భారత్‌లో ఎలక్ట్రిక్ కార్లను ఉత్పత్తి చేస్తేనే అమెరికాకు చెందిన టెస్లా కు పన్ను ప్రయోజనాలు కల్పిస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్ వినియోగ కార్లతో పోలిస్తే అన్ని రకాల ఎలక్ట్రిక్ కార్ల ధరలు తగ్గే రోజులు ఎంతో దూరంలో లేవని స్పష్టం చేశారు. టెస్లా తన ఎలక్ట్రిక్ కార్లను దేశంలో తయారు చేయడానికి సిద్ధ పడితే ఏ సమస్యా లేదని... కానీ చైనా నుంచి మాత్రం దిగుమతి చేస్తే మాత్రం ఒప్పుకునేది లేదన్నారు. పన్ను రాయితీలు పొందాలంటే టెస్లా సీఈవో తొలుత తన ఐకానిక్ కార్లను భారత్‌లో ఉత్పత్తి చేయాలని గతేడాది కేంద్ర భారీ పరిశ్రమల శాఖ తెలిపింది. విదేశాల నుంచి విడి భాగాలు దిగుమతి చేసుకుని తయారు చేస్తున్న ఎలక్ట్రిక్ కార్లపై కస్టమ్స్ డ్యూటీ 60-100 శాతం మధ్య ఉంటుంది.
ఇండియాలో ఇంపోర్ట్ ట్యాక్స్ ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించాలని ఎలన్ మస్క్ కేంద్రాన్ని కోరుతున్నారు. గతంలో ఇదే విజ్ఞప్తితో ఆయన ట్వీట్లు కూడా చేశారు. తమ కంపెనీ రూపొందించిన ఎలక్ట్రిక్ కారును లగ్జరీ కారుగా పరిగణించ వద్దని, కాలుష్యాన్ని తగ్గించే ఎలక్ట్రిక్ కారుగా గుర్తించి దిగుమతి పన్నులు తగ్గించాలని భారత ప్రభుత్వాన్ని టెస్లా కంపెనీ గతంలో కోరింది. టెస్లా కంపెనీ కోరినట్టు దిగుమతి సుంకంపై రాయితీ ఇవ్వడానికి కేంద్రం అంగీకరించలేదు. ఎలక్ట్రిక్ కార్లను బయటి నుంచి తెచ్చి విక్రయిస్తే, దిగుమతి సుంకంలో ఎలాంటి మినహాయింపు లభించదని ప్రభుత్వం స్పష్టం చేసింది. టెస్లా కార్లు చాలా ఖరీదైనవి. ఇండియాలో దిగుమతి చేసుకుంటే నూరుశాతం సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అంటే.. అమెరికా మార్కెట్ లో ఉన్నధరకు సమానంగా సుంకం ఉంటుంది. ఈ పన్నులను తగ్గించాలని మస్క్ కోరుతున్నారు. విదేశాల నుంచి దిగుమతి అవుతున్న లగ్జరీ కార్లకు సంబంధించి 40 వేల డాలర్లు లోపు ధర ఉంటే 60 శాతం పన్నుని ప్రభుత్వం దిగుమతి సుంకంగా విధిస్తోంది. అంతకు మించి కారు ధర ఉంటే వంద శాతం పన్నుని విధిస్తోంది.
టెస్లా కోరినట్టుగా దిగుమతి పన్ను తగ్గించేందుకు ప్రభుత్వం సిద్ధమేనని అయితే ఆ కంపెనీ కార్ల తయారీ యూనిట్‌ను దేశంలో నెలకొల్పితేనే ఇస్తామని కేంద్రం చెబుతోంది. ఒక వేళ పన్ను మినహాయింపు ఇస్తే ఈ రాయితీ ఒక్క టెస్లా కంపెనీకే వర్తించదని.. ఆ రంగం మొత్తానికి వర్తిస్తుందని అది దేశానికి చాలా నష్టమని కేంద్రం చెబుతోంది. ప్లాంట్ పెట్టి అమ్ముకోవచ్చు కదా అని ఎలన్‌మస్క్‌ను అడిగితే.. ఆయన తెలివిగా సమాధానం చెబుతున్నారు. టెస్లా కంపెనీ అమెరికాకు వెలుపల జర్మనీ, చైనాలో కార్ల తయారీ యూనిట్‌ని ప్రారంభించింది. ఆ యూనిట్లలో తయారైన కార్లను ఇండియాకు దిగుమతి చేసి అమ్మకాలు సాగించాలనే వ్యూహంతో ఉందని ఆటో ఇండస్ట్రీ భావిస్తోంది. అందుకే పన్ను రాయితీలు అంటూ బేరాలకు దిగింది. కానీ కేంద్రం పడనీయడం లేదు.