప్రెస్‌ వార్తా సంస్థ.. థియేటర్‌ లోపల, బయట మొత్తంగా 600 మంది చనిపోయినట్లు ఆధారాలు కనుగొన్నట్లు వెల్లడించింది. థియేటర్‌పై దాడి అనంతరం ఆరోజు అసలేం జరిగిందనే విషయంపై ఏపీ వార్తా సంస్థ పరిశోధన చేపట్టింది. ఆ దాడిలో ప్రాణాలతో బయటపడిన 23 మంది బాధితులు, రెస్క్యూ బృందాలు, ప్రత్యక్షసాక్షుల నుంచి వివరాలు సేకరించింది.


వీటి ప్రకారం దాదాపు 600 మంది ప్రాణాలు కోల్పోగా వందల మంది తీవ్ర గాయాలపాలైనట్లు గుర్తించింది. ఇప్పటివరకు ఉక్రెయిన్‌పై రష్యా చేసిన దాడుల్లో ఇది తీవ్రమైనదిగా ఏపీ వార్తా సంస్థ తెలిపింది.


Also Read: Night Club Row : రాహుల్ నైట్ క్లబ్ వీడియోపై రాజకీయ రచ్చ - పెళ్లికెళ్తే తప్పేంటని కాంగ్రెస్ ప్రశ్న !


Also Read: Long Covid: కరోనా వచ్చి తగ్గిన వారిలో కొనసాగుతున్న లాంగ్ కోవిడ్, ఈ లక్షణాలు ఉంటే లాంగ్ కోవిడే