తెలుగు వారి ఆరాధ్య నటుడు సీనియర్ ఎన్టీఆర్. అతని నాలుగో కూతురు ఉమామహేశ్వరి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆమె కొంతకాలంగా డిప్రెషన్లో ఉన్నట్టు, అనారోగ్యంతో బాధపడుతున్నట్టు సమాచారం. ఆ అనారోగ్యం వల్లే ఆమె తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్ధికంగా అన్నీరకాలుగా బలంగా ఉన్న వ్యక్తులు, సంఘంలో పెద్ద పేరున్న మనుషులు కూడా అన్నీ సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారంగా భావిస్తున్నారు. ఆత్మహత్యకు వారిని ఉసికొల్పేది డిప్రెషన్. ఎవరైనా తీవ్ర డిప్రెషన్ బారిన పడ్డాకే ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన వస్తుంది.డిప్రెషన్‌తో బాధ పడుతూ ఆ స్థితి నుంచి బయటపడేందుకు చనిపోవడాన్నే దారిగా ఎంచుకుంటున్నారు. 


ఎంతో మంది సెలెబ్రిటీలు
ఇలియానా, షారూఖ్ ఖాన్, దీపిక పడుకోన్, అనుష్క శర్మ... వీరంతా డిప్రెషన్‌లో కూరుకుపోయి, తిరిగి బయట పడినవారే. ఇక సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేవలం 34 ఏళ్లకే డిప్రెషన్‌తో ఆత్మహత్య చేసుకున్నారు. ఏంటి ఈ డిప్రెషన్? ఏ లోటు లేని వారిని కూడా ఎందుకు కాటేస్తోంది? దీన్నుంచి ఎలా బయటపడొచ్చు? ఇప్పుడు సమాజం కచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే. 


ఓ సర్వే ప్రకారం మనదేశంలో దాదాపు  14 శాతం మంది డిప్రెషన్ వంటి మానసిక సమస్యలతో బాధపడుతున్నారు. వీరిలో పది శాతం మందికి కచ్చితంగా వైద్య సహాయం అందాల్సిన అవసరం ఉంది. కానీ చాలా మందికి వైద్య సహాయం తీసుకోవాలన్న ఆలోచన కూడా రావడం లేదు, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనే వస్తుంది. 


ఏమిటీ డిప్రెషన్?
ఇదొక మానసిక రుగ్మత. మానసిక కుంగుబాటు అని కూడా పిలుస్తారు. దీనికి వయసు, లింగంతో పని లేదు. ఎవరికైనా, ఎప్పుడైనా రావచ్చు. తీవ్రమైన మానసిక భావోద్వేగాలు వీరిలో కనిపిస్తాయి. కొంతమందిలో నిత్యం బాధపడుతూ ఉంటే, మరికొందరు ఎల్లప్పుడూ నిరుత్సాహంగా ఉంటారు. వీరితో ఏం మాట్లాడినా నెగిటివ్ మాటలే తప్ప, పాజిటివ్‌గా ఒక్క అభిప్రాయమూ చెప్పరు. 


ఎందుకు వస్తుంది?
డిప్రెషన్ ఎందుకు వస్తుందో చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి. కొందరికి పెద్ద జబ్బుల కారణంగా భయం వేస్తుంది. ఇక ఆ జబ్బు తగ్గదనే ఆలోచనతో డిప్రెషన్ మొదలవుతుంది. మరికొందరిలో ఆప్తుల్ని కోల్పోయినప్పుడు, జీవిత భాగస్వామి దూరం అయినప్పుడు డిప్రెషన్ ఎటాక్ చేసే అవకాశం ఉంది. అలాగే శరీరం ఫిట్‌గా లేని వారిలో కూడా మానసిక సమస్యలు దాడి చేస్తాయి. ఆహారం సరిగా తిననివారిలో, కొన్ని రకాల మందులు తీసుకునేవారిలో, మెనోపాజ్ వచ్చిన వారిలో, నిద్రలేమి సమస్యతో బాధపడేవారిలో  డిప్రెషన్ వంటి సమస్యలు వచ్చే అవకాశం పుష్కలం. 


లక్షణాలు ఇలా ఉంటాయి..
డిప్రెషన్ బారిలో పడిన వారు, ఆత్మహత్యా ఆలోచనలు వచ్చే వారు ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు. ఏడుస్తూ ఉంటారు. ఆందోళనపడుతుంటారు. చిన్నచిన్న విషయాలకే అరుస్తుంటారు. సహనం ఉండదు. ప్రతికూల ఆలోచనలతో ఉంటారు. చావు గురించి మాట్లాడుతుంటారు. ఇలాంటి వారు కచ్చితంగా వైద్యులను సంప్రదించాలి. 


చికిత్స ఉందా?
డిప్రెషన్ వంటి మానసిక సమస్యలకు చికిత్స ఉంది. ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు.కాగ్నటివ్ బిహేవియరల్ థెరపీ, యాంటీ డిప్రెసెంట్ మందుల ద్వారా సాధారణ మనుషులుగా మారుస్తారు. ధ్యానం, వ్యాయామం, ఆర్ట్ థెరపీలు కూడా డిప్రెషన్ నుంచి బయటపడేందుకు సహకరిస్తాయి. అలాగే ఎంతో మంది మానసిక వైద్యులు ఇలాంటి రోగులకు వైద్యసాయం చేసేందుకు సిద్దంగా ఉన్నారు.  


మానసికంగా దృఢంగా ఇలా...
ప్రతి మనిషికి సమస్యలు వస్తాయి. అన్నింటికీ చావే పరిష్కారం అనుకుంటే ప్రపంచంలో సగం జనాభా సూసైడ్ చేసుకోవాల్సిందే. మానసికంగా ఆరోగ్యం చేజారుతున్నట్టు అనిపిస్తే ప్రాథమిక దశలోనే జాగ్రత్త పడాలి. నెగిటివ్ ఆలోచనల నుంచి దూరంగా ఉండాలి. ఒంటరిగా ఉండుకుండా నలుగురితో కలిసి ఉండేందుకు ప్రయత్నించాలి. మెదడుకు ఆలోచించే అవకాశం ఇవ్వకుండా మిమ్మల్ని మీరు బిజీగా మార్చుకోండి. ముఖ్యంగా నెగిటివ్ విషయాలు మాట్లాడేవారిని దూరంగా పెట్టండి. అలాగే వైద్యులను కలిసి మందులు వాడండి. కేవలం కొన్ని రోజుల్లోనే మీకు సరికొత్తగా పుట్టిన  ఫీలింగ్ వస్తుంది. డిప్రెషన్ ఛాయలు చాలా మేరకు తగ్గుతాయి. 



Also read: మీ పిల్లలు తొమ్మిది గంటలకన్నా తక్కువ నిద్రపోతున్నారా? ఈ నష్టాలు తప్పవంటున్న కొత్త అధ్యయనం


Also read: మీల్ మేకర్‌ను ఇలాగే తయారుచేస్తారు, తింటే ఎంతో ఆరోగ్యం





























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.