Modi Egypt Visit: అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈజిప్టు చేరుకున్నారు. ఈజిప్టు రాజధాని అయిన కైరోలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. మోదీని ఆహ్వానించేందుకు ఆ దేశ ప్రధాని మోస్తఫా మడ్‌బౌలీ విమానాశ్రయానికి వచ్చి సాదరంగా ఆహ్వానం పలికారు. ప్రధాని మోదీ తొలిసారిగా ఈజిప్టులో పర్యటించనున్నారు. దాదాపు 26 ఏళ్ల తర్వాత భారత ప్రధాని తొలి సారిగా ద్వైపాక్షిక చర్చల కోసం ఈజిప్టులో పర్యటిస్తున్నారు. 2023 గణతంత్ర వేడుకలకు ఈజిప్టు అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసి ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. అప్పుడే తమ దేశానికి రావాలని ప్రధాన మంత్రి మోదీని ఆహ్వానించారు ఎల్-సిసి. జూన్ 24, 25 రెండు రోజులు ఈజిప్టులో పర్యటిస్తారు మోదీ. ఈ సందర్భంగా ఈజిప్టు ప్రధానితో రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. అధ్యక్షుడు అబ్దెల్ ఫత్తా ఎల్-సిసితో ప్రత్యేకంగా సమావేశమవుతారు.
ఆఫ్రికన్ దేశంలో నివసిస్తున్న భారతీయ సమాజ సభ్యులను కూడా ప్రధాని మోదీ కలుస్తారు. ఈజిప్టు గ్రాండ్ ముఫ్తీ డాక్టర్ షాకీ ఇబ్రహీం అబ్దేల్ కరీం అల్లమ్‌తో ప్రధాని మొదటి రోజు సమావేశం అవుతారు. కొందరు ఈజిప్టు నాయకులతోనూ మోదీ భేటీ అవుతారు. ఆదివారం ప్రధాని మోదీ అల్ హకీమ్ మసీదును సందర్శించనున్నారు. కైరోలోని 16వ ఫాతిమిడ్ ఖలీఫా అల్-హకీమ్ బి-అమ్ర్ అల్లా (985-1021) పేరు మీద ఉన్న ఈ చారిత్రాత్మకమైన, ప్రముఖ మసీదులో ప్రధాని దాదాపు అరగంట సేపు గడుపుతారు.
అలాగే మొదటి ప్రపంచ యుద్ధంలో ఈజిప్టు కోసం అత్యున్నత త్యాగం చేసిన భారతీయ సైనికులకు నివాళులు అర్పించేందుకు హెలియోపోలిస్ వార్ గ్రేవ్ స్మశాన వాటికను కూడా మోదీ సందర్శిస్తారు. ఆఫ్రికన్ ఖండంలోని ఈ దేశం భారతదేశ అత్యంత ముఖ్యమైన వాణిజ్య భాగస్వాముల్లో ప్రధానమైంది అలా మోదీ పర్యటన ప్రాముఖ్యతను సంతరించుకుంది. భారతదేశం-ఈజిప్టు ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం 1978 నుంచి అమలులో ఉంది.
Also Read: ప్రధాని మోదీకి టీషర్ట్ గిఫ్ట్‌గా ఇచ్చిన బైడెన్, దానిపై ఇంట్రెస్టింగ్ కొటేషన్
విజయవంతంగా ముగిసిన మోదీ అమెరికా పర్యటన
అమెరికాలో మోదీ పర్యటన విజయవంతంగా ముగిసింది. టెస్లా సీఈవో ఎలన్ మస్క్ తో సహా అగ్రశ్రేణి భారతీయ, అమెరికా సీఈవోలతో సమావేశమయ్యారు. వైట్‌హౌస్‌లో జరిగిన టెక్ మీటింగ్‌లో ఆపిల్, ఆల్ఫాబెట్ (గూగుల్), మైక్రోసాఫ్ట్, అమెజాన్, ఓపెన్‌ఏఐ వంటి అగ్రస్థాయి టెక్నాలజీ కంపెనీల CEOలతో ప్రధాని మాట్లాడారు. వైట్‌హౌస్‌లో లోపల దాదాపు గంటకు పైగా ఈ సమావేశం సాగింది. ఇండియాలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, అడ్డంకులపై చర్చ జరిగింది. గ్లోబల్ CEOలు అడిగిన అన్ని ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పారు. భయం వదిలేసి భారత్ రమ్మంటూ భరోసా ఇచ్చారు. మీ కోసం ఇండియా ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయంటూ ఆహ్వానించారు. మోదీతో మీటింగ్ తర్వాత... గూగుల్ CEO సుందర్ పిచాయ్, అమెజాన్ యొక్క CEO ఆండ్రూ జాస్సీ ఇండియాలో ఇన్వెస్ట్‌మెంట్స్‌పై ప్లాన్స్ ప్రకటించారు. డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో స్పీడ్ పెంచడం, లోకల్ లాంగ్వేజీల కంటెంట్‌ను ప్రోత్సహించడం, కొత్త ఉద్యోగాలు సృష్టించడం, ప్రపంచవ్యాప్తంగా భారతీయ ఉత్పత్తుల ఎగుమతిని పెంచడం లక్ష్యంగా ఈ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉంటాయి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial