AL Qaeda New Leader: అల్‌ఖైదా చీఫ్‌ అల్‌-జవహరీ (71)ని అమెరికా మట్టుబెట్టడంతో నిషేధిత ఉగ్రసంస్థ తదుపరి నాయకుడు ఎవరనే విషయంపై పెద్ద చర్చ నడుస్తోంది. అమెరికా డ్రోన్ దాడిలో అల్‌ఖైదా నాయకుడు హతమై గంటలు గడవక ముందే కొత్త నాయకుడి పేరు తెర మీదకు వచ్చింది. అల్‌ ఖైదా వ్యవస్థాప సభ్యుడిగా, సీనియర్‌ మెంబర్‌గా, సంస్థలో నెంబర్‌ త్రీ పొజిషన్‌లో ఉన్న సైఫ్‌ అల్‌-అడెల్‌కు తర్వాతి నాయకత్వ పగ్గాలు అప్పగించే అవకాశం ఉన్నట్లు సమాచారం.  


యమా డేంజర్


ఎఫ్‌బీఐ రికార్డుల ప్రకారం సైఫ్‌ అల్‌-అడెల్‌ 1960-63 మధ్యలో జన్మించాడు. జవహరీ లాగే అడెల్‌ కూడా ఈజిప్ట్‌ పౌరుడే. అక్కడి ఆర్మీలో కల్నల్‌ ర్యాంకుతో పని చేశాడు. అతనికి ఎక్స్‌ప్లోజివ్‌ ఎక్స్‌పర్ట్‌గా పేరు ఉంది. జవహరీ స్థాపించిన ఇజిప్టియన్‌ ఇస్లామిక్‌ జిహాద్‌లో సైఫ్‌ అల్‌-అడెల్‌ పని చేశాడు.






గతంలో అమెరికన్లను హతమార్చిన ఘటనలు, అమెరికన్లకు చెందిన ఆస్తుల విధ్వంసం, అమెరికా భద్రతా విభాగాల్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం తదితర ఆరోపణలు అతనిపై  ఉన్నాయి. అందుకే ఎఫ్‌బీఐ సైఫ్‌ అల్‌ అడెల్‌ను మోస్ట్‌ వాంటెడ్‌గా ప్రకటించింది. 


ఒసామా బిన్ లాడెన్ సెక్యూరిటీ చీఫ్‌గా కూడా సైఫ్ అల్-అడెల్ పనిచేశాడు. 2001 నుంచే ఎఫ్‌బీఐ మోస్ట్-వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు. 


డ్రోన్ దాడిలో


అల్‌ఖైదా చీఫ్‌ అల్‌-జవహరీని హతమార్చినట్లు జో బైడెన్‌ అధికారికంగా ప్రకటించారు. అఫ్గానిస్థాన్‌ రాజధాని కాబుల్‌లో జరిపిన డ్రోన్‌ దాడిలో జవహరీని మట్టుబెట్టినట్లు ఆయన తెలిపారు.



అల్‌ఖైదా చీఫ్ అల్- జవహరీ.. ఇంకెప్పటికీ అఫ్గానిస్థాన్‌ను ఉగ్రవాదులకు అడ్డాగా మార్చలేడు. ఎందుకంటే అతను హతమయ్యాడు. అమెరికా సేనలు అతడ్ని మట్టుబెట్టాయి. 9/11 దాడిలో ప్రాణాలు కోల్పోయిన 2977 మంది కుటుంబాల బాధకు, ఆవేదనకు జవహరీ మరణం ఓ ముగింపుగా భావిస్తున్నాను. వారికి ఇన్నాళ్లకు న్యాయం జరిగిందని నమ్ముతున్నా.                                                    "
-జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు



ఈ ఆపరేషన్‌పై ట్విట్టర్‌లోనూ బైడెన్‌ స్పందించారు. అమెరికా ప్రజల జోలికొస్తే కచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామని వార్నింగ్ ఇచ్చారు.


Also Read: USA Vs China: డ్రాగన్ వార్నింగ్‌తో అమెరికా అలర్ట్- తగ్గేదేలే అంటూ 4 యుద్ధ నౌకల మోహరింపు


Also Read: Monkeypox Cases in India: దేశంలో 8కి చేరిన మంకీపాక్స్ కేసులు- కూల్‌గా ఉండమని కేంద్రం సూచన