గరుడ పంచమి ప్రత్యేకత
గరుత్మంతుడు అంటే శ్రీ మహావిష్ణువు వాహనం. సూర్యుడి రధసారధి అయిన అనూరుడికి తమ్ముడు. మేరు పర్వతంతో సమానమైన శరీరం కలవాడు, సప్తసముద్రాల్లోని జలాన్నంతటినీ ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్టగల రెక్కల బలం కలవాడు. అందుకే గరుత్మంతుడికి సువర్ణుడు అనే పేరు కుడా ఉంది. గరుడపంచమికి సంబంధించి భవిష్యత్ పురాణంలో ప్రస్తావన ఉంది. కశ్యపుడు , వినతల కుమారుడు గరుడుడు.
గరుత్మంతుడి పుట్టుక
సముద్రమధనంలో "ఉచ్పైశ్రవం" అనే గుఱ్ఱం ఉద్భవించింది. అది తెల్లని వర్ణంతో ఉంటుంది. ఓ రోజు వినత ఆమె తోడికోడలు కద్రువ కలసి విహారానికి వెళ్లినప్పుడు ఆ తెల్లటి గుర్రాన్ని చూస్తారు. కద్రువ...వినతతో గుఱ్ఱం తెల్లగా ఉన్నా తోకమాత్రం నల్లగా ఉంది అని చెబుతుంది. వినత మాత్రం గుర్రం మొత్తం తెల్లగానే ఉందంటుంది. వాళ్లిద్దరూ పందెం వేసుకుంటారు. ఎవరు చెప్పిన మాట నిజమైతే ...ఓడిన వారు దాస్యం చేయాలనే షరతు విధించుకుంటారు. ఇక్కడే కద్రువ తన కపట బుద్ధి చూపిస్తుంది. తన సంతానమైన నాగులను పిలిచి అశ్వానికి వేలాడాలని కోరగా వారెవ్వరూ అంగీకరించలేదు. కోపంతో ఊగిపోయిన కద్రువ " జనమేజయుని సర్పయాగంలో నశించాలని" శపించింది. ఒక్క కర్కోటకుడు అనే కుమారుడు మాత్రం తెల్లటి గుర్రం తోకను పట్టుకుని వేలాడి తల్లిని గెలిపిస్తాడు. అప్పటి నుంచీ వినత...కద్రువకు దాసిగా మారతుంది..
కొద్దికాలం తర్వాత గర్భవతి అయిన వినత..తనకు పుట్టిన రెండు గుడ్లలో ఓ గుడ్డు పగలగొట్టేస్తుంది. అది అప్పటికి పూర్తి ఆకారం ఏర్పడకపోవడంతో అనూరుడు బయటకు వస్తాడు. అమ్మా నీ తొందరపాటు వల్ల అవయవాలు పూర్తిగా ఏర్పడకుండానే జన్మించాను...అందుకే తొందరపడి రెండో గుడ్డు పగులగొట్టవద్దని చెప్పి సూర్యభగవానుడికి రథసారధిగా వెళ్లిపోతాడు. ఆ రెండో గుడ్డు నుంచి జన్మించిన వాడే గరుత్మంతుడు.
Also Read: సౌభాగ్యం, మంచి సంతానం, అన్యోన్యదాంపత్యం కోసం చేసే మంగళ గౌరీ వ్రత విధానం
తల్లికి దాస్యం నుంచి విముక్తి కల్పించిన గరుత్మంతుడు
కద్రువకు దాసిగా పనిచేస్తున్న తన తల్లికి విముక్తి కల్పించి రుణం తీర్చుకోవాలనుకుంటాడు గరుత్మంతుడు. అమృతం తెచ్చిస్తానని తన తల్లికి దాస్యం నుంచి విముక్తి కల్పించాలని కద్రువను కోరుతాడు. అమృతం కోసం నిప్పులు వెదజల్లుతూ బయలుదేరిన గరుత్మంతుడిని చూసి ఇంద్రుడు వణికిపోయి దేవతలంతా కలసి అమృతం కాపాడాలని చెబుతాడు.రేయింబవళ్లు యుద్ధం చేసిన గరుత్మంతుడు అమృతాన్ని సాధిస్తాడు. అమృతం తీసుకుని వెళ్లిపోతున్న గరుత్మంతుడిని సమీపించిన శ్రీ మహావిష్ణువు...నీ విజయ సాధనకు మెచ్చాను ఏం కావాలో కోరుకో అంటాడు. ఎప్పటికీ నిన్ను సేవించాలన్నదే నా కోరిక స్వామి అన్న గరుత్మంతుడికి వాహనంగా ఉండే వరం ఇస్తాడు శ్రీ మహావిష్ణువు.
అప్పుడు ఇంద్రుడు... ''అమృతం లేకుండానే మరణించకుండా ఉండే వరం పొందావు..ఇప్పుడు తీసుకెళుతున్న అమృతం ఎవరికైనా ఇస్తే వారు చావుని జయించి సమస్యలు సృష్టిస్తారంటాడు. అప్పుడు గరుత్మంతుడు...''నా తల్లిని రక్షించుకోవడానికే అమృతం కోసం వచ్చాను. నా మాట ప్రకారం కద్రువ సంతానమైన పాములకు ఈ అమృతం ఇచ్చి నా తల్లిని కాపాడుకుంటాను. వారు అమృతాన్ని తాగకముందే నువ్వు వెళ్లి దానిని దొంగిలించు. మనిద్దరి కోరికలు నెరవేరతాయని చెబుతాడు. అలా అమృతాన్ని పాములకు ఇచ్చి తన తల్లిని తీసుకెళ్లిపోతాడు గరుత్మంతుడు. స్నానమాచరించాకే అమృతం తాగాలన్న నిబంధన పెట్టిన ఇంద్రుడు పాములు తిరిగొచ్చేలోగా ఆ అమృతపాత్ర తీసుకెళ్లిపోతాడు.
నూతన దంపతులు తమ వైవాహిక జీవితం ఆనందంగా ఉండేందుకు, సంతానం గరుడుడిలా బలశాలిగా, మంచి వ్యక్తిత్వంతో ఉండాలని కోరుతూ "గరుడపంచమి" పూజ చేస్తారు.
Also Read: శ్రావణ మంగళ గౌరీ వ్రతం, ముందుగా పసుపు గణపతి పూజా విధానం