పాలకూర పెడితే తినే పిల్లలు చాలా తక్కువ. అసలు ఆకుకూరలను చూస్తేనే ముఖం మాడ్చుకుంటారు. తినడానికి ఇష్టపడరు. అలాగని ఎన్నాళ్లు వారికి ఆకుకూరలు పెట్టకుండా ఉంటారు? అందుకే ఆకుకూరలతో రైస్‌లు వండి పెడితే వారికి తెలియకుండానే తినేస్తారు. ఎందుకంటే అది ఆకుకూరతో వండినట్టు వారికి తెలియదు. ముఖ్యంగా పాలకూర కచ్చితంగా తినాల్సిన ఆహారం. ఇందులో ఎన్నో పోషకాలు ఉంటాయి. అందుకే మీ పిల్లల లంచ్ బాక్సుకు ఇలా సింపుల్ గా పాలకూర రైస్ చేసి పెట్టండి. రుచి అదిరిపోతుంది కాబట్టి తినేస్తారు. కొంతమంది పాలకూరను నేరుగా మిక్సీ చేసి కలుపుతారు. దీనివల్ల పచ్చివాసన వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నూనెలో వేయిస్తే పచ్చివాసన పోతుంది.  


కావాల్సిన పదార్థాలు
బాస్మతి అన్నం - ఒక కప్పు
పాలకూర తరుగు - ఒక కప్పు
ఉల్లితరుగు (నిలువుగా) - పావు కప్పు
పచ్చి మిర్చి - రెండు
పచ్చి బఠానీలు - పావు కప్పు
ఉప్పు - రుచికి సరిపడా
నూనె - అరస్పూను


తయారీ ఇలా...
1. ముందుగా బాస్మతి రైస్ వండి పెట్టుకోవాలి. 
2. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేయాలి. అందులో పాలకూర ఆకులు వేసి వేయించాలి. 
3. పాలకూరలోని నీళ్లు దిగి, ఇంకిపోయాక ఆకులు దగ్గరగా అవుతాయి. 
4. అప్పుడు వాటిని మిక్సీలో వేసి పేస్టులా చేసుకోవాలి. 
5. ఇప్పుడు అదే కళాయిలో నెయ్యి వేసుకోవాలి. 
6. ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి తరుగు, పచ్చి బఠానీలు వేసి వేయించాలి.
7. అవన్నీ వేగాక మెత్తని పేస్టులా చేసుకున్న పాలకూర పేస్టు, ఉప్పు వేసి కలుపుకోవాలి. 
8. అన్నీ వేగాక ముందుగా వండి పెట్టుకున్న అన్నాన్ని కలిపేసుకోవాలి. అంతే పాలకూర రైస్ సిద్ధమైనట్టే. 


తినడం వల్ల కలిగే లాభాలు
 పాలకూర తినడం వల్ల చాలా ఆరోగ్యలాభాలు కలుగుతాయి. విటమిన్ ఎ, సి లు పుష్కలంగా లభిస్తాయి. చర్మం కాంతిమంతంగా మారుతుంది. మచ్చల్లాంటివి రాకుండా ఉంటాయి. చర్మ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని కూడా పాలకూరలోని పోషకాలు తగ్గిస్తాయి. అధికరక్తపోటు ఉన్న వారికి పాలకూర చాలా మేలు చేస్తుంది. పొటాషియం అధికంగా ఉంటుంది కాబట్టి రక్తపోటును అదుపులో ఉంచుతుంది. రక్తసరఫరా కూడా మెరుగుపడుతుంది. దీనిలో విటమిన్ కె లభిస్తుంది. ఇది గాయాలైనప్పుడు రక్తం పోకుండా త్వరగా గడ్డకట్టేలా చేస్తుంది. అలాగే ఫైబర్ కూడా అధికంగా లభిస్తుంది. ఇది జీర్ణసమస్యల నుంచి బయటపడేలా చేస్తుంది. మలబద్ధకం రాకుండా అడ్డుకుంటుంది. బరువు పెరగకుండా అడ్డుకుంటుంది. 


Also read: మీ డైట్‌లో ఈ ఆరు సూపర్ ఫుడ్స్ చేర్చుకుంటే ఆరోగ్యానికి తిరుగే ఉండదు


Also read: బియ్యపు నీళ్లతో శుభ్రం చేసుకుంటే నిజంగానే జుట్టు బాగా పెరుగుతుందా? పట్టుకుచ్చులా మెరుస్తుందా?