PM Modi Egypt Visit:
యే దోస్తీ...
అమెరికా పర్యటన ముగించుకున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడి నుంచి ఈజిప్ట్‌కి వెళ్లారు. కైరో (Cairo)లోని ఓ హోటల్‌కి వెళ్లిన మోదీకి ఘన స్వాగతం లభించింది. వందేమాతరం, మోదీ మోదీ అంటూ నినాదాలు చేస్తూ వెల్‌కమ్ చెప్పారు. ఓ ఈజిప్ట్ మహిళ జేనా మోదీకి సర్‌ప్రైజ్ ఇచ్చింది. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ షోలే (Sholay) సినిమాలోని యే దోస్తీ హమ్ నహీ తోడేంగే పాటను పాడి ఆశ్చర్యపరిచింది. ఈ పాట తనకెంతో ఇష్టమని, చిన్నప్పటి నుంచి తాను ఈ పాట పాడుతున్నానని చెప్పింది జేనా.
"నేనిప్పటి వరకూ ఇండియాకు వెళ్లలేదు. కానీ నాకు ఆరేళ్లు ఉన్నప్పటి నుంచి ఈ పాట పాడుతున్నాను. ప్రధాని మోదీని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఆయన నాతో మాట్లాడారు. అచ్చం భారతీయుల్లాగే కనిపిస్తున్నారని పొగిడారు. మీకు, ఇండియన్స్‌కి పెద్ద తేడా ఏమీ కనిపించడం లేదని కాంప్లిమెంట్ ఇచ్చారు. నేను పాడగానే ఆయన నవ్వుతూ పలకరించారు. ఆయనకు అంత నచ్చుతుందని అనుకోలేదు. ఆయనను కలవడం చాలా గౌరవంగా భావిస్తున్నాను"
- జేనా, ఈజిప్ట్ మహిళ
ఘన స్వాగతం..
మోదీకి స్వాగతం పలికిన ఈజిప్టియన్లు ఇండియన్ సాంగ్స్ పాడుతూ గౌరవం వ్యక్తం చేశారు. కల్చరల్ ప్రోగ్రామ్స్ నిర్వహించారు. ఇక్కడి భారతీయులతోనూ ప్రధాని మోదీ మాట్లాడారు. ఈజిప్ట్ అధ్యక్షుడు అబ్దేల్ ఫత్తాహ్ ఎల్ సిసి ఆహ్వానం మేరకు ప్రధాని మోదీ ఈజిప్ట్ పర్యటనకు వెళ్లారు. ఈ ఏడాది భారత్‌లో గణతంత్ర వేడుకలకు హాజరయ్యారు అబ్దేల్. అప్పుడే మోదీని ఆహ్వానించారు. ఈ పర్యటనలో ఆయన ఈజిప్ట్ ప్రధాని మొస్తఫా మద్‌బౌలితో భేటీ కానున్నారు. వీరిద్దరూ తొలిసార రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొననున్నారు.
ఇదీ షెడ్యూల్..
ఆఫ్రికన్ దేశంలో నివసిస్తున్న భారతీయ సమాజ సభ్యులను కూడా ప్రధాని మోదీ కలుస్తారు. ఈజిప్టు గ్రాండ్ ముఫ్తీ డాక్టర్ షాకీ ఇబ్రహీం అబ్దేల్ కరీం అల్లమ్‌తో ప్రధాని మొదటి రోజు సమావేశం అవుతారు. కొందరు ఈజిప్టు నాయకులతోనూ మోదీ భేటీ అవుతారు. ఆదివారం ప్రధాని మోదీ అల్ హకీమ్ మసీదును సందర్శించనున్నారు. కైరోలోని 16వ ఫాతిమిడ్ ఖలీఫా అల్-హకీమ్ బి-అమ్ర్ అల్లా (985-1021) పేరు మీద ఉన్న ఈ చారిత్రాత్మకమైన, ప్రముఖ మసీదులో ప్రధాని దాదాపు అరగంట సేపు గడుపుతారు. అలాగే మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు కోసం అత్యున్నత త్యాగం చేసిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించేందుకు హెలియోపోలిస్ వార్ గ్రేవ్ స్మశాన వాటికను కూడా మోదీ సందర్శిస్తారు. ఆఫ్రికన్ ఖండంలోని ఈ దేశం భారతదేశ అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వాముల్లో ప్రధానమైంది అలా మోదీ పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారతదేశం-ఈజిప్టు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం 1978 నుంచి అమలులో ఉంది.