PM Modi: భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫ్రాన్స్ పర్యటన ముగిసింది. ఈ సందర్భంగానే ప్రధాని మోదీ.. ఆ దేశ అధ్యక్షుడు మెక్రాన్ కు చందనపు చెక్కతో చేసిన సితార వాయిద్యాన్ని బహుకరించారు. అలాగే ఆయన సతీమణి బ్రిగెట్టికి తెలంగాణకు చెందిన పోచంపల్లి సిల్క్ ఇక్కత్ చీరను కానుకగా అందజేశారు. అయితే సితార పైభాగంలో సరస్వతీ దేవీ, కింద భాగంలో వినాయకుడు, మధ్యలో రెండు నెమళ్లు ఉన్న సితారను చూస్తే ఎవరైనా మంత్రముగ్ధులు కావాల్సిందే. చందన కర్రతో చేసిన పెట్టెలో ఉంచిన చీరను పెట్టి బ్రిగ్గెట్ కు అందజేశారు. ఈ చీర కూడా అద్భుతమైన రంగుల్లో ఉంది. అలాగే ఫ్రాన్స్ ప్రధాన మంత్రి ఎలిసబెత్ బోర్న్‌కు మార్బుల్ ఇన్లే వర్క్ టేబుల్ ను ప్రధాని మోదీ బహుమతిగా ఇచ్చారు.
కశ్మీరీ కార్పెట్, చెక్కతో చేసిన ఏనుగు బొమ్మలు
ఫ్రెంచ్ నేషనల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ యేల్ బ్రాన్-పివెట్‌కు చేతితో అల్లిన పట్టు కాశ్మీరీ కార్పెట్ నను అందజేశారు. వీరికే కాకుండా ఫ్రెంచ్ సెనేట్ అధ్యక్షుడు గెరార్డ్ లార్చెర్‌కు గంధపు చెక్కతో చెక్కిన ఏనుగు బొమ్మను బహుకరించారు. ఏనుగు, భారతీయ సంస్కృతిలో జ్ఞానం, బలం, అదృష్టాన్ని సూచిస్తుంది. ఇది ప్రకృతి, సంస్కృతి, కళల మధ్య సామరస్యానికి ప్రతిబింబం. ఈ బహుమతులలో ప్రతి ఒక్కటి భారతదేశం గొప్ప వారసత్వానికి చిహ్నంగా ఉన్నవే. దేశ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడే విధంగా ఉండే బహుమతులను బహుకరించడం చాలా సంతోషంగా ఉందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
నేడు అబుదబీలో పర్యటించినున్న ప్రధాని మోదీ
శుక్రవారం పారిస్ లో అట్టహాసంగా జరిగిన బాస్టీల్ డే పరేడ్ వేడుకలకు ప్రధాని మోదీ గౌరవ అతిథిగా హాజరయ్యారు. ఈ పర్యటనలో ప్రధాని మోదీ అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. ఫ్రాన్స్ అత్యున్నత పౌర, సైనిక పురస్కారమైన గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్ తో మెక్రాన్... ప్రధాని మోదీని సత్కరించారు. రెండు రోజుల పాటు ఫ్రాన్స్ పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు బయలుదేరారు. నేడు ఆయన ఆబుదాబీలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పలు రంగాల ప్రతినిధులతో మోదీ భేటీ కానున్నారు. యూఏఈ అధ్యక్షుడు షఏక్ మహ్మద్ బిన్ జూయోద్ అల్ నహ్ యన్ తో ప్రధాని ద్వైపాక్షిక చర్యలు జరపనున్నారు.