డయాబెటిస్ ఇప్పుడు ప్రపంచదేశాలకు పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. నలభై ఏళ్లు దాటాయో లేదో మధుమేహం దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటోంది. కొంతమందిలో అంతకన్నా తక్కువ వయసుకే వచ్చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి పదిమందిలో ఒకరికి మధుమేహం ఉన్నట్టు అంతర్జాతీయ గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ జనాభాలో ప్రస్తుతం  యాభైకోట్ల మందికి పైగా మధుమేహవ్యాధిగ్రస్తులు ఉన్నట్టు లెక్క. ప్రతి ఏటా ఈ సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇక మనదేశం విషయానికి వస్తే ఎనిమిదికోట్ల మంది డయాబెటిస్ బాధపడుతున్నట్టు అంచనా. ఈ సంఖ్య ఇంకా పెరుగుతోంది. అందుకే డయాబెటిస్ ను తక్కువ అంచనా వేయకూడదు. తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. 


వారానికోసారి తినండి
మధుమేహం వచ్చాక అదుపులో ఉంచడానికి కష్టపడే బదులు రాకుండా చూసుకోవడమే ఉత్తమమైన పద్దతి.వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటూ మంచి ఆహారంతో మధుమేహం బారిన పడకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. మధుమేహాన్ని అడ్డుకునే శక్తి ఉన్న కూరగాయలను తింటూ ఉండాలి. అందులో ముఖ్యమైనది మునగాకు కూర. మునగాకులు పెద్ద ఖరీదేమీ కాదు. అన్ని ఆకుకూరల్లో అది కూడా ఒకటి. అయిన మనలో చాలా మంది మునక్కాడలు తినడానికి ఇష్టపడతారు కానీ మునగ ఆకులు తినేందుకు ఇష్టపడరు. దాన్ని పప్పులో వేసుకుని వండుకుంటే మంచి రుచిగా ఉంటుంది. పాలకూర, తోటకూర, చుక్కకూరలా మునగాకులను మీకు నచ్చినట్టు వండుకోవచ్చు. వారానికోసారైనా వీటిని తినడం వల్ల చాలా ఆరోగ్యం. మంచి ఆహారం తింటే సరిపోదు ధూమపానం, మద్యపానం కూడా మానేయాలి. 


వారు తిన్నా మంచిదే...
ఇక మధుమేహం వచ్చినవారు దాన్ని కంట్రోల్ లో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. వీరు ప్రతి మూడురోజులకోసారి మునగాకులను తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇది మధుమేహాన్నిఅదుపులో ఉంచుతుంది.దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ డయాబెటిక్ లక్షణాలు అధికం. బరువు కూడా పెరగరు. అందుకే కచ్చితంగా మునగాకుల కూర తినమని సిఫారసు చేస్తున్నారు ఆరోగ్య నిపుణులు. మునగాకులను డైట్ లో భాగం చేసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి. కాబట్టి మధుమేహం కారణంగా వచ్చే సైడ్ ఎఫెక్టులు కూడా దాడి చేయవు. కంటి చూపు మందగించడం, కిడ్నీ వ్యాధులు రావడం వంటివి జరగవు. 


మునగాకుల నిండా ప్రొటీన్, కాల్షియం, పొటాషియం, ఐరన్, విటమిన్ సి, మెగ్నీషియం, బి విటమిన్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ఈ కూరను పిల్లలకు పెట్టడం వల్ల వారికీ ఎంతో మేలు జరుగుతుంది. మునగాకును ఏదో ఒక రూపంలో రెండు రోజులకోసారి తీసుకోవడం వల్ల క్యాన్సర్ కూడా రాకుండా చూసుకోవచ్చు. మునగాకు రసం రక్తంలో షుగర్ లెవెల్స్ ను పెరగకుండా అడ్డుకుంటుంది. కాబట్టి తీవ్ర మధుమేహ వ్యాధితో బాధపడుతున్న వారు రెండు రోజుకోసారి మునగాకు రసాన్ని తాగితే మంచిది. 


Also read: అన్ని సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారమా? మానసికంగా దృఢంగా మారడం ఎలా?


Also read: తియ్యటి అరటిపండు అట్లు, పిల్లలకు బెస్ట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ





























గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.