Chaina Vs US : అమెరికా - చైనా మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. చైనా, అమెరికాల మధ్య తైవాన్ వివాదం తారస్థాయికి చేరింది. తైవాన్ విషయంలో అగ్రరాజ్యం జోక్యం తగదంటూ ఎప్పటికప్పుడు హెచ్చరికలు చేస్తోంది చైనా. అయితే తాజాగా అమెరికా హౌజ్ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ లో అడుగు పెట్టారు.యుద్ధ విమానాలు సెక్యూరిటీగా ఉండగా ఆమె విమానం తైవాన్‌లో ల్యాండ్ అయింది.
నాన్సీ పెలోసీ పర్యటనను చైనా తీవ్రంగా పరిగణిస్తోంది. అమెరికా భారీ మూల్యం చెల్లించక తప్పదు అని చైనా ఇప్పటికే వార్నింగ్ ఇచ్చింది. మంగళవారం రోజున పెలోసీ మలేషియాలో గడిపారు.
ఆసియా టూర్‌లో ఉన్న నాన్సీ .. తైపెయి వెళ్లాలని ముందుగానే నిర్ణయించుకున్నారు. తైవాన్ అంశంలో అమెరికా, చైనా మధ్య కొన్నాళ్ల నుంచి ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తైవాన్‌ను తమ భూభాగం చైనా భావిస్తోంది. కానీ అమెరికా ప్రత్యేక దేశంగా భావిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ హయాంలో తైవాన్‌తో సైనిక బంధాన్ని అమెరికా మరింతగా పెంచుకుంది. ఏకంగా 1,800 కోట్ల డాలర్లకు పైగా విలువైన ఆయుధాలను విక్రయించింది. బైడెన్ కూడా ఈ ధోరణిని మరింతగా కొనసాగిస్తున్నారు. తైవాన్‌ను విలీనం చేసుకునేందుకు బలప్రయోగానికి వెనకాడేది లేదని చైనా పదేపదే చెబుతూనే ఉంది.
2049కల్లా ‘అత్యంత శక్తిమంతమైన చైనా’ కలను నిజం చేసేందుకు తైవాన్ విలీనం తప్పనిసరని చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ ప్రకటించారు కూడా. చైనా ఫైటర్ జెట్లు, బాంబర్లు, నిఘా విమానాలు నిత్యం తైవాన్ చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పుడు చైనా హెచ్చరికలను కాదని అమెరికా హౌస్ స్పీకర్ తైవాన్‌లో అడుగు పెట్టారు. అడుగు పెట్టడంతో పెద్ద ఎత్తున అమెరికా నిరసన వ్యక్తం చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే చైనా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది.
ఈ క్రమంలో రెండు దేశాల మధ్య యుద్దం లాంటి పరిస్థితులు ఏర్పడతాయా అన్న చర్చ ప్రారంభమమయింది. ఇప్పటికే ఉక్రెయిన్ - రష్యా మధ్య ఎడతెగని యుద్ధంతో ప్రపంచం అనేక విధాలుగా నష్టపోయింది. ఇప్పుడు రెండు అగ్రదేశాల మధ్య పోరాటం అంటే్.. ఇక మూడో ప్రపంచ యుద్ధమేనన్న అభిప్రాయం సహజంగానే వినిపిస్తుంది.