జుట్టు పొడవుగా, అందంగా ఉండాలని ఏ అమ్మాయి మాత్రం కోరుకోదు? మగవాళ్ల కన్నా ఆడవాళ్లకి జుట్టుపై ప్రేమ ఎక్కువ. అదే వారి అందాన్ని రెట్టింపు చేస్తుందని నమ్ముతారు. కానీ జుట్టు ఊడిపోవడం, కళా విహీనంగా మారడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. వాతావరణంలో మార్పులో లేక తినే ఆహారంలో పస లేకపోవడమో తెలియదు కానీ వెంట్రుకలు చిట్లిపోతూ, రాలిపోతున్నాయి. జుట్టును కాపాడుకోవాలంటే కొన్ని చిట్కాలు తెలుసుకుని పాటించాల్సిందే. అందులో ఒకటి బియ్యం నీళ్లు. కొరియన్లు తమ జుట్టును కాపాడుకునేందుకు ఫాలో అయ్యే చిట్కా ఇది. 


ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం... బియ్యం నీళ్లు మీ జుట్టును కాపాడతాయి. పొడవుగా పెరిగేలా చేస్తాయి. పట్టులా మెరిసేలా చేస్తాయి. పురాతన కాలంలోని మహిళలు తమ జుట్టును ఇలాగే కాపాడుకునేవారట. ఆసియా సంస్కృతిలో ఎప్పట్నించో ఇది భాగమై ఉంది. బియ్యం నీటిలో జుట్టుకు అవసరమయ్యే ఎన్నో రకాల ఖనిజాలు, విటమిన్ బి, సి, ఇలతో పాటూ యాంటీ ఆక్సిడెంట్లు, ఫోలిక్ యాసిడ్, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి. అధ్యయనాల ప్రకారం బియ్యం నీటిని క్రమం తప్పకుండా వాడడం వల్ల జుట్టు మందంగా పెరుగుతుంది. 


బియ్యం నీళ్ల తయారీ ఇలా...
1. ఓ పిడికెడు బియ్యం తీసి ఓసారి కడిగేయాలి. 
2. వాటిని ఒక గిన్నెలో నీరు వేసి అందులో వేయాలి. 
3. కొన్ని గంటల పాటూ వాటిని అలా వదిలేయాలి. 
4. నీరు తెల్లగా, మందంగా మారేవరకు అలాగే ఉంచండి. 
5. ఇప్పుడు బియ్యాన్ని వడకట్టేసి తీసేయాలి. 
6. మిగిలిన బియ్యం నీళ్లను పన్నెండు గంటల పాటూ పక్కన పెట్టాలి. 
7. ఆ తరువాత ఒక స్ప్రే బాటిల్ లో వేసి దాచుకోవాలి.
8. తలకు స్నానం చేశాక చివర్లో ఈ బాటిల్ తో నీటిని స్ప్రే చేయాలి. మాడుకు తగిలేలా చల్లుకోవాలి. అయిదు నిమిషాల తరువాత సాధారణ నీటితో కడిగేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు బాగా పెరుగుతుంది. 


లాభాలు ఎన్నో...
బియ్యం నీటిలో ఎన్నో విటమిన్లు, అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నిస్తాయి. బియ్యం నీటిలో ఉండే నియాసిన్ జుట్టు కుదుళ్లను బలపరుస్తుంది. రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. జుట్టు చివర్లు చిట్లడం, నిస్తేజంగా మారడం వంటి సమస్యలను బియ్యం నీరు దూరం చేస్తుంది. రైస్ వాటర్ జుట్టు డీహైడ్రేషన్ బారిన పడకుండా చూస్తుంది. తేమ వంతంగా మారుస్తుంది. తద్వారా జుట్టు మెరిసేలా చేస్తుంది. 


Also read: మధుమేహం రాకుండా ఉండాలన్నా, వచ్చాక అదుపులో ఉండాలన్నా దివ్యౌషధం ఇదే


Also read: అన్ని సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారమా? మానసికంగా దృఢంగా మారడం ఎలా?






























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.