Manipur Violence: 


శరద్ పవార్‌ దూరం..


మణిపూర్ అల్లర్లపై చర్చించేందుకు కేంద్రహోం మంత్రి అమిత్‌షా (Amit Shah) ఆల్‌ పార్టీ మీటింగ్‌కి (All Party Meeting) పిలుపునిచ్చారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి NCP చీఫ్ శరద్ పవార్ హాజరు కాలేదు. అయితే...ఆ పార్టీ తరపున జనరల్ సెక్రటరీ నరేంద్ర వర్మ, మణిపూర్ ఎన్‌సీపీ చీఫ్ సోరన్ ఇబోయమా సింగ్‌ పాల్గొన్నారు. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి, మేఘాలయా ముఖ్యమంత్రి కోన్రాడ్ సంగ్మా, ఆప్‌ లీడ్ సంజయ్ సింగ్ ఈ మీటింగ్‌కి వచ్చారు. ఇప్పటికీ మణిపూర్‌లో ఉద్రిక్తతలు చల్లారడం లేదు. వరుసగా దాడులు చేస్తున్నారు ఆందోళనకారులు. మంత్రి సుసింద్రోకి చెందిన ఓ ప్రైవేట్ గోడౌన్‌కి నిప్పంటించారు. ఫలితంగా ఇంఫాల్‌లో పరిస్థితులు అదుపు తప్పాయి. మరో మంత్రి ప్రాపర్టీకి కూడా నిప్పంటించేందుకు ప్రయత్నించారు. అయితే...అప్పటికే భద్రతా బలగాలు అక్కడికి చేరుకుని అడ్డుకున్నాయి. ఖురాయ్ ప్రాంతంలో ఆందోళనకారులు, భద్రతా బలగాల మధ్య కాల్పులు జరిగాయి. టియర్ గ్యాస్‌తో సెక్యూరిటీ ఎదురు దాడికి దిగడం వల్ల ఆందోళనకారులు చెల్లాచెదురయ్యారు. ఈ దాడుల్లో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదని అధికారులు వెల్లడించారు. 






మే 3 నుంచి అల్లర్లు..


మే 3వ తేదీ నుంచి ఇక్కడ హింసాత్మక ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మధ్యలో ఓ సారి అమిత్‌షా రాష్ట్రంలో పర్యటించారు. అక్కడి పరిస్థితులు సమీక్షించారు. ఆ రెండ్రోజులు కాస్త సద్దుమణిగినా ఆ తరవాత మళ్లీ మొదటికే వచ్చింది. ఈ అల్లర్లపై విపక్షాలు కేంద్ర ప్రభుత్వం తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇన్ని రోజులుగా రాష్ట్రం తగలబడిపోతుంటే ఏ మాత్రం పట్టించుకోవడం లేదంటూ మండి పడుతున్నాయి. ఈ క్రమంలోనే ఆల్‌పార్టీ మీటింగ్ పెట్టాలని లేఖ రాశాయి. అందుకే అమిత్‌షా నేతృత్వంలో భేటీకి పిలుపునిచ్చింది కేంద్రం. కేంద్ర సర్కారు ఇన్ని రోజుల తర్వాత అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. 50 రోజులుగా మణిపూర్ మండుతుంటే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మౌనం వహించారని మండిపడ్డారు. ప్రధాని దేశంలో లేని సమయంలో అఖిలపక్ష సమావేశం పెట్టారని, ఈ భేటీ ప్రధానికి ఏమాత్రం ముఖ్యం కాదని స్పష్టమైందని ఆయన విమర్శించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన రాహుల్ గాంధీ.. కేంద్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.