రాహుల్ గాంధీ నేపాల్ లో ఓ నైట్ క్లబ్‌లో పార్టీలో ఉన్నట్లుగా వెలుగులోకి వచ్చిన వైరల్ అవడంతో బీజేపీ , కాంగ్రెస్ మధ్య రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ప్రారంభమయ్యాయి. రాహుల్ గాంధీపై బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. రాహుల్ గాంధీ విలాస పురుషుడు అన్నట్లుగా ట్వీట్లు పెడుతున్నారు. బీజేపీ ఐటీ సెల్ ఇంచార్జ్ అమిత్ మాలవీయ వీడియోను ట్వీట్ చేసి సెటైర్లు వేశారు.
బీజేపీ విమర్శలపై కాంగ్రెస్ కూడా స్పందించింది. ప్రకాష్ జవదేకర్ గతంలో ఓ పార్టీలో షాంపెన్ చిందిస్తున్న ఫోటోను షేర్ చేసిన కాంగ్రెస్ నేతలు.... ఎవరో చెప్పండి చూద్దాం అంటూ నెటిజన్లను చాయిస్ ఇచ్చారు.
ఈ అంశంపై తెలుగు రాష్ట్రాల్లోనూ వివాదం అయింది. రాహుల్ గాంధీ తెలంగాణ టూర్‌కు రాబోతున్న సమయంలో ఈ వీడియో వెలుగులోకి రావడంతో టీఆర్ఎస్ నేతలు కూడా విమర్శలు చేశారు. రాహుల్ గాంధీ ఓయూకి వచ్చి ఏం చెబుతారని ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రశ్నించారు. టీఆర్ఎస్ నేతల విమర్శలను జగ్గారెడ్డి ఖండించారు. రాహుల్ గాంధీ ఓ పెళ్లికి వెళ్లారని.. దాన్ని వివాదం చేస్తే టీఆర్ఎస్ నేతల జాతకాలు బయట పెడతానని హెచ్చరించారు.
మరో వైపు వైఎస్ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఈ వీడియోను ట్వీట్ చేయకుండా వీడియోను ప్రస్తావిస్తూ రాహుల్ గాంధీని విమర్శించారు. ప్రధాని దేశం కోసం విదేశాల్లో పర్యటిస్తూంటే కాంగ్రెస్ అనవసరంగా ప్రశ్నిస్తోందన్నారు.
విజయసాయిరెడ్డికి.. కాంగ్రెస్ నేత మాణిగం ఠాగూర్ కౌంటర్ ఇచ్చారు. అవినీతి విజయసాయిరెడ్డి నిజం చూడాలని.. ఖాట్మాండూ పోస్ట్ పత్రికకు చెందిన లింక్‌ను షేర్ చేశారు.
మొత్తంగా రాహుల్ గాంధీ నైట్‌క్లబ్ వీడియో చుట్టూా రోజంతా రాజకీయం నడిచింది.