IND vs WI 2nd T20 highlights: వెస్టిండీస్‌ పర్యటనలో టీమ్‌ఇండియాకు తొలి ఓటమి ఎదురైంది. సెయింట్‌ కీట్స్‌లో జరిగిన రెండో టీ20లో కరీబియన్లు తొలి విజయం అందుకున్నారు. హిట్‌మ్యాన్‌ సేన నిర్దేశించిన 139 పరుగుల టార్గెట్‌ను సునాయసంగా ఛేదించేశారు. మరో 4 బంతులు మిగిలుండగానే 5 వికెట్ల తేడాతో గెలుపు బావుటా ఎగరేశారు. బ్రాండన్‌ కింగ్‌ (68; 52 బంతుల్లో 8x4, 2x6), డేవాన్‌ థామస్‌ (31*; 19 బంతుల్లో 1x4, 2x6) అదరగొట్టారు. అంతకు ముందు ఒబెడ్‌ మెకాయ్‌ (6/17) టీమ్‌ఇండియా పతనాన్ని శాసించాడు. హార్దిక్‌ పాండ్య (31; 31 బంతుల్లో 1x4, 2x6), రవీంద్ర జడేజా (27; 30 బంతుల్లో 0x4, 1x6) టాప్‌ స్కోరర్లు.


'కింగ్‌'లా ఆడారు!


సెయింట్‌ కీట్స్‌లో విండీస్‌ గతంలో 45కే ఆలౌటైంది! సహజంగా తక్కువ స్కోర్లు నమోదయ్యే పిచ్‌. అందుకే మోస్తరు లక్ష్యమే నిర్దేశించినా టీమ్‌ఇండియాకు గెలుపు అవకాశాలు ఉంటాయని భావించారు. కానీ కరీబియన్లు అలా జరగనివ్వలేదు. పట్టుదలగా ఆడారు. బ్రాండన్‌ కింగ్‌, కైల్‌ మేయర్స్‌ (8) మెరుగైన ఆరంభమే అందించారు. వికెట్‌ నష్టపోకుండా పవర్‌ప్లేలో 46 పరుగులు చేశారు. 6.1వ బంతికి మేయర్స్‌ను పాండ్య ఔట్‌ చేసినా కింగ్‌ మాత్రం దూకుడు ప్రదర్శించాడు. 39 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ చేశాడు. జట్టు స్కోరు 71 వద్ద పూరన్‌ (14)ను అశ్విన్‌ ఔట్‌ చేశాడు. మరికాసేపటికే హెట్‌మైయిర్‌ (6), కింగ్‌ పెవిలియన్‌ చేరడంతో 15.3 ఓవర్లకు విండీస్‌ 107/4తో కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో డేవాన్‌ థామస్‌ అజేయంగా నిలిచాడు. ఆచితూచి ఆడుతూనే సిక్సర్లు బాది తొలి విజయం అందించాడు. 


మెకాయ్‌ దెబ్బకు ఆలౌట్‌!


సెయింట్‌ కీట్స్‌లో టీమ్‌ఇండియాకు ఏదీ  అచ్చిరాలేదు. మ్యాచ్‌ 4 గంటలు ఆలస్యంగా మొదలైంది. ఆరంభం నుంచే ఒబెడ్‌ మెకాయ్‌ జట్టు పతనాన్ని శాసించాడు. ఖాతా తెరవక ముందే రోహిత్‌ శర్మ (0)ను ఔట్‌ చేశాడు. జట్టు స్కోరు 17 వద్ద ఓపెనర్‌ సూర్యకుమార్‌ (11)ను పెవిలియన్‌ పంపించాడు. ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించిన శ్రేయస్‌ అయ్యర్‌ (10)ను అల్జారీ జోసెఫ్‌, రిషభ్ పంత్‌ (24; 12 బంతుల్లో 1x4, 2x6)ను హుసేన్‌ ఔట్‌ చేయడంతో భారత్‌ 61కే 4 వికెట్లు నష్టపోయింది. ఈ క్రమంలో హార్దిక్‌ పాండ్య, రవీంద్ర జడేజా నిలకడగా ఆడారు. నాలుగో వికెట్‌కు 43 బంతుల్లో 43 పరుగుల విలువైన భాగస్వామ్యం అందించారు. జట్టు స్కోరు 104 వద్ద పాండ్యను హోల్డర్‌ ఔట్‌ చేశాడు. ఆ తర్వాత మెకాయ్‌ వరుసగా జడ్డూ, యాష్‌, దినేశ్‌ కార్తీక్‌ (7), భువీ (1)ని పెవిలియన్‌కు పంపించడంతో టీమ్‌ఇండియా 19.4 ఓవర్లకు 138కి ఆలౌటైంది.