విశాఖపట్నంలోని సింహాద్రి ఎన్టీపీసీలో మంగళవారం (ఏప్రిల్ 3) విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఎన్టీపీసీ సింహాద్రిలో 4 యూనిట్ల ద్వారా ఉత్పత్తి కావాల్సిన 2 వేల మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. ఇలా ఒకేసారి 4 యూనిట్లలోనూ విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోవడం ఎప్పుడూ జరగలేదని అధికారులు చెబుతున్నారు. అయితే, దీనిపై సింహాద్రి ఎన్టీపీసీ వివరణ ఇచ్చింది. భారీ గాలులు, వర్షం వల్ల 2 సబ్‌స్టేషన్లు ట్రిప్‌ అయ్యాయియని తెలిపింది. కలపాక, గాజువాక సబ్‌స్టేషన్లు కూడా ట్రిప్ అయ్యాయని వెల్లడించింది. ఎన్టీపీసీలో ఉత్పత్తయ్యే విద్యుత్ 2 సబ్‌స్టేషన్ల నుంచి గ్రిడ్‌కు వెళ్లాల్సి ఉందని.. ఆ 2 సబ్‌స్టేషన్లు ట్రిప్ అవడంతో సింహాద్రిలోని 4 యూనిట్లు ట్రిప్ అయ్యాయని పేర్కొంది.


ఇలా అన్ని ట్రిప్‌ కావడంతో 2 వేల మెగావాట్ల ఉత్పత్తికి అంతరాయం ఏర్పడిందని ఎన్టీపీసీ సింహాద్రి వెల్లడించింది. ఎన్టీపీసీ నేషనల్ గ్రిడ్ నుంచి ప్రత్యామ్నాయ విద్యుత్‌ సరఫరా చేస్తున్నామని వెల్లడించింది. ఎన్టీపీసీ 1, 4 యూనిట్లు విద్యుదుత్పత్తికి సిద్ధమయ్యాయని.. కాసేపట్లో విద్యుదుత్పత్తి ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది. 2, 3 యూనిట్లలో మరమ్మతులు పూర్తి కావచ్చాయని వెల్లడించింది. మంగళవారం సాయంత్రంలోపు అన్ని యూనిట్లలో ఉత్పత్తి ప్రారంభమయ్యేలా చూస్తామని ఎన్టీపీసీ ఓ ప్రకటనలో తెలిపింది.


ఉదయం నుంచి నిలిచిన ఉత్పత్తి


ఏపీలో విద్యుత్‌ ఉత్పత్తి భారీగా నిలిచిపోయింది. విశాఖపట్నంలోని సింహాద్రి ఎన్టీపీసీ, పాలవలసలోని హిందూజా పవర్ ప్లాంట్ వంటి చోట్ల సాంకేతిక లోపంతో ఈ అంతరాయం తలెత్తినట్లుగా అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే ఎన్టీపీసీ సింహాద్రిలో 4 యూనిట్ల ద్వారా ఉత్పత్తి కావాల్సిన 2 వేల మెగా వాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో దాని పరిధిలో ఉన్న ప్రాంతాలకు కరెంటు సరఫరా నిలిచిపోయింది. గ్రిడ్‌ నుంచి కూడా ఎన్టీపీసీకి విద్యుత్‌ సరఫరా అవ్వడం లేదు. మంగళవారం ఉదయం కలిగిన తీవ్ర అంతరాయం కారణంగా ఉమ్మడి విశాఖ జిల్లాకు అవసరమైన కలపాల 400 కేవీ విద్యుత్ స్టేషన్‌కు గ్రిడ్ నుంచి సరఫరా నిలిచిపోవడంతో పలు ప్రాంతాల్లో చీకట్లు నెలకొన్నాయి. దాదాపు రెండున్నర గంటలు శ్రమించిన అధికారులు గ్రిడ్ నుంచి ఎన్టీపీసీ సింహాద్రికి విద్యుత్‌ను పునరుద్ధరించి పాక్షికంగా సరఫరా చేస్తున్నారు.


వెంటనే సమస్యపై అప్రమత్తమైన అధికారులు మరమ్మతు పనులు ఇంకా చేపట్టారు. అయితే, ఒకేసారి 4 యూనిట్లలోనూ విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోవడం ఎప్పుడూ జరగలేదని అధికారులు చెబుతున్నారు. మంగళవారం ఉదయం దాదాపు రెండు మూడు గంటల పాటు విద్యుత్ అంతరాయం జరగ్గా స్పందించిన అధికారులు, తాత్కాలికంగా విజయనగరం జిల్లా మరడం 400 కేవీ విద్యుత్ స్టేషన్ నుంచి పాక్షికంగా విద్యుత్ సరఫరాను చేశారు.


హిందూజా ప్లాంటులోనూ నిలిచిన ఉత్పత్తి
పెదగంట్యాడ మండలం పాలవలస హిందూజా పవర్ ప్లాంట్‌లోనూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. 1,040 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో అధికారులు మరమ్మతు పనుల్లో నిమగ్నం అయ్యారు. సౌత్ గ్రిడ్‌లో లోపం వల్లే సింహాద్రి, హిందూజా ప్లాంట్లలో విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయినట్లు తెలుస్తోంది. అత్యవసరంగా ఇంజినీర్లందరూ విధులకు హాజరుకావాలని.. మొత్తం అన్ని విభాగాలకు ఎన్టీపీసీ ఆదేశాలు జారీ చేసింది. హుటాహుటిన నిపుణులు, సిబ్బంది ప్లాంట్‌కి చేరుకున్నారు.